కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-07
రాగం: బిలహరి - తాళం: ఆది
పల్లవి:
విను సర్వమంగళా నయనకళావిజితాంబుజదళ శంఖసుందరగళా ॥విను॥
అనుపల్లవి:
ఇనకులమణి సేతువు మొదటను రామేశ్వరు నొనరించి పూజించి యే
మనుజుఁడు సేతుస్నానము రామలింగదర్శన సన్మానము
గను నతఁడు పంచమహాపాతకములను జయించు నా దయ నటంచు బలికెను ॥విను॥
చరణములు:
నరుడు కాశికిఁబోయి గంగాజలముగొని
యరుదెంచి రామేశ్వరుని నభిషేకించి
బరువు జలధిలోఁ బడవైవ బ్రహ్మప్రాపుఁడౌనని యీకరణి
తరణికులాబ్ధిసోముఁడు శ్రీరాముఁడు పల్క
దరుచరు లుత్సహించి చలము రెట్టించి
గురుగుల గతి దొంతరగా బలుగిరులు తరగతిఁ గొని తరలగా
అరుదుగ నలుఁడంది నాడు సేతువొనరిచె నోజఁ బదునాల్గుయోజనములిఁక ॥విను॥
ఇరువై యిరువైయొక్కటి యిరువైరెండిరువయిమూఁడు
మరునాడు మూఁడవనాడు చతుర్థపంచవా-
సరముల శతయోజనములు కపులు సేతువు పరువడి గట్టిరి జూడు హరి
వర పరివృతులయి దాశరథులు హనుమంతాంగదుల నెక్కి మైబొదల
మెఱసి సువేలాద్రికిఁ జని కాంచిరి పరిఘధ్వజతోరణమణీ
హిరణ్మయప్రాకారసౌధగృహవరవిటంకయై తనరు లంక పొంకము ॥విను॥
పదితలలను మణికిరీటములుంచి చెవుల స్వర్ణకుండలములు బెట్టి చేతులఁ
గదియ రతనాన కడ్యాలు గీలుకొల్పి కలితాంగుళముల నుంగరములు
పదిలపఱిచి ఱొమ్మున వేల్పుటేనుఁగుకొమ్ము పతకమై తనరార ఘనరుచిదేరఁ
ద్రిదశులఁ గెలిచిన బీరము తనపాదమునఁ దగు గండపెండేరము
*చలువగొడుగులనీడ రావణుఁడు విశాలసౌధమున నుండ యోధవరులతో ॥విను॥
[*పాఠాంతరము. "చదుర నుత్తరగోపురము మీద దశాననుండు కొలువుండె నిండుమనమున"]
అపుడు శుకుఁడను చారుఁ డారావణుని గని విపులమౌ దనుజసేనకు కపిసేనకు
నెపుడు సంధిగాదు దేవాసురులవలె నిఁక నొకపని తడవు సేయకు
నృపకుంజరునకు వైదేహి నిచ్చుటొండె జగడ మిచ్చుటొండె రాముఁడు సుగుణాభిరాముఁడు
విపులాత్మజ నేబలముగొని వెఱువకదెచ్చితి వాబలము
ఇపుడుజూపు నీసతుల లంక రమియింపుమని నీతోఁ దెల్పుమని పలికెననె ॥విను॥
శ్రీరామలక్ష్మణులు సుగ్రీవవిభీషణులు చెలఁగి నల్వురొక్కచో నున్నారు చూడు
వీరె లంక నశింపఁజేయఁజాలుదు రితర వీరులనేకు లున్నారెన్నుచో
సారమౌ ప్లవగసేన సంఖ్యసేయ నా తరమా మేరుమందరతుల్యులు యోధాగ్రేసరులు
చేరి విను లంకకెదురై పలుమా ఱదల్చుచు ధృతికిఁ గుదురై
మీఱి యూధపులు నూఱువేల్గొలువ మెలఁగునతఁడు దివాకరసుతుఁ డని పలికె ॥విను॥
ఇతఁ డగ్నినందనుఁడు సేనాపతి నీలుఁడు ఇతఁడు వాలికొడు కంగదుఁడు యువరా
జితఁ డక్షహంతయౌ హనుమంతుఁ డీఘనుఁడె సీతనీక్షించి చనె రాముని కడకు
ఇతఁడు శ్వేతుఁడు రంభుఁ డితఁడు శరభుఁడు పనసుఁడు
ఇతఁడు మైందుఁడు ద్వివిదుఁడు యోధాగ్రేసరుఁడు
ఇతఁడ విశ్వకర్మసుతుఁడు నలుం డీబలములెన్న లేఁడీశుఁడు
అతులశౌర్యు లతిబలాఢ్యులందఱు చతురు లసురవధకు దనుజవర యనియెను ॥విను॥
ఇరువదియొక్కవేల కోటు లిరువదియొకవేల శంఖము
లిరువదియొకవేల బృందములు సుగ్రీవుని మంత్రి-
వరసేన లన్యుల బలములెక్క పెట్ట నా వశము గాదు రేయుఁబగలు
బరమాత్ముఁ డాదినారాయణుఁడు రాముఁడు పరాపరశక్తి భూపుత్రి లోకజనయిత్రి
మఱి వారివలన జగము సంభవమాయె వారితో వైరము కొఱగా దఖిలమాత సీత నీవు
గోరి తెచ్చుకొనుట కార్చిచ్చు తెఱుఁగనె ॥విను॥
జలబుద్బుదమువలెఁ జంచలము సంసారము క్షణభంగురము కాయము పంచభూతముల
వలనై పంచవింశతితత్వాత్మకమై జడమై పొలుపొందుబట్టి తెలియ మాయము
ఇలనెవఁడు దీనియందు మమతసేయు మలమూత్రాదులగంప రోతకొంప హంకృతితెంప
సలుపుటేమిటికి కలుషము సుఖాదులఁ జెందునేది యది దేహము
కలుగ కర్తవనుట జీవునకు జన్మలయంబు లటుగాన మమత లణఁపుమనె ॥విను॥
అతిశుద్ధమతి నిర్మల మాత్మవిజ్ఞానరూప మచల మవ్యయంబు స్వజ్ఞానమున
వెతఁజెంది జీవుఁడు మోహితుఁడౌ గాన నీవు సన్మతిచే నాత్మ ననిశంబు
నుతియింపు దారపుత్రాదుల యందు విరక్తిఁ జెందు
సుతుఁడవు విశ్రవసునకు సుఖముల్‌ సతమనకు
క్షితిసుత రామునకిచ్చి రాజీవాక్షుని మఱుంగుఁజొచ్చి
బ్రతుకు మిల శేషశైలపతిభక్తి రావణా యని పల్కె శుకుఁడాయెడ నిఁక ॥విను॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi