కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-03
రాగం: కళ్యాణి - తాళం: జంపె
పల్లవి:
కాళీ విను సుజ్ఞానజనమానసకాసార కేళీవిహారమరాళి ॥కాళీ॥
అనుపల్లవి:
మేలుగోరి సురారి కోమలాంఘ్రులకు గేలు గదియించి విభీషణుఁ డన్నమన్నన
చాలఁ జెంది సభికులఁ దిలకించి దనుజేశ్వరుఁడు కామాతురుని గాంచి పలికె శ్రీ ॥కాళీ॥
చరణములు:
రావణా యీకుంభకర్ణుఁడు నీయింద్రజిత్తు మహోదర మహాపార్శ్వులు
దేవా యీకుంభనికుంభాతికాయు లీదేవాంతక నరాంతకులు మొదలౌ వీరులు నిను
గావలేరా రఘుకులేశ్వరుని బారి నీవు పడువేళ నిను సీతయను బల్‌గాము
గావుగొన్నది వెరవెన్న మఱిలేదు సీత నీవలెన్‌ జొరగావలెన్‌ హరి శరణనె ॥కాళీ॥
ఇనకులాగ్రణి బాణముల్‌ లంకాపురి ఘనంబుగనిండి రాక్షసుల ప్రాణముల్‌
గొనకమున్నె జానకి రాఘవున కొసఁగఁదగు కులగోత్రాకారులు నఖదంష్ట్రాయుధుల్‌
వనచరులు నిరుపమబలుల్‌ లంకఁజొచ్చి వారక గలంచక మును రామునకు సతిని-
మ్మనఘ నీవు బ్రదుకలేవు హరిసురేంద్రాదు లాదరించిన నిను హరించు రాముఁడనె ॥కాళీ॥
రాముఁడె నీపాలి మృత్యువు పాతాళలోకమునకేఁగినఁ బోనిచ్చునా
యేమందు నిన్ననిన తమ్ముని హితోక్తు లహితమాయె నన్న కౌషధము రోగిమెచ్చునా
యామినీచరగ్రామణి విధివశుఁడై యా మెయి విభీషణుని గని యోరి నే నొసఁగు
కామితార్థముల సమర్థత నొంది పొగరునఁ గాఱులాడుచు వైరులఁ బొగడెదవనె ॥కాళీ॥
కలిగినాఁడు విభీషణుఁ డనుశత్రుఁడు ఖలుఁడు కృతఘ్నుఁ డతనితో జెలిమి
దలఁపఁగూడునా దాయాది చెడగోరునను పలుకు నిజమాయె నొరుఁడిటు పలికిన బలిమి
దల తెగవ్రేతును బగదీర నసురకులాధమా నిను గాల్పనే యని దశముఖుఁడు
పలుక విని రోషమున విభీషణుఁడు నల్వురు మంత్రులును దా నెగసెను గదాయతభుజుఁడై ॥కాళీ॥
గగనమార్గమునందు నిల్చి విభీషణుఁడు గంభీరరవంబునఁ బల్కెను రావణా
అగడుఁ జెంది చెడిపోకు ప్రియవాదినై హితవాచరించు నను దిరస్కరించితివట్టైనా
తగిన మన్ననఁ జేసితిని మత్పితృసముఁడవు దశరథతనూజుఁడై యవతరించెఁ గాలుఁడు
జగతి రామరూపమై మహీజాత సీత యనఁగ జనించెను జనకునింట ననెనతఁడు ॥కాళీ॥
ధరణీభారము మాన్ప సీతారాములు దలంచిరి విధి ప్రేరితుఁడవై నేఁ
గఱపిన హితవాక్యములు వినవైతివి ప్రకృతి కరయ సాక్షిభూతముల వెలిలోను తానె
బెరయ నానారూపనామభేదముల భిన్నునివలెఁ దరువులం దనలుఁ డొకఁడైన
కరణి రాగవస్తుయోగమున రక్తస్ఫటికమనిన ట్లాహరి గుణాకరుఁడగుననె ॥కాళీ॥
కాల మవ్యక్తము ప్రధానపురుషులనఁగ నాల్గు ప్రధానపురుషులచే జగము
లీలఁ దనరు భగవంతుఁడు రాముఁడై సంహరించు నిన్ను నీవారితో నిది నిజమ్ము
బాళి నేఁ జని హరికి నేమమున మ్రొక్కి శ్రీలలర నుందునని విభీషణుఁడు వారల
జోలిమాలి భ్రమలఁ దోలి శేషాద్రిపతి యశోవిశాలుని సేవఁ జేయునపుడె చనె ॥కాళీ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi