కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-08
రాగం: అసావేరి - తాళం: అట
పల్లవి:
పొలతి యీచరితము పొలతీ తిలకింపవె ॥పొలతి॥
అనుపల్లవి:
లలితములౌ శుకుని పలుకులు విని పదితలలవాఁ డలిగి శిఖివలెనై వానితో
బలికెఁ బ్రియమాడి బ్రతికెడి నీవు సిగ్గులేక జగత్ప్రభుని నను బోధింప వచ్చేవు ఇపుడె చంపుదు నిను
దలప వధకర్హుఁడవు గావిక దలఁగిపో మూఢుఁడా యన వి-
హ్వలతచేఁ జనె శుకుఁడు మును బ్రాహ్మణుఁడు వానప్రస్థగతి నుండె ॥పొలతి॥
చరణములు:
సురలకు మేల్‌ కీడసురులకు చేయఁగ సరణి శుకుఁడు సేయు జన్నములు జెఱుప వజ్రదంష్ట్రుఁ
డరయఁగ నొకనాఁడా ధరణిసురుని డాయ నగస్త్యముని
యరుదేరఁ బూజించి యతఁడారగించి పొమ్మన మునియొప్పి పాయసాన్నము సేయ
తరి వేచి వజ్రదంష్ట్రాసురుఁ డగస్త్యుఁడైవచ్చి తగ మాంసాన్నము వేయుమని వేఁడిన
త్వర ఛాగమాంసము వంటకము వండిరి మునీశ్వరుఁడు భుజింప నయ్యెడ వచ్చి కూర్చున్న-
తఱి శుకునిభార్య నావేశించి రక్కసుఁడు మౌనికి
నరమాంసమిడి చనియె భ్రమియించి కూడుకూరలు ముని-
వరుఁ డరసి మనుజామిషయోగ్యమిది పెట్టితివని శపించె న-
సురవగుమనుచు నెఱుఁగనని శుకుఁ డరువఁగా ధ్యానించి ముని పలికె ॥పొలతి॥
అవిచారముచే నిట్లయ్యె నా నుడి దప్ప దనఘ త్రేతాయుగమున రావణుఁ జంప
రవికులమున హరి రాముఁడై పుట్టి నీరధి గట్టు సమయమున దశముఖుఁడంపఁ
దవిలి దూతకృత్యమునకుఁ జని రాముని దర్శించెదవు ముదమున నకలంకమౌ
నవనీసురత్వము నీకబ్బునని చనె గుంభభవుఁడు శుకుఁ డావిధమున సద్ద్విజుడయ్యె
నవల మాతామహుఁడగు మాల్యవంతుఁడు సవినయమున దానవవిభుని గని రాజా
అవనీసుత పురి జేరినది మొదలు దుర్ని మిత్తము లొద-
వె వినాశకరములై మేఘములు గురిసె నెత్తురుజడి
శివలింగములు రోదనముఁ జేసెడి కరుల కొమ్ములు నల్లనై-
నవి యావులీనె ఖరములఁ గని గవిసె నెలుకలు పిల్లితో ననియె ॥పొలతి॥
ఒక వింత దనుజేంద్ర యొక బోడిమగవాఁ డూరిక నిల్లిల్లు దిరుగు నిర్భయమున
వికటదంష్ట్రానన వివరము దెఱచుచు నిక్కాకులము మను తెఱఁగు నిను సీతను
సకలేశుఁడగు రామచంద్రున కిచ్చి మచ్చిక వచ్చి నీమఱుగు జొచ్చితినను
అకుటిల కరుణాఢ్యుఁడై నిన్ను గాచు శ్రీహరి రాముఁడై పరఁగునని తత్త్వము
ప్రకటముగా మాల్యవంతుఁడు దెల్ప రోషకషాయితలోచనుఁడై రావణుఁడు మా-
టికి దిక్పతుల గెలిచినా నవనీదేవ మునిరూపుని
ఒక పేదమానవుని రాఘవుని శరణొందునా మి-
న్నక లంచములు రిపులచేఁ గొనినావేమో గాన పొగడ దెవరి
నిఁక బుద్ధి గాదుడుగు తాతని యెంచినాను పొమ్మనిన నతఁడరిగె ॥పొలతి॥
రావణాసురువైభవముఁ జూచి రాముఁడు లక్ష్మణుని
చేవిలు గొని యర్ధచంద్రాస్త్ర మావింట దొడిగి నిండార దీసియేయ
నది యసురాధిపుపైఁ జనియొక్కటి పదినూ-
రై వెయ్యై సంఖ్యలను గడచి పదితలల కిరీటములు బడగొని వెలిగొడుగుల
వేవేగ ద్రుంచి యవలీలఁ బొదిఁజేరె శర-
మావేళ దనుజాగ్రణి సిగ్గున గుందీ
వేవేగ నంతఃపురావాసమునకేఁగి ధీవరుల వెరవరుల రావించి భావించి
లావు నిర్భయము శరోత్సవము నాపై దయయుఁ గల-
దే వీరులకు వార లాహవము సేయఁ జనుఁడు మదా-
జ్ఞావిముఖుల రణభయులఁ బీచమణంతు నన శేషాచల-
దేవుఁడగు రాఘవునిచే ననిఁ దెగిన మేలని తలంచిరందఱును ॥పొలతి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi