కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అయోధ్యాకాండము-06
రాగం: భూపాలము - తాళం: అట
పల్లవి:
సఖీమణి వినవే నీవీ సచ్చరితము సలలితానందదాయకమనవే ॥సఖీ॥
అనుపల్లవి:
సుఖాజడశుభసుషుప్తిదేరి ముఖాబ్జకాంతి పొదల రఘుకుల
శిఖామణి గుహసీతానుజుల్‌ సేవింప స్నాతుఁడై సుప్రీతుఁడై లస-
దఖండమగు యోడ నెక్కి యమరాపగ గడచి గుహుని బిలిచి
సఖా పురికి బొమ్మనుచుఁ బనిచె సదయుఁడై ప్రయత్నపూర్వముగ ॥సఖీ॥
చరణములు:
మించి రాఘవులు మృగమునొకటి వధించి పచనము మంచిగాఁ గా-
వించి ముగురు భుజించి యచట వసించి మేల్‌ గాంచి మరునాఁ
డంచితగతి ధరాత్మజ తానుదంచద్భరద్వాజాశ్రమము
గాంచి మునికి తమ వేంచేయు డెఱిఁగించఁగాఁ బంచి
హర్షించి రమ్మునిశిష్యుచే నృప పంచాననులు వచ్చుట దెలిసి
చంచదర్ఘ్యము గొంచెదురు చని చక్రి వీక్షించి తనువు పుల-
కించ నుతియించ ముని కనఘులు నమస్కరించ కౌగలించి రాముని పూ-
జించెను శ్రీరాముని స్మితముఖజితసోముని జగదభిరాముని ॥సఖీ॥

నాదబిందుకళాతీత జగదాదిపురుష మహాత్మ విను నీ
పాదరజమునఁ బ్రోదిసేయుము నాదుమందిరము అనిన ముని
నాదరించి తదాశ్రమమున వినోదించి తదనుజ్ఞ సుజనా-
హ్లాది వాల్మీకాశ్రమము శ్రుతినాదబంధురము గని ముని-
పాదములకు నవనిజానుజులతో దవిలి ప్రణతుఁడై యలరు మ-
హాదేవుని సుమాస్త్రరుచిరుని నబ్జదళనేత్రు రమాకళత్రుని శ్రిత-
మేదినీసుతాలక్ష్మణు లావాల్మీకిఁ గాంచి గారవించి పా-
ద్యాదివిధుల నర్చించి ఫలము లర్పించి భజించి హరి పలికె ॥సఖీ॥

స్వామి విను వనభూమి దశరథభూమివిభు పంపునఁ జరింపఁగ
మేము వచ్చుట మీకుఁ దెలియని దేమియున్నది నేను యీ మానవతి-
తో మెలఁగి యిచట శ్రీమించునది నేమింపుమని రాముఁడు పలుక
నామౌని యఖిలార్థసంవేదియై ప్రేమచేఁ బల్కె భువనమునకు
రామ నీవే నిలయమవి నీకు ధామమిది సాధారణ మనుత్తమమైన దే-
వా మహానుభావా విను మేమహాత్ము లతిశాంతులు సము లిచ్ఛాసూయావిరహితులు నీ
శేముషి గలవారి మది నీకు శ్రీయుతముగ నిల నునికి యనెను ॥సఖీ॥

శమదమదయాసత్యములు గల సుమతులెవ్వరు శుభాశుభముల
సమయముల హర్ష విషాదముల భ్రమయరెవ్వరు సుజన బృం-
దములఁ గూడి ధర్మాధర్మసమరసము వీడి మది నిను శర-
ణము వేఁడి గర్వము దిగనాడి మమత గోరాడి యెవ-
రమరులయి తనరారుదురు యెవ రమితధృతి శ్రీరామ నీ మం-
త్రము జపింతురు ద్వంద్వరహితులయి తజ్జనుల స్వాంతము నిశాంతము నీకు ష-
డ్విమత షడూర్మి షడ్భావములకు మీఱి యవల వెలుఁగు నిను దే-
హముగ సర్వగతునిగ నొకనిగ నరయు జనుల మది యిలు నీకనె ॥సఖీ॥

అనవరత యోగాభ్యాసబలమున దృఢీకృత-
మనస్కులు నిను ప్రతినిమిషమును గనుఁగొనుచు ననఘులయి మించు
ఘనుల హృద్వనజమున సీతాయుతుఁడవయి మొనసిన విహరింపుమదియ నీకు
ననువైన ఠావు నిను వర్ణింపజాలనంచుఁ బలికి
వనజాక్ష నీప్రభావముచే ననువంద బ్రహ్మఋషినయితిని
జనమాత్రమే క్ష్మావరుఁడను నిషాదపురిఁ బెరిగి విలు బట్టనెఱిగి బో-
యనెలత నొకతె నెనసి కొడుకులఁ గని నే వారి బ్రోవ జీవుల
మును మిడియ మునివలెనె జంపుచు ముచ్చులఱేఁడన నెగడితి ననె ॥సఖీ॥

ఈ గతి చరియింప సప్తఋషు లాగమవేత్త లరుగ వారల
సాఁగిపోనీకాఁపిన ననిరి వేగ నీవరిగి నీ సుతుల
నీ గరితలను నెమ్మిఁ బిలిచి భోగఫలముల పోల్కి దురితము
భాగములు గొమ్మని వారి నాగరిక మెఱిఁగి రా మాతో గర్వమెందుకనఁ జనినే
నా గరితనడుగ నాలుబిడ్డలు మూఁగి యడచిన మొఱకునయి మరలి
యోగివరులను గని యది దెలుప విని కడు-
రాగిలి యుపదేశమిచ్చి వారవలఁ జన 'మ-
రామరా' యని విరాగినై జపించితి పుట్టలు ప్రబలె నాదు తనువున ననె ముని ॥సఖీ॥

అంతట బహుసహస్రాబ్దములు పంతమునను దపంబు సేయగ
దాంతులగు సప్తఋషులు వచ్చి దనర ననుఁ దెలుప భానుఁడు
మంతు మీఱఁ దమమునడఁచు క్రియ వింతగా వల్మీకము వెడలి
సంతసమునను సంయములఁ గని సద్భక్తి సలుప ధీ-
మంతుఁడవు బ్రహ్మఋషివైతివి వంత దీఱెను వాల్మీకి యని
యంతర్హితులై రింతయును శేషాద్రీశ నిను మది నుతియించు ఫలమిదియని
కొంత బొగడి సురనదికి చిత్రకూటగిరికి నడుమ గృహము ముని-
కాంతుఁడు రచింప సీతాలక్ష్మణయుతుఁడై హరియుండె నచట ॥సఖీ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi