కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-02
రాగం: శంకరాభరణ - తాళం: ఆది
పల్లవి:
వినవె మదవతీ సతీ వినయదయాదాక్షిణ్యలసన్మతీ ॥వినవె॥
అనుపల్లవి:
హనుమంతుచేనైన సాహసము గని సిగ్గునఁ దలవంచి రావణుఁడు
చనదు సురల నేనైన నిటుసేయనని మంత్రుల బిలువనంపి పలికె ॥వినవె॥
చరణములు:
హితులారా కదనవిజితవిమతులారా ప్రభంజన-
సుతుఁడు చేసిన పని గంటిరె శూరతమీఱఁ
గొతుకక లంకఁ బ్రవేశించి భూసుతఁ గాంచి యక్షాదులఁ బొలియించి
వితతమగు లంకఁ గాల్చి గెల్చి చనె వెరవేమి చెప్పుడనె దనుజపతి ॥వినవె॥
ఓ దేవా గానముదితమహాదేవా వలదు సీ-
తాదయితు వలని భయము జగత్త్రయజయప్రభావా
ఆ దేవేంద్రుఁ జెఱనిడె నీకొడు కలకాపతి యళికి పుష్పకమొసఁగె
నాదరింపు వరుణుని యమునికి భయమునొంద నిదెంతనిరి హితులు ॥వినవె॥
మయుఁడు బాలామణి నీకొసగి నయము చాలా గాంచె నీ
దయను మనుమంతుఁడిటు చేసెనని దనుజలోకపాలా-
మయమునఁ బడనేల కోఁతియని యేమఱియుంటి మతఁడందున బ్రదికి చనె
నియమింపు మొనర్తు మిల నమర్త్యగ నిర్వానరగా ననిరసురులు ॥వినవె॥
నిదురదేరి కుంభకర్ణుఁడు చదురుఁ జేరి యీమాటల
యుదుట గాంచి రావణునిఁ దిలకించి యో దోసకారి
పదరి యేపనిఁ జేసితివి దీన ఫలమేమి నీకిదె చేటుకాలము
చిదచిదాత్మకుఁడు రాముఁడు శ్రీహరి సీతాసతి శ్రీదేవి యనెను ॥వినవె॥
రామసౌమిత్రులఁ గపుల సంగ్రామభూమిఁ బొరిగొందు
సామి నేఁ గల్గి నీమదికి విచారమేమీ
శేముషీజితాబ్జయని యింద్రజిత్తు వల్క నత్తఱిని భాగవత-
గ్రామణి విభీషణుఁడు శేషాచలకాంతాంఘ్రు లెదనిడి సభకు జనె ॥వినవె॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi