అయోధ్యాకాండము-08
రాగం: మంగళకౌళిక - తాళం: అట
పల్లవి:
ఎలమిచే సేవింపవే శ్రీరాముని
చెలిమిచే భావింపవే యో లలనా ॥ఎలమి॥
అనుపల్లవి:
సలలితముగ రామచంద్రుని శ్రీపాద
జలరుహనిష్యంద సద్భక్తిమకరంద ॥మెలమి॥
చరణములు:
భరతుఁడా మీఁదట బంధుమిత్రమంత్రివరసేనాపరివృతుఁడై కోసల-
పురికి హరిని దే నుద్యుక్తుఁడై వసిష్ఠాది గురుసజ్జనాన్వితుఁడై కదలి గంగా-
సరిదమలపులినాంతరముల విడిసె నచ్చెరువంది గుహుఁడు చెచ్చెర శరశరాసన-
ధరుఁడై యోధులతోడ దరమి నడిచి యితఁడు పరమపావనుఁడేని
సురనది దాటింతు హరికి వంచకుఁడేని యరుగనీనని వచ్చి
భరతు రామసేవానిరతు రాజ్యకాంక్షావిరతుఁ గని మెచ్చి యర్పించె కాన్కలు మ్రొక్కి ॥ఎలమి॥
కూరిమి భరతుఁడు గుహుని మహామహుని
సారె గౌఁగిటనుంచి యచ్యుతు చెంతఁ
జేరిన ట్టాత్మనెంచి యచ్చట నీవు శౌరినిఁ బొడగాంచినావని యతని-
చే రాముఁడు విశ్రమించియున్న చోటారసి తిలకించి మ్రొక్కి యచట
నారాత్రియుండి మఱునాడు ప్రొద్దున భాగీరథి దాటి యరుదార భరద్వాజ
శ్రీరమ్య చరణారాజీవములు వలగొని యారూఢి తా వచ్చుటంతయుఁ దెలిపి స-
త్కారములతనిచేఁ గాంచినాడచట శ్రీ-
మీఱ నిల్చి మునిచే దారి దెలిసి వేగ శ్రీరాములుండెడి చిత్రకూటము జేరె ॥ఎలమి॥
బలముల భరతుఁ డిమ్ముల నునిచి గుహశత్రు-
ఘ్నులు రానడచి తన మై పులకలు నిండఁ
దిలకించె మునిధనమై ఫలకుసుమకు-
ట్మలపాళికాఘనమై శాఖిశాఖా-
విలసద్ఘనాఘనమై మయూరకోకిలకీరసేవనమై పావనమై శ్రీ
యలరు నావనము పరిహసితానందన మచట హల-
కులిశధ్వజ నీలాబ్జరేఖల చాలఁ బొలుపొందు సీతారాముల పాదముద్రిత-
స్థలులు గని హర్షాశ్రుజలము కన్నుల జార ఫలియించె నాదు కోర్కెలు నే ధన్యుఁడనై
వెలసితినని యెంచి వినుతించి హరియున్న
నిలయము శుభలక్ష్మీవలయముఁ జూచెను ॥ఎలమి॥
వెలిదమ్మిఱేకుల గెలుచు కన్నులవాని వెడదయురమువాని నల్లనివాని
మొలకనవ్వులవాని సీతాలక్ష్మణులతోఁ గ్రీడించువాని నారచీ-
రల జడల దనరువాని నీరేడుజగముల నేలినవాని రాముని జూచి
సలలితభయభక్తి సంభ్రమాద్భుతముల
వలగొని తత్పాదనళినములపై హస్త-
ములు సేర్చి సాష్టాంగముగ మ్రొక్కి కనుల నం-
గుళములొత్తుచు మేలు దలఁచు భరతుని కృపా-
కలితదృష్టిఁ గాంచి కౌఁగిలించి తొడల నెలకొల్పె గుహశత్రు-
ఘ్నులు నతులొనర్పఁగ లలితుండు దీవించి వెలలేని చనువిచ్చె ॥నెలమి॥
స్వామి కౌసల్యాది జననులు రా మ్రొక్కి వసిష్ఠముని గాంచి పూజఁజేసి
భూమీశు నెచ్చరించి సేమమడుగ నీమీఁది మమతమించి దశరథుఁడు ని-
న్నే మదిలోనుంచి దివికరిగెనన వేమారు శోకించి గంగానదికి
రామ లందఱు వెంటరా నరిగి స్నాతుఁడై
ప్రేమఁ దిలోదకక్రియలు దశరథునకు
సౌమిత్రియును దాను సల్పి కృతకృత్యుఁడై
నేమమున నాదినము నెరవేర్చి మరలి నిజ-
ధామము జేరి సత్ఫలములందఱి కొసఁగి
శ్రీమీఱ మన్నించె శేషగిరిప్రభుఁడౌ శ్రీమహిళావిభుఁ డీలీల వినోదించె ॥నెలమి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi