సుందరకాండము-03
రాగం: బేగడ - తాళం: జంపె
పల్లవి:
వింటివా నీరేజపాణివాణీ వినుతగీర్వాణీ భవానీ ॥వింటివా॥
అనుపల్లవి:
తుంటవిల్తుని బారి తారి సురవైరి తుది దైవమాడింప వైదేహిజారి వా-
ల్గంటిరో యింకమీఁద దయరాదా లలితమగు నీ కటాక్షవీక్షణమున నన్ను
గంటివా పట్టంపురాణిఁ జేతు వరింపు
దంటతనమేలనే బాల తాళఁజాలననె ॥వింటివా॥
చరణములు:
పేదమానవుని రాఘవుని నమ్మి యతఁడే దిక్కని తలంచెదవు నీ
బోధకేమందు విభుడిందు రాఁదలఁచినావేమోగాని కపులగుములందు
సాధై నృపుఁడున్నాఁడని విన్నా సత్త్వహీను నభిమానహీనుని గుణహీను
నాదరింపకు నీవు మునుపటివలె నెంచినావు లేదతని తలపబల నను బొందుమనె రావణుఁడు ॥వింటివా॥
దశముఖుని పలుకు విని సీత బలికెఁ దృణమంతరువుగాఁ గొని కినుకచేత
దశరథసుతున కళికి కాదా యొక బీదతపసివై కన్మొఱఁగి నను దెచ్చుట క్రవ్యాద-
పసహవిస్సు కుక్కగొను లెక్క వెస ననుభవింతువా ఫలంబు రామబాణ
విశకలాంగుఁడవై లయమొందు తఱి నృపాలశశి నెఱిఁగెద వుదధి దాఁటివచ్చి పొగరడఁచుననె ॥వింటివా॥
పిడుగులకన్న కడిదిగాను మాటలను పడఁతి నసిగొని వ్రేయఁబూను
దుడుకురక్కసులదొర నెదిరి మందోదరి తొగలేని చెలులు పదువేవురున్నారు మఱి
గడసరి యిది మనుజాంగన దనుజాగ్రణి దీనిపైఁ బ్రేమమాని పోదము రమ్మ-
నుడు ద్విమాసముల నా పొందొల్లదేని లలన యొడలు కావలివారు తినుఁడని చనియె రావణుఁడు ॥వింటివా॥
అవనిజను స్వతర్జనముల బెదరించి రసురాంగనలు బహువిధముల
సవినయము పల్కుఁడీ సతికి జయ మైరావతము నెక్కి రామలక్ష్మణులిచ్చటికి వచ్చి
తవిలి లంకఁ గాల్చి యరిగూల్చి ధరణిజను గొని యయోధ్యఁజేరగఁ గలగంటి
వివసనుండై తైలమంటుక గుంటఁగూల వింశతిభుజుఁ గంటి నిదితప్పదని త్రిజట పలికె ॥వింటివా॥
లంక విభీషణుఁడేల గంటి జానకి రామాంకమున నుండఁ గలఁగంటి
నింక భూసుతకు వలగొనుఁడీ మేలనుఁడీ యింతి నుడి విని మ్రొక్కి చెలులు నిద్రించి రలజడి
పంకజాక్షి సీత శ్రమచేత వడి యెలుంగెత్తి యేడ్చె ఘంటారవంబునఁ
గొంకకీతరి శేషగిరిరాముఁ డభిలాష గొని రానిదేమి తనువని త్యజించ నూహించెను ॥వింటివా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi