కిష్కింధాకాండము-02
రాగం: కళ్యాణి - తాళం: అట
పల్లవి:
తగ వినవే యీచరిత్ర దళత్కంజదళమంజులనేత్రా
నగవిభేదన మణినిచయకాంతిస్ఫుట సుగాత్రనుతిపాత్రా ॥తగ॥
అనుపల్లవి:
వగ బొగలు రవిజుఁ గని హరి నీ పగతుఁ దునిమెదనన బలాధికుఁ
డగు వాలి గెలువనెట్లగునని యతఁ డన్నబలమెన్నఁ గడఁగెను ॥తగ॥
చరణములు:
దుందుభి యనెడి దనుజుఁ డాహవదోహలత మహిషరూపుఁ
జెంది వాలిని దొడర గొమ్ముల సందెడలఁ జీల్చి యతఁడేపు
మ్రందించి కాలం దన్నిన తద్రక్తమీ గిరి నెఱయ వాలిని
ఇందు రాఁ దల పగులునని శపియించెను మతంగుఁడనె గపిపతి ॥తగ॥
అది మొదలిచటనుందు నభయత ననఘ దుందుభి శిరంబు
అదే యోజనము జిమ్మిన వాలి నని గెలుతువన విని ముదంబు
గదుర పదియోజనాల్ జిమ్మినఁ గని సప్తతాళపత్రములత
గదమి యొకపరి గోయునటులవి చిదుముమన హరి నగి విలుకొనియె ॥తగ॥
శరమొకటి శ్రీరాముఁడేసిన సప్తసాలములఁ ద్రుంచి
గిరిధరాతలరసాతల నెఱిఁగి పొది జేరె నదిగాంచి
తరుచరాధిపుఁడు రాముని పాదముల కలరుచు మ్రొక్కి శరణని
చరాచరమూలమైన పరాత్పరవస్తువని పొగడఁ దొడఁగెను ॥తగ॥
నా పూర్వపుణ్యఫలము జగన్నాథ నినుఁ గనుట నేఁడు
ప్రాపని తలంత్రు నిను సంసారనివృత్తికై ఘనులు జూడు
శ్రీపతి సతిసుతధనము కాంక్షించి బుద్బుదసమంబది నీ
ప్రాపు పెన్నిధి పేదకబ్బిన పగిది నేగంటిననె నినజుఁడు ॥తగ॥
క్షణమెవఁడు నీయందు మది నిశ్చలముగానుంచు వాని
ఘనమోహలత సమూలముఁ దెగు నిను రామరామ యనువాని
వినుతించ బ్రహ్మహత్యాశతమణఁగు నిఖిల బ్రహ్మమని తో-
చెనటంచు గౌఁగలించెను శ్రీశేషగిరిపతిని సుగ్రీవుఁడు ॥తగ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi