కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అరణ్యకాండము-05
రాగం: అఠాణా - తాళం: ఆది
పల్లవి:
వినఁగదవే మదవేదండగమన
మనసార సారసనేత్రు చరిత్రము ॥విన॥
అనుపల్లవి:
మనుజాశని కామరూపిణియు శూర్పణఖ యనెడు మా-
నిని వచ్చి యపుడు కనుఁగొనె రఘువరుని జగద్గురుని ॥విన॥
చరణములు:
ఆదరహాస మామహోల్లాసమా దరస్మేరకటాక్ష విలాస-
మాదరదళితాబ్జాస్యవికాసమా యిందిరాసఖీసుఖనివాస
మే దనర్చునురము సుందరమై యలరు నుదరము ఆ నతజన-
ఖేదముల నడఁచి మోదముల నొసఁగఁ-
గాఁ దగు చరణపల్లవములు ఆ మీఁదట నఖసౌష్ఠవముల జిగిఁ
బ్రోదియిడు తొడల చందము రాముని పాదపద్మముల యందము గని
యా దానవి మదనాశుగములచే నదరిచెదరి దనుజారితోఁ బలికె ॥విన॥
ఎవ్వరు మీరు ఏమి మీపేరు లివ్వని కిట్టేల నేతెంచినారు
ఎవ్వరికుమారు లీచెలువారు జవ్వని యెవ్వతె నిన్ను వేమాఱు
బువ్వువిల్తుకేళి గలయఁగఁ బూనినాను బాళి నన్నేలుము
నవ్వు గాదనఘా నాపేరు శూర్పణఖయండ్రు రావణునకుఁ జెల్లెలి
నివ్వార్త కతఁడు ముదముచేఁ గడు
నివ్వటిల్లు ఖరదూషణాదులు నిన్ను గొల్తు రరిభీషణా యనిన
నవ్వుచు సీత వినఁగ రాముఁడనియె నవ్వనిత కుభయహితవు లొదవుగాను ॥విన॥
మనుకులుఁడను రామాభిధానుఁడను విను దశరథవిభుతనయుఁడ నతఁ డను-
ప నిటవచ్చితి మదనుజుఁడిదిగో కనుఁగొను మీసతి నే ననలసాక్షిగాను
ఘనత బెండ్లియాడినాను గనుక దీనితోడి యీపోటికి
మొనసి నీవు నోపుదువె సౌమిత్రి నెనయు మనినఁ జని వేఁడిన నతఁ
డనియె లలన నను గూడిన నీవును దాసివవుట నిజ-
మన రాముని యొద్దికేగి యది ఘనాకృతిఁ
గనలి సీతపైఁ జన లక్ష్మణుఁ డసిగొని ముక్కుఁజెవులఁ గోసె రక్కసికి ॥విన॥
అఱచుచుఁ బారి యది ఖరునిఁ జేరి మొరవెట్ట సురారి భూరిరణభేరి
పరఁగఁ గదలి శూర్పణఖచే దారి నెఱిఁగి బలము లరిముడి నడచె మీఱి
పరులు వచ్చుట గని యనుజుని ధరణిజనుం దోడ్కొని యగ్గిరిగుహ
కరుగఁ బనిచి రాఘవుఁడు ధనుశ్శరవరకరుఁడై బలువీరుల దార్కొనె
ఖరదూషణత్రిశిరులు దాఁకిరి హరిపై జను నేనుఁగులు నా
హరి మెఱయ సేన నొకబగలునఁ దెగనరికి నారాయణాస్త్రమున రాముఁ
డరుల దొరల తలల దొరలనేసె నవనిపై ॥విన॥
తమ్ముడువచ్చి సీతను దోడితెచ్చి యమ్మెయి నన్న సాహ-
సమ్ము మెచ్చి నెమ్మినుండెను సుఖమ్మున హెచ్చి
యమ్ముదిరక్కసి యట లంకఁజొచ్చి పమ్మి రావణు చర-
ణమ్ములఁబడి వగవ నతఁడు కరుణన్‌ జెలియలిఁ గౌఁగిట
గ్రమ్మి యిదేమన రామలక్ష్మణులు కాంతారసీమ మెలఁగ రామునికలికి చెలువలరి చెలఁగగా నీ
కిమ్మన నన్నిటుజేసిరి నీ తమ్ము లిందుకై పొలసిరి యనినఁ
కొమ్మ నూరార్చి రక్షోవిభుఁడు రాముని నిమ్మహి శేషగిరీశునిగాఁ దలఁచె ॥విన॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi