కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
కిష్కింధాకాండము-09
రాగం: పూరి - తాళం: ఆది
పల్లవి:
వినవె రామచరిత్రము దాక్షాయణీ ॥వినవె॥
అనుపల్లవి:
మునిచంద్రుఁడౌ చంద్రముఁడు తను దెల్పురీతి సంపాతి
యనియెఁ గపులతో శోకమూలమీ తనువు తనుకారణము కర్మమనుచు ॥వినవె॥
చరణములు:
నేను దేహిననే బుద్ధిచేత పురుషుని కర్మమును అహ మవిద్యవల్ల-
నౌను కాఁగిన యినుమువలెఁ దాను మాయాయుతుఁడై వెలి-
లోను గుణమయమై యీ మేను నేనని భ్రమసి-
తేను తెలివి మట్టౌను దాన సంసారమాయా తానా అవికారి దురభి-
మానమునఁ గర్మములు జేసి ఫలాధీనుఁడగుచుఁ జెడి తిరుగు జీవుఁడనె ॥వినవె॥
యాగాదులు జేసి స్వర్గభోగమొంది యా ఫలము
బోగా భువిపైఁ బడి నరుఁడు బాగా చతుర్విధ భోజన స-
రాగ స్త్రీపురుషసంయోగమున రేతోమయుఁడై వేగమె స్త్రీ గర్భము-
లోగాఁ జొచ్చి నెత్తుటఁ దోగి యొకనాట కలలవై గట్టియై యైదునా-
ళ్లేగఁ బుగ్గవలెనై పదియవదినము రాగమాంసపేశియౌనని తెలిపె ॥వినవె॥
పదియేనహముల కామాంసపుపొది నెత్తుట జొత్తిల్లు నందదనై యంకుర మిఱువై
యైదు దినమ్ముల కుప్పతిల్లు నెల మొదలు తల మెడ మూఁపు వీఁపు
నుదర మివియైదు బొడము కర పద పార్శ్వ కటి జానూరువు
లుదుటై యెసఁగు రెన్నెల లాముదిత గర్భిణికోర్కె విదితమౌ మూఁడవనెలను
పొదల నంగసంధు లఖిలాంగుళము లుదయమౌ నాల్గునెలలకని పలికె ॥వినవె॥
తెలిగన్నులు ముక్కుఁజెవులు బలుదిన్నెల చాలునఖము లైదవ-
నెలగల్గు నాఱవనెలను గర్ణబిల గుహ్యగుదములు పొ-
క్కిలి యొదవు రోమములును బెన్నెరు లందముగను మొలచు నాఱునునొక్కటౌ
నెలను ఎనిమిదవనెలను లలితావయవోజ్జ్వలమౌ నస్ఖలితజ్ఞానియై జీవుఁ
డలరి మాతృభుక్తసార మైదవనెల మొదల్‌ సచేతనుఁడై కొనుననె ॥వినవె॥
నానాయోనుల జన్మించి నే నాలుబిడ్డలకై
హీనవృత్తికిఁ జొచ్చియైనా కుటుంబభరణమం-
దే నామది నిల్చెఁ గలలోనైనా హరిని దలఁచనైతి
గాన ననుభవించెద నీ నారీగర్భనరకము
నేను తొలఁగిన మఱచిపోను హరినని శిశువు
మేనుకదలి వెడలు మాతృగర్భము-
లోనుండి పదోనెల హరిదయ ననె ॥వినవె॥
తాను బ్రహ్మానందాద్వయ ఘనతత్త్వబోధాత్ముఁగా
దను తా నెఱిఁగిన నజ్ఞానజనితమగు మోహమడఁగును
వినుతాపౌత్రా మదినిది చేకొని తాలిమిఁ జెందుమనె మౌని
యని తా ఖగపతి వానరులఁ గని తద్దయు మ్రొక్కి ఱెక్క-
లనువారవచ్చె శేషాద్రినివాసుని దలఁచిన గ్ర-
క్కున భవాబ్ధి ఖలుఁడయిన దాఁటు భక్తులగు మీకీవనధి యెంతని చనె ॥వినవె॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi