కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
సుందరకాండము-01
రాగం: సౌరాష్ట్ర - తాళం: ఆది
పల్లవి:
శ్రీరజతాద్రిసదనా వేడుకౌ శేషాద్రీశుచరిత్ర విన విన ॥శ్రీరజతాద్రి॥
అనుపల్లవి:
మారుతి సాగరము శతయోజనదూరమొక నిబ్బరమున దాఁటగఁ
గోరి యానందకందళితుఁడయి శ్రీరాముని భజియించి కపులఁ గాంచి
కూరిమి వనచరులారా కనుఁగొనుఁడీ నన్ను లంకఁజేర
భూరివేగమునఁ జని జానకిఁగని పొసగవత్తు యశము తెత్తు మీకనియెను ॥శ్రీరజతాద్రి॥
చరణములు:
నేను ధన్యుఁడను ధన్యుఁడ హరిపదనీరజము లమరగందు నెవ్వఁ
డైనా మృతికాలమందు రాముని శ్రీనామస్మరణనొందు భవాం-
భోనిధిఁ బుడిసిటియందు నడచి మానితముగఁ బరమపదమా ఘనుఁడు
తానొందు శ్రీజానిదూత నతనిముద్రిక చేఁబూనితి రఘుపతిని నెమ్మదిలో
ధ్యానించు ననువౌ యీ జడధి దాఁటెదనని హనుమంతుఁ డరికృతాంతుఁడు
పూని బాహువులు జాఁచి మెడపొడవుగ నిక్కించి మీఁదుజూచి
మేనువంచి తోఁకబెంచి పాదములూని యెగసె వాని పొగరేమి జెప్పుదు ॥శ్రీరజతాద్రి॥
పోవుచున్న పవనాత్మజు బల మమరావళి జూడఁదలంచి సురసా-
దేవికి నుపదేశించి పంచిన పావని నది యెదిరించి పెరిగిన
నావీరుఁడు రెట్టించి ప్రబలె నావెలది మఱియు బలియ సూక్ష్మతనుఁడై పొంచి
యాదేవి కడుపు జొచ్చి వెడలిన నగధీరుని గని మెచ్చి జయమగునని
తావచ్చుట సతి దెల్పి జనె నతఁ డావలఁబోవ మైనాకగిరి డగ్గరి
రావయ్యా హనుమంతా నీరధి పనిచె నాయందు సుంత
నీవు విశ్రమించి పొమ్మన నిలకనే స్పృశించి నేర్పుమించి పోఁదొడఁగెను ॥శ్రీరజతాద్రి॥
ఎదుటను సింహికయను రాక్షసి ప్లవగేంద్రు మైనీడ మ్రింగి త్రోవ
గుదియించ నతఁడెఱింగి తన ఘనపదమునఁ దన్నిన గ్రుంగి గెడసె
నది గన గరుడుని భంగి నభమున బొదలుచు హరిపతి యుదధి దాఁటెను బొంగి గడు
ముదమునను సువేలాచలమెక్కి యద్భుతమతియై శ్రీల దనరి మణి-
సదనగోపురప్రాకార సౌధోజ్జ్వలమౌ దాని లంకారాజధాని
కుదురు గని మెచ్చుచుండగ రవిగ్రుంకె దన్వొరులెఱుఁగకుండ
కదసి వాయుజుఁ డణుమాత్రుఁడయి లంకాపురంబు గోపురంబు జేరి నిలిచె ॥శ్రీరజతాద్రి॥
లంకిణి యను రాక్షసి యనిలజుఁ గని లావు మెఱసి పోనీక యోరి
కొంకు కొసరు ఇంతలేక పోయెదు లంకిణి నను గైకోక వానరా
యింకనైన జెడిపోక యెవఁడవు మంకుతనము మాని కలరూపు చెప్పుమని
ఝంకక నరచేత నది యడచిన సామీరియు భూతతతి బెదరఁగాఁ
బొంకపు పిడికిటఁ దాని బొడిచినఁ భువిఁ బడి రక్తము గ్రక్కుచు ముక్కుచు రామ-
కింకర నతి నీపాదములకిదె చెడు లంక యింకమీఁదఁ
బంకజాసనుని వాక్యమదె యనుచుఁ బడఁతి రామకథ విరామమిడక దెలిపె ॥శ్రీరజతాద్రి॥
రావణు నంతఃపురమున గ్రీడారణ్యమున నున్నది సీత రాముని
పావనస్మృతి సంజాతమాయె నాకీవఱకు సుకృతముచేత నినుగంటి
శ్రీవర భక్తవ్రాతాగ్రణి నీ సేవగల్గె నే ధన్య నో జయశ్రీసమేతరామ
భూవిభుఁడు నామది రంజిల్లుగాకేవేళనని మదిని దివికది జనె
నా వారధి యంజనీసుతుఁడు దాఁటినప్పుడు ధరాసుతకు నా దశగ్రీవునకు
శ్రీవిలయకారణములై యదరె వామభుజాక్షులు ధ్రువములై
వేవిధముల శుభసూచకమై రఘువీరు దక్షిణోరు క్షణమె యదరెను ॥శ్రీరజతాద్రి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi