అరణ్యకాండము-08
రాగం: లలితపంచమి - తాళం: ఆది
పల్లవి:
ఓ వనితామణిరో వినవే ॥ఓ వనితా॥
అనుపల్లవి:
వేవచ్చు లక్ష్మణుని వీక్షించి హరి మది నొకటి దలఁచె ॥నో వనితా॥
చరణములు:
నేసాక్షినౌదునైన నీజగము మాయామోహ-
వ్యాసంగ మొందఁజేతునని యెంచి
హా సౌమిత్రి హా సీత నచట డించి వత్తురా తప్పు
జేసితి వింక నేమి సేతుననిన రాము గని యతఁడు పలికె ॥నో వనితా॥
ఆర్తనాదము విని యవనిజ నన్ను బొమ్మన్న
నార్తరక్షకుఁ డతని కడలకుమనిన
నార్తిచే వినరాని దుర్వార్తలాడ నీమార్గాను-
వర్తినై వచ్చితి నన్ను మన్నింపవే యో దయానిధీ యనెను ॥ఓ వనితా॥
ఆమీఁద బర్ణశాల కరిగి సీతలేకున్న
రామచంద్రుడు శోకవారాన్నిధి మునింగి
తా మహామహుఁడయ్యు నిర్దళిత దుఃఖరాశియయ్యుఁ
బామరులకుఁ జూడ జింతాపరవశుఁడైనట్లు విలపింపఁ దొడఁగె ॥నో వనితా॥
హా పూర్ణచంద్రానన హా చకోరాక్షి యింత
కోపమా నాతోఁ బలుకకున్నావేమి
ఓ పరమసాధ్వి యింక నేనెట్లోర్తు నిమిష మొకయుగమాయెఁ
బాపపుదైవమింత పగవాఁడౌటెఱుఁగనని వనితను వెదకె ॥నో వనితా॥
వెతకుచు రాగాహతపక్షుఁడై పడియున్న
పతగేంద్రుఁ గని లక్ష్మణా పరికించితే
అతివె నీతఁడు మ్రింగి హతుఁడైనట్లున్నాఁడు వీని
ధృతిచేఁ జంపుదు విలునమ్ములు దెమ్మనిన రామ నే జటాయువుననె ॥నో వనితా॥
హరిహరి యని డాయఁబోయి యతనిచేఁ దద్విధమెల్ల
నెఱిఁగి పక్షిరాజు మై కరమున నిమిరి
పరగ బోధించిన రామా హరి పరమాత్ముఁడవు నిన్ను
కరమర్థిఁ జూచితి ముక్తి గంటినని ప్రాణముల్ విడిచె నతఁడు ॥ఓ వనితా॥
చితిఁ బేర్చి పులుఁగు మేను శిఖిచే దహించెనంత
ధృత శంఖచక్రగదాబ్జాన్వితుఁడై హితుఁడై
నతుఁడై రుచిరతనుఁడై వరవిమానారూఢుఁడై జటాయు-
వతిభక్తి శేషాచలపతియౌ రాముని నుతియించఁ దొడఁగె ॥ఓ వనితా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi