కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
కిష్కింధాకాండము-07
రాగం: కాంభోజి - తాళం: అట
పల్లవి:
రామాభిరామ గుణధామ రామకథాసుధామాధురి సామాన్యమా ॥రామా॥
అనుపల్లవి:
రామున కనతిదూరమే తేరు డిగివచ్చి సౌమిత్రిరవిసుతులు జేసిరి నతులు
స్వామి కౌఁగిటనిడి యర్హపూజామాన్యుఁ జేయ హరిపతి హరి-
వామభాగాసీనుఁడయి రఘురామనృప యిటుజూడు వచ్చిన
కామరూపుల నగణితులఁ గపుల జితరిపులననె విను ॥రామా॥
చరణములు:
మేరుమందర హిమవత్పారియాత్రాది గిరులఁ జేరియుండెడి వీరులు దేవాంశభవులు
భూరిశైలాకారులు రణోదారులు సారకరిబలులు దశశతసహస్రాయుతులు వి-
స్తారవారణసత్త్వులు నిస్తులులు చారుసౌవర్ణతను లమలశరీరు లణింగులు వినీలా-
కారులిదె గర్జలిడి పరువిడ కడఁగి నీపనికి ప్రాణములీఁ
గోరినారిఁక వీరు మీయాజ్ఞావశు లభిజ్ఞా యను ॥రామా॥
గొనకొని భల్లూకకోట్లు గొల్వఁగఁదగు నీ గుణనిధి జాంబవంతుఁడు నితఁడు పవన-
తనయుఁడు హనుమంతుఁడు నల నీల తార పనస గజ గవయ గవాక్ష గంధమా-
దన సుషేణ దధిముఖులు కేసరిప్రముఖులు
వినుమితఁడు శతబలి దశరథుఁడితఁ డనఘ వాలికొడు కంగదుఁడితఁ
డనుపమానబలాఢ్యులను పనిగొనుమనిన నినతనయు నాలిం-
గనముచేసి సమోదాశ్రులోచనుఁడయిన హరి బలికె ఘనుఁడయి ॥రామా॥
ధరణిజ వెదక వానరులం బంపుము నీవెఱుఁగవా కార్యసరణి యని పలికిన దా-
శరథి యానతిఁ దరణిసుతుఁ డగచరుల
హరిదంతముల కనిచె నవనిజ సడి నెలలో నెఱిఁగింపకున్నవారి ద్రుంతునని భేరి
మొరయించి యంగద జాంబవద్వినుత హనుమన్నల సుషేణుల
శరభ మైంద ద్వివిదులననిచె సరసదక్షిణదిశ కనిలజుని
హరి బిలిచి ముద్రిక సీతకొసఁగుమని యొసఁగెఁ బొసఁగ ॥రామా॥
శ్రీరామునిచే నాశీర్వాదములు గాంచి మారుతి ముఖ్యులరిగి
గిరిసరిత్కుంజభూధరదుర్గముల్దిరిగి వింధ్యాటవి
నీరువట్టున డస్సి నీరపక్షులు గుహద్వారము వెడలిరాఁగాఁ గని బిలములోగా
వారేగి సింహాసనస్థలి వరనియతినున్న యోగిని గని
కోరి మ్రొక్కిన మీరెవరనుచుఁ జెలి యడుగ-
గా రామదూతలమన వారిఫలములు గొనగ సెలవిచ్చె సతి మదిని హెచ్చె ॥రామా॥
జలఫలతృప్తులై లలన నీవెవరనిన నలవిశ్వకర్మ తనయను హేమ యందురు నను
తొలుత నాట్యమునం ద్రినయను మెప్పించిన
లలితసద్వస్తునిస్తులమౌ నీపురమిచ్చె నలికాక్షుఁ డదిమొదలీగతినుందు పొదలి
యలఘమతులార యని వారల ననిచి తాఁ బోయి శేషాచల-
నిలయుఁడగు రఘువరు పదాంబుజముల కెఱఁగి శ్రుతిసూక్తి నతినుతి
సలిపి చెలి బదరికాశ్రమమునను గైవల్యమొందెను ॥రామా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi