కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
సుందరకాండము-10
రాగం: నవరోజు - తాళం: ఆది
పల్లవి:
సరిగా రీ సచ్చరిత్రము వినువారి కరయ నెవ్వారిలను గౌరీ ॥సరి॥
అనుపల్లవి:
తరుచరు లమ్మధువనపాలకుల నెన్నక తేనెలాని ఫలములు గొని కాపరుల
జరణతలతాడితులఁ జేసిన వెఱచఱచి దధిముఖాదులు జని
తరణిసుతున కెఱిఁగి వనభంగసరణి దెలిపిన నతఁ డెద బొదలె ॥సరి॥
చరణములు:
చూచి వచ్చె హనుమంతుఁడు సీతాసుందరీమణి నీవా మధువన
మాచెల్వమునఁ జొచ్చిరను రవిజుని మాట హరి వీనులలర విని
నా చెవి కవనిజఁ బేర్కొనినట్లున్నదనిన నౌనో మహాత్మా
రాచకార్యము నెఱపి హనుమత్ప్రముఖులిదె వచ్చిరని పిలువ వ-
నేచరుల నంపఁ జని మిము గపినేత ముదమున రమ్మనెననిరి ॥సరి॥
మిన్నుముట్టి యాడుచు వానరులు మరున్నందనాంగదుల ప్రాపున రామ-
సన్నిధిఁ బెన్నిది గన్నట్లు గని మ్రొక్కి రున్నతి మదిఁ బొదల
చెన్నలరఁ గంటి సీతను లోకమాత మీ సేమమరసె రామచంద్రరాజేంద్ర
విన్నప మశోకవని జానకి యున్నది కృశించి జడగట్టిన
పెన్నెఱులతో రామరామా యన్న నుడితోడ ననె మారుతి ॥సరి॥
నేను శింశుపాతరుశాఖలనుండి నీ కథ వివరించిన విని భూపుత్రి
వీనుల కమృతసమీనముగాఁ బల్కు వీఁడెవ్వడని యెంచిన
మానవతీమణి యెదుట వానరశిశువునై నిలిచి మ్రొక్కి నమ్మిక బుట్టునట్టుగా
పూని యాద్యంతములు తేటముగా నెఱుఁగఁజెప్పి ముద్రిక విభుఁ
డానవాలంపిరని యొసఁగిన నంది మిన్నందెననెఁ బావని ॥సరి॥
నను నమ్మి మాయమ్మ పల్కె రామునికెట్లు నామీద దయారసము
జనియించు నట్లు విన్నవించు నా యిడుములు గనినవాఁడవు గావా
అనిన రాఘవుఁడు నిన్నెడబాసినది మొదలు హా సీతాయని శోకించుచున్నాఁడు నేఁ
జని నీ యునికి దెల్ప నృపుఁ డనుజార్కసుతయుతుఁడై కపులఁ దో-
డ్కొనివచ్చి యరి వ్రచ్చి నిను జేకొనునంటి నంజనీసుతుఁడు ॥సరి॥
ఆనతీవమ్మ రామునియొద్దికన నభిజ్ఞానార్థముగఁ జూడారత్నమొసఁగి
ఆనాఁడు కాకము మదమడఁచుటఁ దెల్పుమనె సామి నీతోడ
నేను నా మఱది లక్ష్మణుని దుర్భాష లజ్ఞానముననంటి నది శమింపుమని
ఆ నెలఁత కన్నీరు మున్నీరన నించ నూరడించి ఘనో-
ద్యాన మగలించి యక్షముఖదనుజుల వధించితిననె నతఁడు ॥సరి॥
కొంకక రావణుఁ గాంచి భాషించి లంకాపురి గాల్చి సీతాజ్ఞచేఁ
బొంకముగా వచ్చితి రామ నీ పాదాంబుజము లౌదలదాల్చి
కింకరుఁడ దయజూడుమని వాయుజుఁడు బల్కిన రాఘవేంద్రుఁ డానందసాంద్రుఁడై
పంకజభవాదుల కశక్యము పవనసుత నీకే తగు నీపని
కింకొకటి సాటిగాదని గదియించెఁ గౌఁగిట రాముఁ డనిలజు ॥సరి॥
పరమాత్ముఁడనౌ నా పరిరంభణము దుర్లభము విను సామీరి యనె నెవ్వని
చరణాబ్జయుగళ తులసీదళమ్ములఁ బూజ సలిపిన శ్రీమీఱి
పరమపదమందు దురారామునిచే నాలింగితుఁడయ్యె హనుమంతుఁడేమందు
గరిమ నధ్యాత్మరామాయణ కావ్యమున సుందరకాండమిది
యరసి తెనిఁగించె సుబ్రహ్మణ్యకవి శేషగిరీశు పేరిట ॥సరి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi