అరణ్యకాండము-01
రాగం: దేవగాంధారి - తాళం: ఆది
పల్లవి:
శ్రీ శేషాచలవాసుని వినుతి సేయ నెవరికినైనఁ దరమా ఉమా ॥శ్రీ శేషా॥
అనుపల్లవి:
శ్రీశుఁ డత్రిమునిచే దారెఱిఁగి దినేశోదయకాలమున గదల సీ-
తాసుమిత్రసుతులతో మదవేదండ పుండరీకానీక చమ-
రీ శశ వరాహ మహిష శరభ కపి వృకాది మృగభయదమై ఖగకులా-
వాసమై ప్రచండమౌ దండకావనముఁ జొచ్చి యనుజునితో ననియెను ॥శ్రీ శేషా॥
చరణములు:
మనుజాశన కంటకావృతం బీ వనము మన మతిప్రయత్నముగ బోఁ
జనుచు ఖేటముల్గొనుచు జనకజ ముందఱ వెనుక రామల-
క్ష్మణులిరువురు జని కనిరి యసురనాథుని మౌనిఖగవ్యాధుని విరాధుని
ఘనశూలము ద్రిప్పుచు వాఁడు వచ్చి కట్టలుకన్ మీరెవరని యడిగిన
విను రాఘవులము దశరథవిభు పనుపున సుజనులఁ బ్రోవ ఖలుల జీవ-
ధనము గొన వచ్చితిమన బ్రతికెడి తలంపుగలిగిన లలననొసఁగి చనుఁ
డని కదియ మహాసిచే రాముఁ డాదనుజ కరచరణశిరములు వరుసన నరకె ॥శ్రీ శేషా॥
శ్రీరాముని గౌఁగిట జేర్చె సీత చెలఁగె దుందుభిరవము విరులు గురిసెఁ
దోరముగాఁ గడుశృంగారముగా సారెకు నచ్చర లాడిరి పాడిరి
చేరి కిన్నరు ల్విరాధు జంపుటచే రాజిలి రరికరిహరియైన హరి
చారుభూషణద్యుతి నసమధృతి నుదారశుభాకృతి నమలాంబరభృతి
తారాపథమధ్యగుఁడగు కవిగతి దనరు చక్రధరుని శౌరిని గని
కోరిక దీఱ వినమ్రుఁడై మ్రొక్కి గుణాఢ్య విద్యాధరుండ దుర్వాసు
భూరిశాపమున నసురనైతి నిదె ముక్తి నీవలననగుటనె విరాధుడు ॥శ్రీ శేషా॥
భవరోగవైద్యదయాకర నమో ధవళాంబుజాక్ష నిను దలఁచుచు గను-
చు వినుచు నుడువుచు నంటుచును నవిరళముగ మ్రొక్కుచునుండఁగ సే-
యవలె నా మనోనేత్రశ్రోత్రజిహ్వా కరశిరములు రామ తారకనామ
భవనుత యని పలుక హరి నగుచు నా భక్తి దుర్లభంబది నీకుఁ గల్గెఁ
బ్రవిమలసుజ్ఞానివైతివన విని ప్రకటసుగుణభద్రా రామభద్రా
ఎవరు నీకు సము లధికులటంచు నిజేచ్ఛ నరిగె విద్యాధరుఁ డంతట
రవికులమౌళి జేరె శరభంగాశ్రమ మమ్ముని గనె సీతానుజుఁడగు ॥శ్రీ శేషా॥
చూచి యెదుర్కొని పాద్యమొసఁగి యచ్యుతు సుఖాసీనుఁ జేసి పూజించి
నీచమతుల్ ఘనసంసారరతుల్ ఓ చిత్తజజనక నిను దెలియలే-
రురుతరమగు కటాక్షమున నిను జూచితి నేఁచి యఘముల బోఁద్రోచితి య-
హో చిత్రమనుచుఁ బలికి శరభంగయోగి తారువుల్ ప్రోవిడి యనలము-
చే చితి దరికొల్పి యందురికె సీతాచంపకగంధీయుతు హృద్గంథి-
మోచను విశాలలోచను మానసమునందునిచి ముక్తతనుఁడయ్యె దఱి-
వేచి దండకావాసులైన మునులా చతుర్భుజుని జేరఁ జని పొడ గనిరి ॥శ్రీ శేషా॥
మ్రొక్కి రఘూత్తముఁడు మునులారా సుఖముగదా మీకనిన రక్కసుల చేఁ
జ్రిక్కితిమి బాధల స్రుక్కితిమి గ్రక్కున మము బ్రోవుమనుచు రామున
కక్కడనున్న కపాలముల్ జూపి వెక్కసమున వృజినుల ఘనుల మునుల
జక్కజేసి రింతయు దైత్యకృతమే శరణు మా మొరాలింపుమనిన విని
యుక్కడంతు దానవులనని యభయ మొసఁగె మునులకెల్ల మది రంజిల్ల
మక్కువతో భరతాగ్రజుఁడు నిలిచె మౌనిగృహములందుఁ గొన్నేండ్లచట
నక్కఱతో జని కనియె సుతీక్షణుఁడను మునీంద్రుఁడు పరబ్రహ్మమూర్తియగు ॥శ్రీ శేషా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi