కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అరణ్యకాండము-07
రాగం: నాయకి - తాళం: ఆది
పల్లవి:
దీనభక్తజనసౌఖ్యదాయకి ప్రాణనాయకి వినవే ॥దీన॥
అనుపల్లవి:
ఆ| భానుకులుఁడు ఏకాంతమున సీతతో నిటులనె రావణాసురుఁడిదె నిను గొని
పో నరుగుదెంచె నీవంతర్హితవై నీదగు ఛాయామాత్రము నిలు
మీ నను వర్షాంతమునందు పొందగా నీకగునన నట్ల నిల్చె సతి ॥దీన॥
చరణములు:
చెలఁగు కపటమృగముఁ జూచి మాయాసీత దీనిఁగొని తెమ్మనిన శౌరి
విలునమ్ములుఁ గొని చనుచు జానకిని గొలిచియుండు సౌమిత్రి నేనీలేడి
సలలితము మీఱఁ దెత్తుననిన లక్ష్మణుఁడిది మారీచుఁడు చేయు పో-
కలు వలదీకార్యము బూనఁగా నగారిస్తుత యన నిల్వకేగె హరి ॥దీన॥
సర్వపూర్ణుఁడయ్యు నచలుఁడయ్యును సాక్షియయ్యు లోకానుసారియై
పర్విడి మాయామృగము వెంటఁ దగిలె భక్తపోషణుండనెడి నుడివి విదితముగా
నుర్వీతనూజ కోరిక దీర్చగ నుద్దండాటవి రఘువీరుఁడు చని
దుర్వారామర్షణుఁడై మృగంబు నుర్విం బడనేసె నిశితాస్త్రమున ॥దీన॥
త్రుళ్లడంగి కపటరూపు చెడి మారీచుఁ డొరలుచో హా లక్ష్మణా
చెల్లరే నన్ను బ్రోవుమని చక్రి చీరినటుల దోచ నార్తరవమున నిలపై
ద్రెళ్లుచు మహీశు సన్నిధిచే ముక్తిం జెందె నచట నార్తధ్వని విని
తల్లడపడి భూమిజ రాముఁ డాపదం బొందెను జను లక్ష్మణా యనెను ॥దీన॥
మూఁడుజగము లనికి దొడరినను రాముఁడు భయార్తుఁడౌనె చెలియ తెలియక
నాడితివను మఱఁదిని యతివ సుజనులాడరాని మాటలాడ నాతండది వినఁ-
గూడక హరీ యనుచు నన్న చనిన జాడం జన రావణుఁ డిష్టము చే-
కూడెననుచుఁ జేరెను మౌనియని గూఢాత్మాకృతియై ధరాసుతను ॥దీన॥
పూజజేసి సీత వలికె మహాపురుష నిలుము మత్పతి వచ్చుదనుక
నా జనకజ గని మీరెవరు దెలుపు నాతి యనిన నయోధ్యాధిపతియగు దశరథ-
రాజుకోడలను రాముని భార్యను లక్ష్మణుఁడను తమ్ముడు దానును వని
రాజీవాక్షుఁడు పదునాలుగు వత్సరంబుల్‌ నిల జనకాజ్ఞ వచ్చెననె ॥దీన॥
నిన్ను విందునన రావణుఁడ నా నెలవు లంక దనుజవిభుఁడ జగముల
నన్నిటిని గెలిచినాను ననుబొందు నరునిపొందు నీకెందుకన విని భయంబు-
నన్నెలత యోరి ఖలుఁడ నిను రాముఁ డస్త్రాహతుఁ జేయుననన్‌ రావణుఁ
డెన్నికఁ బదితల లిరువది కరంబులిమ్మై తగ రథమందు సీతనిడె ॥దీన॥
అలఘుగతిని బోవ శేషగిరినిలయా హరీ రామలక్ష్మణా యనుచుఁ
గలికి విలపింప విని జటాయువది దెలిసివచ్చి రణమొనర్చి కూలెను గిరివలెఁ
గులుకుచు దశాస్యుఁ డరుగ గిరి నైదుగురు కపులను గని తొడవుల్‌ ముడియిడి
చెలి వైచె నచట లంకాపురంబుఁ జేరి యశోకవని సతిని నిలిపె ॥దీన॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi