అరణ్యకాండము-11
రాగం: మాంజి - తాళం: ఆది
పల్లవి:
హితమతి సతీ పార్వతీ యీ చరితము వినవే ॥హితమతి॥
అనుపల్లవి:
రతిపతిశతాధికరుచిరాంగులౌ రామలక్ష్మణుల
నతివేడ్కఁ జని యానందాబ్ధి దేలి శబరి యెదుర్కొనెను ॥హితమతి॥
చరణములు:
పదయుగళికి మ్రొక్కి పాద్యమొసంగి తదంబుకణార్ద్ర
సదమలసర్వాంగియై హరిదర్శన ముదితవిలోచనజితసారంగియై రాఘవులను స-
న్మృదుఫలగంధమాల్యముల దృప్తులఁ జేసి హృదయముల
ముదమొదవఁ బలికెను రాముతో శబరి కరఘటితాంజలి యగుచు ॥హితమతి॥
నిను గని ధన్యనై తనరితి ఖలుల దునుమగ మునుల మనుపఁగ దశర-
థుని సుతుఁడై నారాయణుఁడు జనియించు-
నని నా గురుఁడు సువ్రతుఁడై దెల్పెను మతంగ-
ముని యది నేడు నిజమాయె శరణుశరణు దైవరాయా
వనితను హీనకులజను నిను దెలియఁజాలనన రాముఁడు బలికె ॥హితమతి॥
కులనామాశ్రమాదులు హేతువులు గావబల నను
దెలియఁగ భక్తియొకటి వినా యజనదాన తపోమంత్ర-
ములు భక్తిహీనములైన విఫలములు గనుక దెలిపెద భక్తిమార్గము
సులభమగు నపవర్గము తొలుత సత్సంగతి యావల మత్కథాలాపగుణరతులనెను ॥హితమతి॥
ననుఁ గొనియాడుటయు ఘనగురుసేవ యమనియమాదులను
నను బూజించుట నను భజించినవారలను గని సంభావించుట సకలభూతముల
ననుగా గని శమదమముల నెనయుట విమలచిత్తముల
నను వివరించుటయు నివి నవవిధభక్తులని తిరుగా హరి బలికె ॥హితమతి॥
భావము సజ్జనసేవను విమలమైనది నీకు
గావున నను జూడఁగా గలిగెనిఁక జానకి తెఱఁగు
వేవేగమె జాడగాఁ దెలుపుమన సతిని
రావణుఁడెత్తుకొని వేగ లంకకుఁ జనె మహాభాగా
దేవాదిదేవ నీకుఁ దెలియనిది గలదే యనుచుఁ జెలి పలికె ॥హితమతి॥
పంపానామసరోవరతటి ఋశ్యమూకాద్రిపైఁ
బెంపున సుగ్రీవుఁడున్నాఁ డతనిసఖ్యము చేయుఁ
డింపున నతఁడు దోడ్పడునని తెలిపి శబరి
తెంపున నచటఁ జితిఁ బేర్చి దేహము చిచ్చుతోఁ గూర్చి
సొంపున శ్రీవిభుని దలఁచుచు దనువెడసి పరమపదమున కరిగె ॥హితమతి॥
ఈ రఘువరస్తవము నెవరు బఠించిన వినిన
వారు కోరిన కోర్కెలనిచ్చు శేషాచలేశుఁడు కృపను
ఘోరదురితములను బుచ్చు నిది జయాకరము సూరిజనానందకరము
దారిద్య్రసంకటహరము అరణ్యకాండము శ్రీమీఱ సుబ్రహ్మణ్యకవి తెనిగించె ॥హితమతి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi