కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
కిష్కింధాకాండము-10
రాగం: ముఖారి - తాళం: అట
పల్లవి:
కోరి శ్రీగౌరి భవ్యచరిత్రము వినవె ॥కోరి॥
అనుపల్లవి:
వారినిధి వానరముఖ్యులు చేరి దాటుదారి గానక
తారి యొకరొకరి మొగములు సారెకుఁ జూచుకొనుచు దైన్యము
దేరనున్న వనౌకసులఁ గని తారకొమరుఁడు బలికె నలవేర్పడఁగ ॥కోరి॥
చరణములు:
కడలి యిందెవ్వఁడు గడచి సీతను గని రాఁగలవాఁడు మాకెల్ల
గడుప్రాణబంధుఁ డా ఘనుఁడె రక్షకుఁడు రాఘవసుగ్రీవున కెలమి జెల్ల
తడవు వలదు మీమీబలములు నుడువుఁ డనవుడు మోదమున గపు
లుడుగక పది మొదలు దొంబది యోజనముల దనుక మేమీ
జడధి దాఁటగఁ గలమనిన విని జాంబవంతుఁడు యువరాజుతోఁ బలికె ॥కోరి॥
మును త్రివిక్రమదేవునకు ముయ్యేడుమార్లొనరఁ బ్రదక్షిణములు
నొనరించినా నిప్పుడొదవె వార్ధకము దాఁటను జాల శతయోజనములు
అనిన వాలితనయుఁ డంబుధి దాఁటిచనిన రాఁగలనో రాలేనో యనెను
అనఘ నిను బొమ్మనఁ దగునే మమ్మంపఁ దగుదీవు రాజ-
వని రుక్షపతి పలికె నంగదుఁ డంతఁ బ్రాయోపవేశము సుఖమనెను ॥కోరి॥
బలవంతు హనుమంతుఁ బ్రస్తుతింత మితఁడు గలుగఁ జింతిలనేటికి
జలధిదాఁటి యాజానకిని జూచి రాఁ గలఁడని డాసి ముమ్మాటికిఁ
దెలిసి నిన్నెన్నఁ దరమే మము గావలసిపొ మ్మనిలతనయ పవనుఁడె
చెలఁగి తోడగు నీకనుచు నాశీర్వాదము లెనసి జేసి
యలరించ బ్రహ్మపుత్రుని గని యాంజనేయుఁడు త్రివిక్రమువలెఁ బ్రబలె ॥కోరి॥
మారుతి బ్రహ్మాండ మగలనార్చి పలికె నీరధి యుత్తరించి
ఆ రావణునిఁ ద్రుంచి యవనిజఁ దెత్తునో ధీరులార మేలెంచి
ఆ రాక్షసపతిఁ గట్టి లంకతోనే రాముని సన్నిధికిఁ దెత్తునో త్వరఁగాఁ
జేరి త్రిజగన్మాతయైన సీతనుజూచి రానో యనవుడు
పౌరుషము మీఁద నగు నవనిజఁ బరికించి రమ్మనిరి కపులందఱును ॥కోరి॥
తుహినాద్రిసముఁ డత్యద్భుతస్వర్ణవర్ణుఁడు మహితారుణాననుఁడు
అహికులసార్వభౌమాభదీర్ఘవాలుఁ డనుపమసుయశోవిశాలుఁడు
అహితాంతకుఁడౌ హనుమంతుఁడొప్పె నా మహేంద్రాచల మస్తకమునఁ జూడ
రహిమీఱ శ్రీమదధ్యాత్మరామాయణమున కిష్కింధకాండము
బహుళార్థము తెనిఁగించె సుబ్రహ్మణ్యకవి శేషగిరిపతి పేర ॥కోరి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi