అరణ్యకాండము-09
జటాయుకృత శ్రీరామస్తవము
చూర్ణిక
శ్రీమదగణితగుణ మణిగణాలంకృతరుచిర చిరతరశుభస్వరూపం, సకలజనభయావహ మహదజ్ఞానజనిత కలికలుషాంధ తామిస్రనివారక భవతారక దీపం, అనుపమాద్భుత మహత్ప్రతాపం, హతదీనజనతామనస్తాపం, కరధృతవిదితామోఘశరచాపం, జగదుదయస్థితిసంహారావిర్భావ తిరోధానాది మహామాయావినోదనిదానం, అంగీకృతరంగన్మంగళాభంగ తుంబురునారదసంగీతవీణామృదుగానం, భూతభవిష్యద్వర్తమాన కాలత్రయాబాధ్యమానం, అసమానం॥
అక్షీణకటాక్షవీక్షణరక్షిత దాక్షాయణీప్రముఖ నిఖిలభక్తజనసమూహం, నిర్గళితసకలసందేహం, దుర్వారోర్వీభరణహరణ నిర్వహణచణలీలా మానవదేహం, నిరీహం, శ్రీమత్కరుణావలోకనమాత్ర క్షపితఫాలాక్ష చతుర్ముఖాది సర్వసుపర్వాఖర్వఖేదం, నిరంతరామనస్కసమాధిపరిపూర్ణ పరమయోగీంద్రహృదయసరసీరుహకర్ణికోపరిస్థిత వితత జగత్పవిత్రాకృతాద్భుతప్రభావ, భాసుర వియన్నదీజనక విభవాభిశోభిత కిసలయమృదుపాదం, సమస్తజనానుమోదం, నతజనసంతత సకలకల్యాణగుణసంపాదం॥
దళత్పుండరీకపత్రజైత్ర విపులతర మనోహరవిలోచనం, శిలామయ మౌనియోషా ఘర్షణదోషవిమోచనం, యాచితవైరోచనం॥
కుముదబాంధవకిరీట ప్రచండకోదండఖండనోద్దండ దోర్దండసముద్ధామం, దేవతాసార్వభౌమం, రవికులపయఃపారావార పరిపూర్ణసోమం, గర్వితపూర్వగీర్వాణ వాహినీసందోహ కఠినకంఠలుంఠన గళచ్ఛోణితారుణిత సహస్రకరసహస్రకోటిప్రభాభాసమాస మహాభూతభయంకర సుదర్శనాభిధానావక్ర చక్రాయుధాభిరామం, మారీచసుబాహువిరామం, హారహీరనీహారకర్పూరసుధాసారడిండీర శరన్నీరద శారదానారదపూర్ణిమాచంద్ర చంద్రికాధిక్కార దశదిగ్వ్యాపితధవళ యశోధామం, శ్రీరామం॥
జననమరణాది ఘోరసంసారమహాగహనదావదహనాయమాన సకల జగజ్జేగీయమాన పావననామ ధేయం, సూరిజనభాగవిధేయం, ఇంద్రనీలమణిప్రతీకాశాతిస్ఫుటసుందరకాయం॥
రమాకాంతాకుచకుట్మల తటిచర్చితపటీరకుంకుమసంకుమద మిళచ్చందనపంక ముద్రిత శోభనవిశాలవక్షసం, హతఖరదూషణాది రాక్షసం॥
రూక్షేక్షాశిక్షితవిపక్షం, ప్రపన్నావనదీక్షం॥
పరధన పరదారావిముఖ మునిజనసేవ్యం, దుష్టజనదుర్విభావ్యం, ప్రణవైక సంస్తవ్యం, శ్రుతిశిరోవీధికాశ్రావ్యం॥
విలూనదంభాభిమాన నానాభువన సంస్తూయమాన మానవవపుర్నిర్మాణాసమానమానససరోవర ముహుర్ముహురుద్గత సముత్తుంగాఖండానంద వీచీపరంపరా లీలాడోలాందోళిత చిన్మయరాజహంసం, రాజకులావతంసం॥
స్మితమనోజ్ఞానేందుమండలం, రత్నప్రభాచకచ్చకిత చామీకరచారుకిరీట కుండలం, పోషితాఖండలం॥
గుణత్రయ శక్తిత్రయ మూర్తిత్రయానువృత్తం, కరుణామయచిత్తం॥
పనసామ్రకదళీక్రముక ఖర్జూరజంబునింబజంబీర పున్నాగచంపకమధూక వకుళాశోక తమాలసాలరసాలాది కోరకిత పుష్పిత ఫలిత లలిత మహామహీరుహరాజీ విరాజిత రత్నచ్ఛవిచ్ఛటాలంకృత సానుప్రదేశ సంతత సముత్పతన్నిర్ఝరాకలిత ప్రశస్త సమస్తవిలాసోల్లసిత శేషాచలశిఖరమధ్య సువర్ణప్రాసాదవిహరణశీలం, తోషితాశేష భూపాలం॥
సురాసుర యక్షరక్షోరగ గరుడగంధర్వ సిద్ధసాధ్య కిన్నరకింపురుష విద్యాధర చారణాప్సరోబృంద రచిత బహువందనం, భక్తజనచందనం, రఘునందనం, త్వాం భజామి త్వాం భజామి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi