కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-01
రాగం: భైరవి - తాళం: ఆది
పల్లవి:
శ్రీరాజరాజేశ్వరి యీ చరిత్ర మార్యనుతిపాత్రము ॥శ్రీరాజ॥
అనుపల్లవి:
చేరి దాశరథి మోదము మది మీఱ దయాశరధియై పలికె
మారుతి చేసినపని దేవతలచేఁ దీర దొరులతరమె సాగర మె-
వ్వారు దాటువారు లంక యెవ్వరికిఁ గాల్చి రాదీఱు సా-
మీరి వలన నేను రఘుకులము సౌమిత్రియు రవిసుతుడును బ్రతుక గలిగెననె ॥శ్రీరాజ॥
చరణములు:
ఈ సుగ్రీవుని భాగ్యమహిమ నుతియింపఁ దరముగాదు కడలి నక్రాహి
వైసారిణములకు పాదు ఇది దాఁట నేసరణినౌ నిఁక మీఁదు రావ-
ణాసురు గెల్చి యెట్లాసీతఁ జేకొననగు నిదేటి వాదు
మోసమాయ బలా యనిన రామునిఁ గని ప్లవగకులాగ్రణి పలికె
నీసముద్రమెంత రావణుఁడెంత యేమిటికీచింత గెలుపువింత
నీ సరి లేరని విల్లుఁ గొని నిల్వ నిన్నెదుర నెవరివశము
వే సంద్రము దాట నూహింపు రఘువీర రావణుని మృతునిగ దలంపుమనె ॥శ్రీరాజ॥
వానరవీరులు కామరూపు లనివార్యబలులు చూడు నీ పనికై యగ్ని-
లోనైన జొరనున్నారు నేడని భక్తి మానుషము లేర్పడ నాడు భాను-
సూనువాక్యముల కలరి యంజనిసుతు గని పుడమిఱేఁడు
నే నీచే లంకారూపము విని దాని పొంక మింకఁజేతునన
భూనుత దివ్యతేజోధికమై లంకాపురి త్రికూటగిరిపై నున్నది యొరపై
దాని చుట్టు వారాన్నిధి యగడ్త యగు కోట మణిహైరణ్మయము
పూని ధర్మార్థకామమోక్షముల నా నలరు చతుర్ద్వారముల ననె నతఁడు ॥శ్రీరాజ॥
తరుణిశశాంకులపై విరోధమున దమవారలకన్న మున్నొఱసె నన్న
కరణి గోపురములు మిన్నావరించెను పరిగెలు గృహములనన్న మేల్‌ చి-
త్తరువుకూటముల మణికవాటములఁ దనరు సుప్రసన్న
సరసోద్యానముల నడబావుల చలువచప్పరముల వరవిపణి
సరణుల దేవాలయముల ముత్యపుసరులఁ దోరణాలఁ దనరె శ్రీల
కిర వప్పురి నిక్కి చూడలేఁ డింద్రుఁడైన నలుచక్కి కరుల
హరుల రథసహస్రములనెక్కి సకలాస్త్రకుశలు లసురు లరయుదురనె నతఁడు ॥శ్రీరాజ॥
రాజసింహ మిట్లున్న రావణు బలరాజి నాల్గవపాలు హతమయ్యె నాచే
జేజే రామ పదివేలు ప్రణతుల్‌ నేఁ జేసెద నన్నేలు బంట-
నో జయశ్రీరమణ యనిన హరి హనుమంతుని మేలు
పూజ వాక్సుమములఁ జేసి తపనపుత్రుఁ గని సైన్యముల నడిపింపు మి-
దే జయముహూర్తమని రాముఁడానతీయ బ్రయాణభేరి వ్రేయించె శౌరి
ఆజి తనయుఁ డనిలాత్మజు నెక్కె నంగదుఁడు వహించె లక్ష్మణుని
ఆన ఖగచరేంద్రపాలిత కపిబలాళి యిల యీను గతి నడచె దక్షిణము ॥శ్రీరాజ॥
తరుచరులెగురుచు బరువులిడుచు రుచికరములయిన పండ్లుదిని తేనెలాని
గిరులెత్తుచుఁ బుట్టచెండ్లునా నెగరవైచుచు గొప్పగుండ్లు దాఁటుచు
హరి మేమే దశాస్యుఁ ద్రుంతుమేఁగె ననిరతనూఱేండ్లు
మఱి రేఁబగలనక వింధ్య సహ్య మలయాద్రులు ఘనకాననములును
ఉరువడి దాఁటి కర్కాటక కమఠ మకర ఝషోగ్రాభంగ రంగత్తరంగా-
కరమై భీకరమైన రత్నాకరముఁ జేరి యాదొర మైత్రిఁ గని
మురువుగ నిట సేన విడియ నియమింపుమనిన స్వామి మహాప్రసాదమనెను ॥శ్రీరాజ॥
ఆవేళ సీతను దలఁచి రాముఁ డాహా యని విరహార్తినొందె నేమందు
నావిభుఁడు సత్యజ్ఞానస్ఫూర్తిప్రజ్ఞానఘన కేవలానందమూర్తి యోగ-
కోవిదభావానువర్తి సుకీర్తి దేవతాచక్రవర్తి
శ్రీవిభు నెఱిఁగిన దుఃఖాదులు చెందనేర వొగినా ఘను నెనయునే
జీవాభిమానికే దుఃఖజాలము చిద్రూపమౌ పరమాత్మకు లేదు మా
భావమునకె శోకాదులు నిదురవోవఁగలవె యెఱుకేకా నిలిచెఁ
గావున శేషాద్రిపతిరాముఁడు సకలసాక్షియని తలఁపనయ్యె బుధులచే ॥శ్రీరాజ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi