కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అయోధ్యాకాండము-09
రాగం: జుజావంతి - తాళం: ఆది
పల్లవి:
వినవే దళదరవిందదళసుందర
విశాలలోచన నిజకింకరజనభయమోదన ॥వినవే॥
అనుపల్లవి:
మనుకులతిలక అయోధ్యకురమ్ము క్షమాపతివై మమ్ముబ్రోవుము
ఘనయాగములఁ జేసి సుతుల గాంచి
తనయుల రాజ్యమున నునిచి పిమ్మట
వనమునకేగుట రాజధర్మ మిటువలెఁ జేయుము కైక దురితమతియై
యొనరించిన యపరాధము క్షమింపుమని భరతుఁ డన్న పాదములకు మ్రొక్కెను ॥వినవే॥
చరణములు:
భరతుని రాముడు తొడపైనిడుకొని పరగ బుజ్జగించి దశరథ
నరనాథుఁడు నన్నరణ్యమున పదునాల్గేండ్లు వసించి మీఁదట
పురముఁ జేరుమనె నంతదనుక నిను ధరణిఁ గావఁగఁ బంచినాఁడిది
యిరువురమును నెఱపవలెనన భరతుఁ డిందిరేశుఁ గాంచి జనకుఁడు
కరటికాముకుఁడు భ్రాంతుఁ డతని వాక్యమనృతమన వత్సా దశరథుఁ
డరయ సత్యవాది యతని దూరకుమనిన సామి మునినై నే వనమున
జరియింతు నీవు ధర యేలుమనుడు హరి యదేటి తగవటంచన నేను నీ
చరణముల్‌ గొలిచి వత్తునన దాశరథి వల దయోధ్యకుఁ బొమ్మనె దమ్ముని ॥వినవే॥
శ్రీ యొల్ల నయోధ్య యొల్లఁ దనువు త్యజింతుననుచు లేచి భరతుఁడు
ప్రాయోపవేశమునకై కుశభూశాయియైనఁ జూచి రాముఁడు
మాయురే యని కులగురుని కనుసైగఁ జేయ నతండేచి భరతుని
డాయఁబోయి నా వాక్యమున తండ్రి మాయలు బోద్రోచి విను నా-
రాయణుఁ డచ్యుతుఁడీ రాముఁడు బ్రహ్మచేత బ్రార్థితుడై రఘుకుల-
తోయధిఁ బుట్టెను రావణాదులను దునిమి వచ్చునన నతఁడద్భుతముగ
శ్రీయుతునకు నతుఁడై పాదుక లర్థించ రాముఁడొసఁగ మౌళినిడికొని
తోయజాక్ష సమయాతీతమైన నే యనలముఁ జొచ్చువాఁడననె భరతుడు ॥వినవే॥
కైక సాశ్రుజలనయనయై శౌరి గని మంతనమందు రామా
నీకపరాధముఁ జేసితి ఖలనై నిందఁ బడితినెందు నను దయ-
చే కరుణింపుము నీ మహామహిమ శ్రీనివాస ముందు నెఱుఁగ గు-
ణాకరుఁడ వగుణుఁడవు విష్ణుఁడ వవ్యయుఁడవు నీయందు లోకా-
నీకముల్‌ నీదు మాయచే జనననిలయవిలయములను జెందును
నీకన్యము లేదు ఇంద్రజాలికుని తెఱఁగున మాయామనుజతనువు
చేకొని నటియింతు నీవు నీచే లోకులు ప్రేరితులై చరింతురు ది-
వౌకస కార్యమొనర్చితి నీ మాయాకళామోహితాత్మనై నేను ననె ॥వినవే॥
పాహిపాహి దేవదేవ నమోస్తు పద్మనాభ సీతానాయక
మోహమనెడి ముడి విడుమని జనని బొగడ నతవ్రాతావనుఁడగు
శ్రీహరి చిరుగనగవు దొలుకఁ బలికెను చెలఁగ ధీసమేత నిజమే యు-
దాహరించితివి నిర్జనకార్యార్థము నే నీచేత ఇటుల
వ్యాహృతముగఁ బలికించితి నీకు భవము లేదదె నన్ను దలఁపుము
ద్రోహస్నేహములు లేవితనికని దుష్టులు నను దెలియలేరనిన ఖగ-
వాహనునకు మ్రొక్కి కైక వీడ్కొనె వరసేనాయుతుఁడై భరతుఁడు జని
మోహనముగ నందిగ్రామమునను బాహుకంఠలుంఠనుని దలఁచుచుండెను ॥వినవే॥
కుండలిశయానుఁ డిచట జనసంకులమని భూమిసుతాలక్ష్మణు
లండదండలను నడువ దండకారణ్యముఁ జొచ్చి శ్రితాశ్రితుఁడై
యుండెడి నత్రిమునికి మ్రొక్కిన నతం డొసంగె నర్ఘ్యము జితాహితున క-
ఖండభక్తి ననసూయకు జానకి దండమిడ నభిమతార్థసిద్ధి
దండిగ నగునని దీవించి యిచ్చెఁ గుండలయుగ మవనీతనయకు
మెండుగ జతుర్దశాబ్దములకు కాశ్మీరచందనాద్యలంకారములు
నిండుమనంబున నొసఁగె ననసూయ నృపలలాముఁడగు రాముఁ డత్రిముని
మండలాఖండలుని తోడఁ దత్త్వమహితగోష్ఠినుండె నమరసన్నుతుఁడై ॥వినవే॥
భాషాపతినుతుఁడగు శ్రీరాముని భయభక్తులు మీఱఁజేరి య-
శేషభువనములు సృజించి యవి పోషించుటకును దారాకృతులను
వేషధారివలె బూనెదవు నీవు రోషదూరా మాయా-
యోషామణి యఖిలము భ్రమించునది యొదుగు నీకు వీరాధివీరా
దోషాచరహర హరచాపదళన పోషితమునిసవనా యవని కడు-
భూషించె లక్ష్మణుఁడు నాచే నిమ్ముగ బలుకఁబడిన యీచరిత మాంధ్ర-
భాష నధ్యాత్మరామాయణమునఁ బరఁగ నయోధ్యాకాండము రచించె
శేషాచలపతి పేర నతని కృపచే సుబ్రహ్మణ్యకవీంద్రుఁడు ముదమున ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi