కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
సుందరకాండము-09
రాగం: కర్ణాటకసారంగ - తాళం: ఆది
పల్లవి:
తరుణీ యీ చరిత్రము సరణి సుజనాదరణీయము ॥తరుణీ॥
అనుపల్లవి:
ఇరువదికన్నులను రోషానల మిరవై ప్రజ్వరిలను రావణుఁడు
హరిదాసుని హనుమంతుఁ గని వనచరాధమా నిను ద్రుంతు సీతను వధింతు
తరిమి రామలక్ష్మణుల నరిమురిఁ జంపి కపికులాగ్రణుల
తరణిసుతాంగదాదులఁ బొరిగొందు ధరణియందు యశము గందు ననియెను ॥తరుణీ॥
చరణములు:
నూరుకోట్ల రావణకీటములు నాతో సమానమా సురారి నేను
శ్రీరామదూతనై మీఱినాను నా పేరు హనుమంతుఁ డొకసారి గ్రుద్దితేను
ఓరీ నీపని దీఱు నీవు నీవారు నా కెంతమాత్రమురా దోసకారియని
మారుతి పోనాడ విని కిన్కచే నారాక్షసచూడామణి యా తిక్క-
దారి కోఁతికండలు తెగవ్రేసి భూతములకు బలిసేయుఁడని సెలవీయఁ
జేరి జంపగడఁగెడు భటుల నివారించి తన యన్నను గని
సారభాషణుఁడైన విభీషణుఁడు చారులెందు నవధ్యులందురనెను ॥తరుణీ॥
వానరుఁ జంపుట పాపమదిగాక వార్తలెవరు దెలుపు వారు వీని-
చే నింతయు విని రాఁగోరు శ్రీరామభూనాథునితోఁ బోరు వేవేగ-
మే నీకుఁ జేకూరునో దానవేంద్ర వీనికిఁ దగిన శాస్తి మీరు సేయఁగా నియమింపుఁడనఁ దమ్ముని నుడి
తా నెద నిడి రావణాసురుఁడు కపుల ప్రాణపదము తోఁక యదికాల్చి వీని పోనిండని పల్క దనుజభటు లల్క
మానక ననిలజుఁ గట్టి బహువస్త్రచయము తోఁకకుఁ జుట్టి
నూనెలోనద్ది వహ్ని దరికొల్పి యానగరమందుఁ ద్రిప్పి రేమందు ॥తరుణీ॥
పావని చిఱుత మేనొందె నంతనె వదలె బంధముల్‌ ఘనతనుఁడై తనవెంట వచ్చు
కాపరుల ద్రుంచి యింటింట నిజవాలదావాగ్నిఁ బెట్టి బూడిదపెంటఁ జేసె పుర
మా విభీషణునిలు వినా మంటతోఁ గంటక
పావనుఁడు చల్లనాయ గరువలి చెలి సీతాస్తుతి గంట గపిపతి
యా వనధిలో లాంగూలము ముంచి చల్లార్చె నే విభునామము మూలము దెలిసిన జనులు
పావనులై తాపత్రయానలముఁ బాయుదు రారఘువరు భటుఁ డీవైశ్వానరుని-
చే వేగమె తత్క్షణము జని సీతాసతికి ప్రదక్షిణము
గావించి మ్రొక్కి రామసన్నిధికి దేవి సెలవిమ్మనినఁ బలికె గొమ్మ ॥తరుణీ॥
నిన్ను చూచి యూఱడియుంటిని నేనెట్లు నిచట నిర్వహింతునిన
కన్నతల్లి మూఁపున ధరియింతు రామునితో
నిన్ను గూర్చి వినుతి గాంతుననిన మరున్నందనుని భక్తిమంతుఁ గని విను-
మన్న నేనే వగనైనా ప్రాణముల్‌ ధరింతు నీవా వా-
రాన్నిధి యింకించియైనన బంధించియైన రాముఁడు వచ్చి యనిలోన దశకంఠుఁ జంపి
నన్నుఁ జేకొనినఁ గీర్తి యందాక మిన్నకుందుఁ బొమ్మా హరిఁ దోడితెమ్మా
యన్న నాంజనేయుఁడు చని సువేలాచలమెక్కి యార్చెను విని
యెన్ని రంగదజాంబవత్ప్రముఖులు ఇది వాయుసుతుని విజయనాదమని ॥తరుణీ॥
తరుచరపతి చరణము లూనిన తరి గిరధరిత్రికి సరిగాఁ గ్రుంగి యెగురు
తరి ముప్పది యోజనముల్‌ నింగి కెగరు సాగరము దాఁటి ఖగరాజుభంగి మహేంద్ర
ధరణీధరమెక్కెను బొంగి సామీరిని నరసి కౌఁగలించిరి యంగదాదులు చెలంగి పోయినపని
నెఱవేఱెనా యనిన మీ కృపచేఁ గంటి ధరణిజ నని నడచిన తెఱఁగంతఁ దెల్ప
హరివీరు లనిలజుని కొనియాడిరి యానందమున నాడిరి తోఁక ముద్దాడిరి
పఱచి మధువనమునకుఁ జని మధుఫలములడుగ శేషాద్రిధని
కరుణ గలుగ ఫలంబులకేమీ యని మరుత్సుతుఁడిచ్చె సెల వెలమి హెచ్చి ॥తరుణీ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi