కిష్కింధాకాండము-04
రాగం: ఘంటా - తాళం: ఆది
పల్లవి:
కోమలారుణ పల్లవపాణి కోరి వినవె శార్వాణి ॥కోమలా॥
అనుపల్లవి:
భీమసంగ్రామహతుఁడైన వాలి బేర్కొని వానరుల్ శోకించిరి ॥కోమలా॥
చరణములు:
తోరముగా సోగకనుల బాష్పధారలు భోరున నొలుక
తారహారములు రాల కిష్కింధాపురి వెడలి నడుమళుక
తార వదనవిజితరాకాతారాపతి నిజపతిని జేరి
వీరాధివీరా నను బాసి పోయితే రమణ హా హా యని యడలెను ॥కోమలా॥
రామా యేబాణమున నేసితో నామగని నాబాణమునఁ
దామసింపక నను జంపుమనుచుఁ దరణిసుతుని గని కోపమున
స్వామి దయ నఖిలము గల్గె నీకేమి సుఖమనుభవించుమని
భామామణి విలపింప రాముఁడా మగువ నూరార్పఁ గడఁగెను ॥కోమలా॥
ఊరకనేల పొగల శోకమునకు పేరైపోయిన తతికి
నారీ నీ పతి జీవుఁడో యీ శరీరమో నీ మదికి
కోరి గుణభూతేంద్రియములు చేరి కలిగెనది తనువు శ-
రీరీ నిత్యుఁ డచలుఁ డెవ్వరి కీరీతి వగచెదవనెను హరి ॥కోమలా॥
అనఘ తనువు దారువువలె జడము చిదాత్మజీవుఁడు నిత్యుఁడని
మొనసి పల్కితివీ సుఖదుఃఖము లనుభవించువారెవ్వరని
వనితామణి యడుగ రాఘవుఁడు విని యహంకారాద్యనుబంధమె
ఘనసంసారము జీవునకు సుఖాసుఖము లజ్ఞానములనె ॥కోమలా॥
బలుకోర్కెలు గలవానికి రానివి కలలోఁ దోచు నెటు లటులనె
చెలి యనాద్యవిద్యాసంబంధము జీవి కహంకృతి యందుననె
తలపె సంసార మదియెబంధము శుద్ధస్ఫటికమున గెంపు
నిలువ నెఱుపైనట్లు మతీంద్రియాకలన నాత్మకు సంసృతి యనె ॥కోమలా॥
జీవుఁడు మనోయుతుఁడై యది బోవు త్రోవ బోవుచు జన్మమృతి-
భావమొందుచుఁ బుణ్యవశత నా భక్తుల సంగతి సుగతి
త్రోవ దెలిసి మహదాదులకు నే వేరౌ బ్రహ్మమని దలఁచు
నీవు పూర్వసుకృతమునను సేవించి ధన్యవైతివనె హరి ॥కోమలా॥
నాచేఁ బలుకఁబడిన ఈవిధ మాలోచన సేసి సన్మతివై
యేచి సుఖింపుమన రాముని నుతియించె దారక హితవై
ఆ చక్రి మహిసుగ్రీవుని కానందప్రదమయ్యె నతనిఁ
జూచి వాలికి క్రియల్ సేయ సూచించి పంచె శ్రీరామచంద్రుఁడు ॥కోమలా॥
తరణిజుఁ డంగదపురస్సరుఁడై జప్పరమున వాలి తనువుంచి
పరేతోర్వి కేగి దహనాద్యపరకరణీయము లొనరించెన్
పరమాహ్లాదమున రామపదసరోజాతములు గాంచి మ్రొక్కిన
హరి వీరులకెల్ల దొర దినకరాత్మజుఁడు మంత్రి యంగదుండనె ॥కోమలా॥
సిరియు రాజ్యము నీదె నిను సేవించెదనను సుగ్రీవుఁ గని హరి
యరయ నీవే నేను రాజ వగుమని యానతీయ లక్ష్మణుఁడు పురి
త్వరతోఁ జేరి సుగ్రీవున కలరి పట్టము గట్టి వర్షఋతు
వరుగ రమ్మని చనియె శేషగిరీశుఁడగు శ్రీరాముని యొద్దికి ॥కోమలా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi