కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
కిష్కింధాకాండము-03
రాగం: రేగుప్తి - తాళం: ఆది
పల్లవి:
గరుడగమను సచ్చరిత్రము వినవే గౌరీ సుకుమారీ ॥గరుడ॥
అనుపల్లవి:
సురుచిరాలింగనమునఁ బరిహృతగురుకలుషుఁడై తనరు సుగ్రీవుని
వరదయాదృష్టిఁ గని చిఱునగవున వదనశశిశృంగార శ్రీమీఱఁ
బరతత్త్వ మెఱిఁగి పలికితివౌ నను ప్రాకృతు లెఱుఁగక రఘుకులుఁడండ్రు
కరటులను మాయచేత మోహితులుఁగాఁ జేతునని పల్కె శ్రీపతి ॥గరుడ॥
చరణములు:
లేలెమ్మిక వాలితో ననికిఁ జను కీలుగురుతెఱిఁగి రిపుఁ ద్రుంతునని
మేలుగ హరి పల్కిన కిష్కింధకు మిహిరతనయుఁ డరిగి కెరలుచు
చాలి సింహనాదము జేసిన రిపుశబ్దము విని రోషారుణనేత్రుఁడై
వాలి రా నతని యుర మినజుఁ డరిచె కేల బొడిచె వాలి యమునిబోలి
వ్రాలుచు సోలుచు నొకరి నొకరేచి జాల ప్రొద్దు బోరాడి వాలిచే
దూలి రుధిరములు గ్రక్కుచుఁ జని హరితో ననియె గపిరాజు తొడిబడి ॥గరుడ॥
రామా నను జంపింపగఁ దలఁచితివో మాయన్నచే నటులైనా నీవే
సామీ నను పొరిగొనుమని పొగలిన రాముఁడు కడువగచి నేను సఖా
యేమి సేతు మీరిద్దఱొకరూపమై మెఱయుట నేయక తడసితినని
సౌమిత్రి గని యితని కొకగుఱుతిడి యీమాటు బంపుమా యన నతఁడనుపమ
హేమపుష్పమాలిక యొసఁగి పనుప ధామనిధిసుతుఁడరిగి వాలిఁ బిలువ
నేమిచోద్యమని యాజికతఁడు బోగా మగనితోఁ దార వలికెను ॥గరుడ॥
పోవలదు మహాత్మా ప్రాపులేకితఁడు పోరికి తిరిగి వచ్చునా యన నగి వాలి
నే వీరుఁడనై పోకునికి తగదు వేవేలు వచ్చినను నే వెఱవ
వేవేగ నతని ప్రాపుతోడ జావనడిచి వత్తుననిన నంగదు-
చే వింటి రాముఁ డడవులకు వచ్చి సీతఁగోల్పడి నేఁడ రవిజునితోడ
తా వహ్నిసాక్షిగా మైత్రిజేసి నే వాలిని జంపుదుననినాఁడట
దేవదేవుఁడతని శరణమని సుగ్రీవుని సచివుఁ జేయుమనె సతి ॥గరుడ॥
రాముఁడు సాక్షాన్నారాయణుఁడై బ్రహ్మాదిసురలు బ్రార్థింప రఘుకుల-
సోముఁడై జనించె రావణవధకు నా మహితున కొరులు స్వజనులు
యేమి లేరబల పొమ్మని తమ్ముని నెదిరి పొడువ దరువు మరువుననుండి
రాముఁ డైంద్రబాణమేయఁ బడె సుత్రామసుతుఁడు సోలి గిరిబోలి
మైమఱపు కొంతవడికిఁ దెలిసి గుణధాము ధృతజటాస్తోము కువలయ-
శ్యాము లక్ష్మణకపీంద్రాభిరాము రాముని జూచి వాలి పలికెను ॥గరుడ॥
నాచే నీకపకార మేమి దిననాథసుతునివలన నుపకార మేమి
రాచనడక తెలియక చేసితివి నీచతఁ జంపవచ్చునా బోయవై
కాచి పొంచి యేసిన కీర్తి యేమి క్షత్రియుఁడవైతేని నన్నెదిర్చి
చూచిన యశమగు సీతకొఱకు రవిసుతు శరణమటేమి రామస్వామీ
నా చతురత యెఱుఁగవు రావణు సాన్వయముతో సీతతో నిటకుఁ దెత్తు
దోఁచదాయె దోసమాయె నీకను దుందుభివైరితో నృపుఁడనియె ॥గరుడ॥
సకలధర్మపాలుఁడనై చరింతు శాసింతు విలుకాఁడనై ఖలుల వా-
రక కూఁతురు గోడలు దోడబుట్టువు భ్రాతృభార్య బలుక సరియగు
నకటా నీవెఱుఁగక తమ్మునిసతి నతిబలాత్కారమునఁ బట్టిన పా-
తకుని నిన్ను జంపినఁ బాపము లేదనిన వాలి స్రుక్కి హరికి మ్రొక్కి
యిఁకఁ దప్పులు లేవు శ్రీపతివి జగదీశుఁడవని తెలిసెనన శేషగిరి-
నికేతనుఁడు శరము బెఱుక వాలి యనింద్యమగు కైవల్యమొందెను ॥గరుడ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi