కిష్కింధాకాండము-06
రాగం: పంతువరాళి - తాళం: అట
పల్లవి:
కలికి యలరులములికి చిలుకలకొలికి వీనులసుధ జిలికి కథ వినవే ॥కలికి॥
అనుపల్లవి:
చెలఁగి లక్ష్మణదేవుని దెలిపి ప్రాకృతునివలె మాయ
యలవడ హా సీతా యని నిద్ర జెందఁడాయెను హరి ॥కలికి॥
చరణములు:
అచట కిష్కింధాపురిలో హనుమంతుఁ డతినీతిమంతుఁ డగచరేంద్రుఁడగు సుగ్రీవుని చేరి రాజా
ప్రచురత ధనరాజ్యములఁగొని రామచంద్రు మహానుభావుని మఱచినావు
ఖచరపతిసుతుఁడు తెగినగతి చెడక రాఘవుని జేరుము
విచికిత్స వలదనిన విభుఁడు బిలుపింపుమనె గపులను ॥కలికి॥
అంజనాసుతుఁ డధిపుని యాజ్ఞ వానరుల రాఁ బనిచిన నఖిలదిక్కులు బిక్కటిల్లఁ గపివీరులు
మంజుతరగిరినిభశరీరులు మహియు నాకసము భేదిల్ల వచ్చిరంతఁ
గంజదళనేత్రుఁడై తగు కాకుత్‌స్థకులుఁ డచలమున మణి-
పుంజసానుస్థితుఁడై పొరలె సీతావిరహార్తిచే ॥కలికి॥
జానకీ హా చంద్రముఖీ ప్రాణములు నీ మేన నిలిచిన-
వే నన్ను బాసి యిందాక చల్లనై మా మానవతినంటి నీ కరముల మఱినన్ను దాకుమీ రాకాసుధాకర
భానుసముఁడాయె జంద్రుఁడు పరికింపు లక్ష్మణా యిదివఱ-
కేణాక్షి దనుజు చేఁబడి యెటులౌట యెఱుఁగననె రాముఁడు ॥కలికి॥
స్త్రీసక్తుఁడై పానమదచేష్ట నిటురాఁడు సుగ్రీవుని ద్రుంతునని రాఘవుడు దొడర నను బంపు తీ-
వ్రాసి హతునిగఁ జేతు నినసుతునని యనుజుఁ డలుగ హరి కడురాయిడి సేయఁదగ-
వా సౌమిత్రి నీవు చని వాలి వలె జెడకుమను మిఁక దడ-
జేసినఁ జెడుననిన దవశిఖికరణి కపిపురికి నతఁడరిగెను ॥కలికి॥
విలుగుణధ్వనిచేయఁగ విని యంగదుఁడు వచ్చి మ్రొక్కిన వేగ మీదొరకు మారాక దెల్పుమనఁ జని
కలఁగి పురివాఁకిట నిలిచె లక్ష్మణుఁడు కపిరాజా పరాకా యన సుగ్రీవుఁడు
దెలిసి మారుతి నీ వలుక దీర్చి యాఘనుని దెమ్మనఁ జని
వలగొని కినుక వత్సలానుజా వలదని తోడితెచ్చెను ॥కలికి॥
పతి పనుప దారాంగన చని భయభక్తివినయసంభ్రమముల నతి జేసి కుశలమే బావా కోపమేమీ
అతిభీతుఁడై హరివిభుఁడు నన్ననిచె మిముదేర రా దేవా యని చెయిబట్టి
సతి యంతఃపురికి తోడ్తేర నతని గనుఁగొని కపి-
పతి రుమాయుతుఁడై పాన్పుననుండి యులికిపడి లేచె వెఱపరివలె ॥కలికి॥
మదలోలలోచనుఁడై మలయు రవిసుతుఁ గని యలిగి రామానుజుఁడు వలికె సుగ్రీవా చేసినమేలు
పదటఁ గలిపి రుమావధూరతి పరవశత మఱచియున్నావా కాని వాలిని
పదరి ప్రాణములుగొన్న శితప్రదర మెదురెదురు జూచుచును-
న్నదనిన రామకార్య మనఘ యితఁడు మఱువఁడనెఁ బావని ॥కలికి॥
వానరుల నిదెచూడు డెబ్బది రెండువేల్వలను గూడుక
భానుజుఁడు రాఁదలచినాఁడు అని పలికిన పవ-
మానసుతు చతురోక్తుల గతామర్షతనున్న రాకొమరు వేడుఁకొని
భానుజుఁడు పూని వందనముజేసిన వానిఁ గౌఁగిటనిడి యూర్మిళా-
జాని యాసీనుఁడయి సరసపూజలు గొనె సఖునిచే ॥కలికి॥
రామదర్శనలాలసుఁడయి రథమెక్కి లక్ష్మణకపీంద్రులు రణభే-
రీమృదంగములు పొదలఁగాఁ గదలి హనూమన్నీలాంగద నలాది
భూమిరుహచరపతులు గుములుగొని కొల్వఁగాఁ
జామర సితాతపత్ర సద్విభవయుతులై శేషగిరి-
ధాముఁడయి రఘుకులాబ్ధిసోముఁడగు రామవిభుఁ జేరిరి ॥కలికి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi