కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
కిష్కింధాకాండము-01
రాగం: మారువ - తాళం: జంపె
పల్లవి:
శ్రీహిమాచలవరసుతా యీ కథ సమాహితమతివై వినవే ॥శ్రీహిమా॥
అనుపల్లవి:
మోహనాబ్జోత్పలామోదయుతమై విమలమై హంసచక్రవాకాది విహగకులకో-
లాహలమై పనసామ్ర వకుళకదళితరునలతతీరమై తగు పంపాతటిని డాసి
సాహసవిక్రమకళాకుశలులగు రాఘవులు స్నానపానములు జేసి శ్రమము బాసి యలరిరి ॥శ్రీహిమా॥
చరణములు:
వర ఋశ్యమూకాద్రి సరణిఁ దప్పక నడచువారి
శరచాపధరుల నృపవరుల నురుజటావల్కలాంబరులఁ జూచి
వెరగొంద సుగ్రీవుఁ డరులని తలచి మంత్రివరుఁడైన హనుమంతు
వారినెఱుగఁగఁ బనుప నెఱవడుగై చని మారుతి రాముని యంఘ్రులు
శిరము సోఁక నతుఁడై జగదుదయస్థితిలయకరణశీలులై పురాణ
పురుషులై తనరు నరనారాయణులో గాక మీరెవరని యడిగెను ॥శ్రీహిమా॥
విను లక్ష్మణా యితని వినుతవాక్పటిమంబు ఘనశబ్దశాస్త్రమతమై శ్రుతిహితమై
తనరెనని హరి వటువు నతిమైత్రితో గని నే దాశరథిని
నను రాముఁడందురు నా యనుజుఁడీతఁడు లక్ష్మణాఖ్యుఁడు సీతయను నా
వనితయు నేను నితఁడు నడవుల చరించ మజ్జనకు శాసన-
మున వచ్చి పంచవటినుండ దనుజుఁడెవడొకన్మొఱఁగి సీతనెత్తుక చనె
దాని వెదకెదము నీవెవరో దెలుపుమనె రాముఁడు ॥శ్రీహిమా॥
వానరేంద్రుఁడు సుగ్రీవాఖ్యుఁ డీగిరి నమాత్యులు
దానున్నారు వాలికి భయపడి మహానుభావ నను మీపాలికిఁ బంపె
నేను సుగ్రీవు మంత్రిని వాయుసుతుఁడ హను-
మానాహ్వయుఁడ సూర్యసూనునకు మీకుఁ జెలిమి
మానితముగఁ జేసెదననుటకు రాఘవులు ననుమతింప వారిఁ దన మూఁపుపై నిడి తెచ్చి
భానుజు కెఱుఁగ సేయఁ జెలంగి రాముని పాదపద్మముల కెఱగి తరుశాఖ పీఠమిడియె నతఁడు ॥శ్రీహిమా॥
రామాభిగమనంబు సౌమిత్రిచేఁ బ్లవగరాజు విని రిపువిపాలా వగపేల
భూమిసుతజాడ యేలీలనైనం దెత్తు స్వామి యొకదనుజుఁడొక సతినెత్తుకొనిపోవ
భామ మైతొడవులిటు పాఱవైచెనని యియ్య
రాముఁడు గని సీతా హా యని విలాపింప బామరునిరీతి దైన్యపడఁ దగదని రవిజుఁ
డా మహామహుని దెలిపి యగ్నిసాక్షికముగఁ బ్రామాణికములు చేసికొనిరి సఖ్యమునకై ॥శ్రీహిమా॥
మయసుతుఁడు మాయావి వానితో నని బెనఁగి పుయిలోడి యసుర తొలఁగి గుహజొర ని-
ర్భయుఁడై వాని తోలి చెలఁగి యచట దయచే నన్నునిచి పోయి తా నెలకు రాకున్న
లయమాయె నన్నయని తలచి గుహను శిలద్రోచి
భయమున జని యదిదెల్పగ సచివుల్‌ ననుఁ గపిపతిని జేసి రరిఁ బొరిగొని మా యన్న వచ్చి
ప్రియను రాజ్యమును గొని నను దరిమిన శేషగిరీశ నేనది మొదల్‌ ఇచట నునికియనె నినజుండు ॥శ్రీహిమా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi