కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అరణ్యకాండము-04
రాగం: దేశీయదేవగాంధారి - తాళం: అట
పల్లవి:
చానరో వినవే శ్రీరామచంద్రుని చరితము రసభరితము ॥చానరో॥
అనుపల్లవి:
శ్రీనివాసుఁడు త్రోవఁబోవుచోఁ బర్వతశరీరుని జటాయువుని గని సౌమిత్రితోఁ బలికెను ॥చానరో॥
చరణములు:
విలు దే లక్ష్మణా వీని బొలియింతు వీఁడసుర
వలె నున్నాఁడనిన నామాట విని ఖగరాజు
అళుకుచు నిచ్చోటరామా నీవు శ్రీరామా నీవి-
ట్లలుగకు భవత్పితృసఖుఁడను జటాయువనువాఁడ నాపై దయ
జిలుకవే యనుడు కౌఁగిట నలమి యతనికి హరి సెలవొసఁగె ॥చానరో॥
భానువంశమౌళీ పంచవటీగౌత
మీనదీతటమునందుఁ జేర నచ్చట రా-
మానుజుఁ డనువొందు పర్ణశాలలు ఆ పర్ణశాలలు
పూన రెండు రచించె నొకశుభమైన లగ్నమున సీతాయుతుఁ
డై నరేంద్రుఁడచట నిలిచి యలరుచును గడపె మూఁడునెలలు ॥చానరో॥
కందమూలములు లక్ష్మణుఁడు దెచ్చి యన్న
ముందరనిడి చరణముల్‌ గొల్చుచు రాత్రు-
లందెల్ల జాగరణముల్‌ సేయుచు ఆ సేయుచు వి-
ల్లంది శరములుఁ బూని సేవానందుఁడైయుండి యొకతఱి గని
మందహాసవదనారవిందుఁడగు రాఘవున కనియెను ॥చానరో॥
మోక్షకారణమౌ మొదలితత్త్వ మంబు-
జాక్ష నీ వలన నేను దెలియఁగోరితి
రక్షింపు నీకన్న రక్షకులు ఆ రక్షకులు లే-
రక్షయజ్ఞానవిజ్ఞాన విరాగయుతమని దానిదెల్పు
మీ క్షణంబ యన ననుజున కిట్లనెను దాశరథీ ధీనిధీ ॥చానరో॥
విను మాయస్వరూపము వివరించి వెనుక సంవిద్రూపుఁ దెలిపెదను
అనాత్మయైన యీ తనువె యాత్మగా నెదను దోచుటే మాయ తోచుటే మాయ
అనఘ దానివలన సంసారమాయా విక్షేపావరణము-
లనెడు యీ రెండామాయ కాకృతులనె రాముఁ డనువుగ ॥చానరో॥
పరగ జగము లింగాద్యబ్రహ్మాండముగ విక్షేపము సృజించె మించి యా-
వరణము పరమాత్మ నావరించి జ్ఞానరూపమై జ్ఞానరూపమై
బెరసెఁ ద్రాడహియని భ్రమసిన ట్లురుమాయచేనైన జగములు
పరతత్త్వమున గలదనుటరయ నవిచారమనె రాముఁడు ॥చానరో॥
కలలోగన్న వస్తువుల వలనె సత్తుగా దఖిల-
ములు మహేంద్రజాలము సంసారమను
బలుచెట్టునకు మూలము దేహమేనని
దెలిపి తన్మాత్రభూత హృదింద్రియాహంకార బుద్ధిప్రకృ-
తులు నహంతయును తనువన జెలఁగు నన్నిటి కాత్మసాక్షియనె ॥చానరో॥
జ్ఞానమునకు నహంకార మాన డంభజయ మలుక
మానుట ఋజుభావము సేవించి భక్తి-
చే నిజగురుని దైవము గాఁగనెన్నుట గాఁగనెన్నుట
మేని దోసములెఱుఁగుట తనుమనోనిగ్రహము ఈషణవిరతి
బూని నా యందనన్యంబైన మతియును సాధనములనె ॥చానరో॥
ఆసలన్నిటిని జ్ఞానాసిచే దునిమి సచ్చిదానందచైతన్యము తానని దెలిసి
భాసిలుటె సౌజన్యము వాఁడె ధన్యుఁడు
డాసి యనుభవము గురుశాస్త్రాభ్యాసమునఁ గని జీవపరుల వి-
లాసవైఖరుల గూర్పఁ దొలంగు మాయ యిదె ముక్తియనె ॥చానరో॥
మచ్చరణస్మృతిలేని మనుజులిది చెందలే-
రచ్చపు తమములోన జ్యోతి లేక గని-
వచ్చునే యేరికైన గావున నన్ను
నిచ్చఁ దలఁచు వారలకు నిమ్మావిద్య యొరుల కీవలదని
హెచ్చుగాఁ దెలిపె శేషగిరీశుఁ డనుజునకు ముదమొదవగ ॥చానరో॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi