సుందరకాండము-02
రాగం: కేదారగౌళ - తాళం: అట
పల్లవి:
నలిననయను కథాసుధ నపర్ణా కర్ణాంజలులఁ గ్రోలవే ॥నలిన॥
అనుపల్లవి:
బలియుఁడగు ననిలతనయుఁ డావల లంకలోఁ జొచ్చి
యిలాసుత విలాసతనువల్లి నెల్లచో నరయుచుఁ దిరిగెఁ బురి ॥నలిన॥
చరణములు:
రావణు నంతిపురమునకేగి జనకభూవరాత్మజ నందు శోధించి విసువక
దేవకిన్నరమరున్నాగస్త్రీలు చెరనున్నకడ నారసి యందుఁ
బావనీ త్రిలోకపావని నృపదేవి గానక లంకి-
ణీ వాక్యము దలంచి జనె రమణీయమగు నశోకవనమునకు ॥నలిన॥
రతనంపు మెటికల రంగైన బావులు రాజిల్లు విరితావులు దేవతాశాఖి-
తతుల నతులముగ జతలగు ఖగరుతముల కలరు లేడిపిల్లల ఠీవులు
అతిమృదుల మధురఫలభర నమ్రావనిజశాఖాలం-
కృతస్థలుల గని మారుతి యద్భుతమతి వెదకె క్షితిసుత నచట ॥నలిన॥
అందమైన హృదయానందమై వనలక్ష్మిచందమై ఘనమైత్రి గల సుకృతిగతి మి-
న్నంది శతశాతకుంభస్తంభాన్వితంబగు మేడగని భూపుత్రి
అందు లేకున్నఁ బోయి మరున్నందనుఁడు తిలకించె
ముందరను శింశుపావృక్షము మొదటను సీతను లోకమాతను ॥నలిన॥
దనుజాంగనల మధ్యమున నున్నదాని శ్రీతరుణివలె నొప్పుదాని దీనతయు జడగ-
ట్టిన కురులు నుపవాసముల గ్రుస్సిన మేను మాసినచీరె గలదాని
తను గావ విభుఁడు రామికినెంతయు వగఁ గన్గవను జడిగొను బాష్ప-
కణములదాని రాముని నుడువు పడఁతి గనెఁ గపిపతి ॥నలిన॥
అవనిజ గంటిఁ గృతార్థుఁడనైతి రాఘవుపని నాచేతను సాధింపఁబడెనని
భువికి దిగుతఱి నగరి వెలుపలఁ బుట్టె నొక కలకలమదియుఁ గని నేను
రవికులుని సతి నలరింతునని పవమానసుతుఁడుండెఁ
బవళించి రావణుఁడు కల రఘుపతిభటుని వానరుఁ గని లేచె ॥నలిన॥
ఇది దుస్స్వప్నమని క్రీడావనికి దశవదనుఁడు రాకాంతశత-
పదకటకముల రొదలు విని నిశిచరపతిగని బలుదిగులున నడఁగి తలవంచుక చింతా-
పదమైన మది శేషశిఖరిసదనుఁడా రాముని
గదియించి చిత్తరు ప్రతిమవలెఁ గదలకిట్లుండె నళికికలికి ॥నలిన॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi