అరణ్యకాండము-06
రాగం: ఫరజు - తాళం: అట
పల్లవి:
ఇంతి చెంగల్వబంతి చెలువల మేల్‌బంతి గుణముల దొంతి వినవే ॥ఇంతి॥
అనుపల్లవి:
శ్రీకాంతుఁడు గాకున్న ఖరదూషణాదుల నా-
వంతలోనఁ జంప నెంతవారు నరులని
చింతించి దశకంఠుఁ డసురుల శిక్షింపఁ జక్రి యినకులమున
మంతుకెక్క జనించె శ్రీరామాఖ్య బ్రహ్మాదినుతుఁడై యనె ॥యింతి॥
చరణములు:
ఐనఁ గానిమ్ము శ్రీహరిచేతఁ బొలిసితె
మానుగ వైకుంఠ మందిరమేలుదు
నేనతని గెలిచితినేని రాక్షసరాజ్య
మీనేల గలదనుక యేలుదునని తలఁచి
భానునిభమగు రథమెక్కి విధి
పూని బ్రేరేప దుర్మతి వైరానుగతహృదయుఁడై
చనియెను రావణుఁడు మారీచునింటికి ॥నింతి॥
వచ్చిన దనుజేశుఁ జెచ్చెరఁ బూజించి
వచ్చిన పని దెలుపవలెనన్న మారీచు
మచ్చిక జేసి రావణుఁడు బలికె రాముఁడు
హెచ్చి కానకు దశరథేశుఁడు బంపఁగ
వచ్చి మునులకునెల్ల నభయంబిచ్చి మన ఖరదూషణాదుల
వ్రచ్చినాఁడట రాముని సతిని దెచ్చి యేలుదునన నతఁడనియె ॥నింతి॥
రాముఁడు నరుఁడని రావణ తలచేవు
శ్రీమహావిష్ణువు సీతామహాలక్ష్మి
మీమేను బూనినాఁ డిచట నిను బొరిగొన
నా మహాత్ముని చెనకుటదియే మృత్యువు విను వి-
శ్వామిత్రుక్రతువున సుబాహుని జంపి రఘుపతి నన్ను శరమున
నీమహోదధి వైచెఁ బ్రదికితి నేమిసుకృతము కతననో యనె ॥నింతి॥
హరి నన్ను బొలియింప నవతరించినట్లయితె
వెఱచితెఁ జంపక విడుచునా లేలెమ్ము
మెఱసి నీవు మాయామృగమై రాఘవుల స-
త్వరముగ భ్రమియింపు ధరణిజ నేఁ దెత్తు
మరుమాటలాడ నిను జంపుదు మారీచ యని రావణుండన
వెఱచి హరిచేఁ దెగిన మోక్షము వీనిచేఁ బడనేలని కదలె ॥నింతి॥
పదియాఱువన్నియ బంగారువలెఁ దనువు
పొదల మేనిపై వెండిపువ్వులవలె చుక్కలు
గుదిగొన మణిరుచులఁ గొమరారు కొమ్ములు
కొదమరత్నములనఁగా గొరిసెలు దనరఁగ
నుదుట నీలములవలె గన్గవ యొప్ప మారీచుండు లేడియై
కదిలి శేషగిరీశుఁడగు రాఘవుఁడున్న పంచవటి జేరెను ॥ఇంతి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi