అరణ్యకాండము-03
రాగం: నవరోజు - తాళం: ఆది
పల్లవి:
వినవే తరుణీమణీ శ్రీరాముని
వినుతగుణస్తోముని సుచరిత్రము ॥వినవే॥
అనుపల్లవి:
ఘనమైన షడృతుఫలసుమశోభనమై రాజిత బహువిహగ
స్వనమై జితనందనమై మునిధనమై నరసురమనోసురం-
జనమై తగు నగస్త్యుని తపోవన మినకులమణి గని మెచ్చి సుతీ-
క్షణ నీ గురునకు మా రాక దెలుపుమనె ॥వినవే॥
చరణములు:
స్వామి మహాప్రసాదమని సుతీక్షణుఁ డగస్త్యుని డాయఁ జని మ్రొక్కి య-
హో మహోత్మ సీతాలక్ష్మణులతో రాముఁడిటకు వచ్చినాఁడనిన మౌని
యామాట విని హెచ్చి యెదురేగి హరికి శ్రీమీఱ నర్ఘ్యమిచ్చి తోడితెచ్చి
రామా యంబుజహితకులాబ్ధిసోమా నీలవారివాహస్తోమ-
శ్యామా శ్రీరామా హృదయాభిరామ సంగర-
భీమా పాలకడలికడ నజుచే మును బ్రార్థితుఁడవై దశరథుని
నోముపంటవై పుట్టితివని నుతించె ॥వినవే॥
సకలభువనసృష్టికి పూర్వమునం దొకఁడవై నిరుపాధికుఁడవై యే
వికల్పము లేకయున్న నినుజెంది మూలప్రకృతియైన నీమాయ యవ్యాకృత మనఁగ
ప్రకటమై సృజనసేయ మహత్తత్త్వమున
నొకటిగల్గె మునిగేయ దాని కహంకృతి నామకమై యొకటి జనించె గుణా-
త్మకమై అహంకారమున కర్భకమయ్యెను దానివలన న-
నేకమై తన్మాత్రభూతేంద్రియాత్మకమయ్యు నన్నిటికి సూత్రా-
త్మకమగు లింగమొదవె నందు విరాట్టు కలిగి జగములతఁడు సృజించెననె ముని ॥వినవే॥
నీవు రజస్సత్త్వతమోగుణములు నేర్పునను గొని బ్రహ్మవిష్ణుమహా-
దేవరూపములఁ గ్రీడింపుచు జగదుదయస్థితిలయములను చేయుచుందువు మాయాగుణభేద-
భావాభావముల నొందవు అవస్థాత్రయములఁ
గేవలుఁడవై కనుగొందువు సాక్షివి చిన్మయుఁడవు
దేవాధిదేవ యో మహానుభావా యెపుడు సృష్టిలీలకుఁ-
గా వాంఛింతువపుడు మాయను నీవంగీకరించి గుణవంతుని
క్రేవనుందు వామాయ విద్యావిద్యలు రెండై దనరు విద్య యమృతకరమను ముని ॥వినవే॥
విను మవిద్యనొందిన ఖలులగుదురు విద్యనెనయ నమరులౌదు రది నీ పా-
దనళినభక్తిచేఁ గాని దొరకనేరదు గనుక నీ సేవఁబూని చేసినయతఁడె
ఘనుఁడు కమలజానిపాదసేవకు మొనయని వాఁడజ్ఞాని స్వప్నమునందైనను
కనరాదతనికి ముక్తిమార్గమన రాబుధులు వేయునేటికిఁ
దనరారును మోక్షము బుధజనరాజితోడ సంగతినని మును-
లన రాజసగర్వమోహమదగుణ రహితులు శమదమరతులు సర్వ-
జనహితులు భగవద్భక్తిరతులనె తపసి ॥వినవే॥
ఏ యుపాయముననైన నీయందు దోయజాక్ష నాకు ప్రపత్తి గలుగఁ
జేయుము నిరతము నీ దర్శనము సఫలమై చెలఁగె నా జన్మము నేడు నా క్రతువులెల్ల
శ్రీయుక్తములాయెఁ జూడు నాటనుండి నేఁ
జేయు తపమునకు నేడు నీపాదార్చనము గ-
దోయి సీతతోడ నీ వహిశాయి నా మది నిల్వుమెందు బోయినావు నను ని-
ర్మాయి స్మృతిగలుగఁ జేయు నతసుఖదాయి యనుచుఁ బొగడి యక్షయ-
సాయకతూణీరచాపకృపాణసాధనము లగస్త్యుఁడు రాఘవున కొసఁగె ॥వినవే॥
మేదిని భారహరణార్థము ఈ మేను బూనినావు గావున రావ-
ణాదులఁ జంపు పొమ్ము పంచవటి గౌతమీనది చెంత దనరారు రెండు యోజనముల
మీఁద నది చెలువుమీఱు నటకొన్నినాళ్లు వినోదింపు
ముదము చేకూఱుఁ గమలాకాంతా వి-
నోది గర్వితదనుజచయవిభేదీ యోగిజనానందా-
పాదీ నిరతము జగదాదీసత్యవాదీ యఖేదమణీ వేది యని పల్కు కుంభభవు
పాదములకు నతుఁడై శేషశైలవాసుఁ డవల జనె నవనిజానుజులతో ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi