యుద్ధకాండము-05
రాగం: కాపి - తాళం: ఆది
పల్లవి:
అళినీలకుటిలాలకా నిస్తులకస్తూరికాలంకృత ఫాలఫలకా సఖీజనతిలకా వినవె ॥అళి॥
అనుపల్లవి:
అల పక్తికంఠుఁ డంప శుకుఁడను నసురుఁడటువచ్చి వినువీథి నిల్చి
పలికె సుగ్రీవమహారాజ రావణుఁడు నిన్ గరపుమనిన మాటలనెను ॥అళి॥
చరణములు:
మంచికులమున జనించినావు కపిమండలాధిపతివైనావు
యెంచినా ననుజసమునిగాను నెపుడు నధముడఁ గుడువకపోవు మో-
హించి రాకొమరుసతి దెచ్చితే నీకేమి పురికేగుమిఁక నీవు
మించి సురులు లంకఁ జొరలేరెంత మీరని దశముఖుఁడు దెల్పెననె శుకుఁ ॥డళి॥
వానరు లానుడి విని పట్టికట్టి వానిఁ గొట్టిన నొచ్చి రామా
భానువంశాబ్ధిసోమ దూత లవధ్యులనక జంపెద రఘవిరామ దయ-
చే నివారింపుమనిన నభయమిచ్చితి వెఱవవలదనెను రామ-
క్ష్మానాథుండు కపిసేన శుకుఁడరసి మాదొరతో నేమందు నినజ యనె ॥అళి॥
వాలి మాయన్న యెటులట్ల నీవు వధకర్హుఁడ వసురాధమా
కాలమె వచ్చె నీకు సకులముగా నిను జంపు రాముఁడని తెల్పుమా యని
లీల నాదిత్యసుతుఁడు బలుక వాఁడేగి రావణునితో నుపమ-
శాలియై యదంతయును దెల్పిన విషాదహృదయుఁడై యుండె దనుజపతి ॥యళి॥
అటుమీదట రాముఁడబ్ధి యుప్పొంగుటఁ గని కనులెఱ్ఱఁగఁ జేసి
కుటిలభృకుటియై పలికె కనుఁగొను లక్ష్మణ నను గనక వారాశి ది-
క్తటము లాక్రమింపఁగడగె వీని మదమడంతుఁ గపులు శ్రమముఁ బాసి
చటులగతి నడిచిపోదురు గాకని చాపమెక్కిడి మహాశుగము దొడిగె ॥నళి॥
గడగడ వడఁకెను బుడమి దిశలవిసెఁ గడలి దివ్యతనువు ధరించి
వడిగా వచ్చి సన్మణులను రఘువరు ముందరనుంచి నమస్కరించి నే
జడుఁడను శ్రీరామ శుభనామ నాయెడఁ దప్పులను మన్నించి
కడుదయఁ గావు కావు భూతపంచకములకు జడిమ స్వధర్మమని పలికె ॥నళి॥
నీవు నిర్గుణుఁడ వవికారివి మాయావివౌ తఱి విరాడ్రూపు
నీవంగీకరించి జగముల నేర్పున సృజింతువౌర నీ వైపులో
దేవ నీ సత్త్వమున సురులయిరి విధిప్రముఖులకు నీవే ప్రాపు
భావజారిని కినుకచేఁ బొడమె భవ్యగుణసాంద్ర రాఘవేంద్ర యనె ॥నళి॥
పుండరీకాక్ష మాయామనుజతనుండవని నిను దెలియఁగల దే-
దండ మేమూర్ఖులకు సన్మార్గదము పశువులకు మునుకోల వలె నేనిఁక నీ
దండ చేరితి దండమయా కోదండధారి యభయ మిమ్మింక నే
నిండుభక్తి లంకకుఁ ద్రోవయ యిత్తు నీ కనుచు సరిత్పతి విన్నవించె ॥నళి॥
రిత్తవో దీమహాశరము దీని కిత్తఱి గురిఁ జూపుమని హరి
యొత్తి బల్కినను బాధించుచునున్నారు ఖలు ద్రుమకుల్యమను దరి నా
మొత్తముపై వేయుమని పల్కెను సముద్రుఁడు రఘువీరుఁడు నలరి
సత్తుగ శరము నేయ నాభీరుల రిత్తఁజేసి యపుడె పొదిఁ జేరెనది ॥యళి॥
చెలఁగి విశ్వకర్మసుతుఁ డానలునిచే సేతువొనరింపు మితఁడు
తొలుతనే వరముగొనె నిందుకని పలికి హరి కెరగి చనె సాగరుఁడు కడు
నలరె లక్ష్మణకపీంద్రులతో శేషాచలేశుఁడగు రఘువిభుఁడు
నలుని జలధికి సేతువుగట్టుమని సెలవొసంగె నగచరులు హర్షించి ॥రళి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi