కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అరణ్యకాండము-10
రాగం: శహన - తాళం: అట
పల్లవి:
కోరి కూరిమిమీఱి కౌమారి ఖ-
రారిచరితము వినవే ॥కోరి ॥
అనుపల్లవి:
శ్రీరాముఁడు జటాయువుభక్తికి మెచ్చి
శ్రీమీఱఁగఁ గైవల్యమిచ్చి యావల జని హెచ్చి ॥కోరి ॥
చరణములు:
సానుజుఁడై సీతనరయుచు రాముఁడు జని ఘోరాకారుఁడైన రక్కసుని జూచి
మానధనుఁడౌ లక్ష్మణునితోడఁ బలికెను వీని బాహువులలోన నిప్పుడు మనము
పూని చిక్కితిమి కన్నులు గాళ్లుఁ దల లేదు వీనికినని తెగువతోన రాఘవులిరువురు
వాని యోజనదీర్ఘ బాహుద్వయము దెగనఱికినఁ గబంధుఁడు
దాని కద్భుతమంది మీరెవ రేనెఱుగనన జక్రి పలికెను ॥కోరి ॥
దశరథసూనులము రామలక్ష్మణులము తండ్రియాజ్ఞ వనమును సీతతోడ
వసియించియుండు మము వంచించి యెవఁడో నా వామాక్షిఁ గొని చనెను వెదకుచు వచ్చి
వెస నిన్ను గంటి నీవెవఁడనిన గంధర్వవిభుఁ డజుని వరమునను జిరజీవినై
కొసరి యష్టావక్రముని గనుఁగొని నగిన నసురవగుమని త-
పసి శపించె విమోచనము రఘుపతి సేయుననెను దైత్యుఁడు ॥కోరి ॥
దనుజతనువు గాల్పు మెఱిఁగింతు సీతావృత్తాంతమన నన్నిట్లు సేయ యరుదరుదిది
యన నసురాకృతి విడిచి దివ్యగంధర్వుఁడై వినుతించె హరి నీమాయ మానవాకాయ
మనఘ దుష్టనిగ్రహార్థము బూనితివి పరమాత్ముఁడవు దైవరాయ సన్మునిగేయ
మనోవాగగోచరుఁడ వనాదినిధనుఁడ వఖిలసాక్షివి చిద్ఘనానందమయుఁడవు
రఘునందన వందనములు చేకొనుమనె ॥కోరి ॥
రూపరహితుడవయ్యు రెండురూపములుగల వో పరమపురుష నీకు స్థూలసూక్ష్మముల
ప్రాపున జగములు గలుగు వెలయు నడఁగు నీ పాదమాన పరాకు హిరణ్యగర్భ
యేపున సూక్ష్మమయి విరాట్తనువు స్థూలమై దీపించెనది మాకు దెలియ మును లలమట-
కోపి ధ్యానము సేయగ విరాట్పురుషుఁడన ధారణాశ్రయుఁడై
చేపట్టి రాముని తనువె సుమ్మఖిలజగములుననెఁ గబంధుఁడు ॥కోరి ॥
వాని జ్ఞానము మెచ్చి వరదుఁడు బలికెను వరమౌ యీ పావనస్తవము నుడివిన వినిన
గాని వారికి సిరులుఁ గలుగు దురితము దొలఁగు గలుదెన్నడు భయమని సెలవియ్యఁ-
గానె రావణుఁడను రాక్షసుఁడు సీతను లంకలోనుంచినాఁ డీదినము శబరివద్దకు జనుఁ-
డానెలఁతచే సకలమును వినఁగా నగుననుచు గిన్నరుఁడు జనె
భానుకులమౌళి శేషాచలపతి మతంగాశ్రమము జేరెను ॥కోరి ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi