కిష్కింధాకాండము-08
రాగం: గౌరీ - తాళం: ఆది
పల్లవి:
ఇందిరారమణు చరితము వినవే సుందరీమణి ॥ఇందిరా॥
అనుపల్లవి:
మందయానమునఁ జని కపులు మ్రాని క్రింద నాసీనులై యెటు బోదము
ఎందరయుదము సీతననిన వాలినందనుఁడను జనకాత్మజను గన్గొనక
యందరిగితిమేని నను జంపు ముందుగా రమాజాని నే నిందు మృతి
నొందువాఁడనన నందు కొంద ఱిందెయుంద మెందుకు మృతి యనిరి ॥ఇందిరా॥
చరణములు:
రామబాణమున కభేద్యము జగత్త్రయమునందుఁ గలదా చిఱుత యిట్లను-
టేమి తెలివివలదా గుహనుందమను సోమరుల నుడి వినకు రాఘవునకు
సౌమిత్రికన్న నీ మీఁదఁ బ్రేమ చాలగల దింకొక రహస్యము
రాముఁ డనఁగ నారాయణుఁడు సీత శ్రీ మహాలక్ష్మణుఁ డాదిశేషుఁడు
స్వామి పార్షదులము మనమును వైకుంఠనివాసులము హరి
భూమిభరము మాన్ప దాశరథియై పుట్టెనని దెలిపె నంగదునకుఁ బావని ॥నిందిరా॥
మనము రామకార్యనిర్వాహకులమయిన శుభము గలుగుననిన నందరీ
ఘనుని బుద్ధి మెలఁగుటే మేలని చని చని మహేంద్రాచలమెక్కి తరుచరుల్
ఘన మకర కమఠ కర్కటజలూక
ఫణి తిమితిమింగిలాది జలచరాభంగమై తరంగాలింగిత స్వర్గంగా
మనోజ్ఞాంగవల్లియై తనరు వనధిఁ జూచి భీతిల్లి యది
మనము దాఁటుటేడ రావణుఁడేడ ననుచుఁ బ్రాయోపవేశపరులై రపుడు ॥ఇందిరా॥
గిరిగుహ వెలువడి సంపాతియను ఖగేంద్రుఁడు వానరులఁ గని పొరిగొందు
నిరతముఁ దిందు కరులవలెనున్నారని పరువిడి రా దుర్మృతిభీతి ప్లవగుల్ హరి-
హరి జటాయువెంత సుకృతియై మరణమొందెనన వారి సంపాతి సహో-
దరుని మృతి దెలియ విని హరివరులచ్చటికి వచ్చుటయు నెఱిఁగి వారును జలధికి రా
నరిగి తమ్మునకుఁ దిలోదకములిడి మరలునతని సీత సడి యడిగి రగచరు ॥లిందిరా॥
నగశిఖరమెక్కి నిక్కి లంకలో నశోకవని నవనిసుత గంటి నిదె
మొగమాటము గాదని పల్కి సంపాతి తగనిట్లను నాతమ్ముని జంపిన
పగదీర రావణుని ద్రుంతు పక్షయుగములేకునికి
నెగరలేను చిన్ననాఁ డోమహాత్ములార పంతముమీఱఁగ
నొగి జటాయు నేను రవిమండలోన్నతం బెగురగాను అరుణగభస్తిదీప్తిచే ఱెక్కలవిసి
పొగరడఁగి పడితి నతఁడు వడుటెఱఁగననె ॥నిందిరా॥
ప్రాణములు మూఁడుదినములకు వచ్చి పరగ శేషశైలవాసుని దయ
నేను దెలివొంది చాలా వగ సోముఁడన్
మౌనిఁ జేరఁ జని మ్రొక్కిన గని సంపాతి నీకీవిరూప మెటువచ్చె
మేను గృశించుటేమనిన జగతిలో మీరెఱుఁగనిదేమి సంయమిస్వామి
యైన వినుమని మదీయచేష్టితమంతయుఁ దెలుప విని కడ-
లేని యడలూనియున్న నన్నూరడించ ముని దలఁచెననెఁ గపులకు ఖగపతి ॥యిందిరా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi