కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అయోధ్యాకాండము-05
రాగం: యదుకులకాంభోజి - తాళం: ఆది
పల్లవి:
చికురనిందితాళీ రణకేళీజితమదాసురాళీ నిలయీకృత
సకలభువనపాళీ లలనాజనమౌళి కాళి వినవే ॥చికుర॥
అనుపల్లవి:
సకలరాజన్యు రాజను భానుకులరత్నము విభవమునుడిగి జ-
నకసుతాలక్ష్మణసమేతుడై వికసితాంబుజలోచనుడై చను-
టకు గతమేమని తండ్రి యాజ్ఞ నడవికి బోవుటెఱిఁగి పురజనులు పొగల
నకట వగవకుండనుచు వారితో ననియె వామదేవుఁడన్మునీంద్రుడు ॥చికుర॥
చరణములు:
ఈ రాముఁడు నారాయణదేవుఁడు ఈశుఁ డవ్యయుఁడు మహానుభావుఁడు
శౌరి యోగమాయ సీతయయ్యెను కోరి శేషుఁడే లక్ష్మణుఁడై యలరె జను-
లారా బ్రహ్మవిష్ణురుద్రాకారమై బూని గుణశ్రీ-
మీఱ జగదుదయస్థితిసంహారములు జేయు ఘనుఁడు హరి
ఈ రాముఁడు మత్స్యకూర్మసూకర నారసింహ వామన భృగురామ శ-
రీరములు దాల్చి యిపుడు దశరథకుమారుఁడయ్యె ఖలుల జంపుటకుననె ॥చికుర॥
రావణాది దుర్జనుల వధార్థము రాముడుద్భవిల్లుట ఈ యర్థము
దేవముని దెలిసి పలుక నతనితోఁ దెల్పె రేపు వని కేగెదనని యితఁడు ధర-
ణీవల్లభుఁడు గైక హరి నటవీవాసమున కనుపలే దితఁ
డే వారల నిట నియమించెను దైవాధీనము సర్వజగము
గావున మీరిందుకై యడలకుఁ డీ వనజోదరు హృదయపద్మమున
భావించినఁ జింతలెడలునని ముని పలుకఁ బౌరు లలరి హరి నుతించిరి ॥చికుర॥
ఆ మీఁదట రాముఁడు కైకనగరి కరిగి యడవికేగ మాకు ముగురికి
భూమిపతి యాజ్ఞ కొనుమనిన కైక దీమసమున నిచ్చె నారచీరెలు అవి
సౌమిత్రియు రాముఁడు గట్టిరి భూమిసుతచే గాకున్నను
స్వామి జనకజ కటిఁ జుట్టెను ఏమీ యనలేక నృపభార్య
లీమానవతి కీచీరె తగదని యేడ్వఁగ వసిష్ఠుఁ డదరిపడి కైక
నీమది చెడ సీత కది యొసఁగఁదగునే యని దుకూలము లవనిజ కొసఁగె ॥చికుర॥
రాజు సుమంత్రునిచేఁ గుమారులకు రథము దెప్పించ నపుడె జనకునకు
శ్రీజాని సలక్ష్మణుఁడై మ్రొక్కెను సీత యందఱికి మ్రొక్కి యరదమెక్కి హరి
జేజే లలరఁగ తేరెక్కెను జేజేయని ప్రజలు వొగడ నహి-
తాజేయుఁ డఖిలసాధనములు తాఁ జేకొని సుమిత్రకొమరుఁడు
రాజిలు రథమెక్కె సుమంత్రుఁడు రథ రథ్యముల నడుప నిలుమని దశరథ
రాజు విలపింపఁ దరమినడచి జనరాజితోడ దమస దాఁటె రాముఁడు ॥చికుర॥
పుడమిఱేఁ డవనిపైఁ బడి పురపురఁ బొక్కి పొరలి యేడ్వ భృత్యు లధిపుని
యడరి కౌసల్యనగరకిఁ గొని చనిరా యువతి విభుని బోధింపుచునుండె న-
క్కడ రాముఁడు నిల్చి జనుల నిటు విడరాదని పురికి రథముగొని
నడురాతిరి సుమంత్రుఁ బొమ్మని యుడురాజనిభాననయును నను-
జుఁడుఁ గూడి నడువ నపుడె కదలి చని సుమహత్తరంగకలికలుషభంగ
మృడజటాజూటసంగ గంగఁ గని మెచ్చు శౌరిఁ జేర గుహుఁడు వచ్చెను ॥చికుర॥
చరణకమలయుగళికిఁ బ్రణమిల్లెడు యెఱుకువాని రాముఁడు సుధఁ జల్లెడు
గురుదయాదృష్టిఁ గని కౌఁగిట నిడుకొన్నఁ బొగడె గుహుఁడు భక్తి నచ్యుతుని
హరి ధరియించె జటలు మునినై వని జరియింతుననుచు లక్ష్మణుఁడును
ధరియించెను సత్యవ్రతుఁడని కురియించిరి విరులు సురలు శ్రీ-
ధరుఁడు గంగనీటఁ గ్రుంకి జలములు ద్రావి తరుమూలమునఁ బవ్వళించెఁ
దరుణితోడ నట రామచంద్రు నాగరులు గానలేక పురికిఁ బోయిరి ॥చికుర॥
మాయామానుషవేషధారి తృణశాయియై నిదురవోవఁగ ధను-
స్సాయకములు బూని గొలిచియుండెడు సౌమిత్రితో నిషాదవిభుఁడు పలికెఁ దృణ-
శాయి శ్రీహరి నిటు గని కనుదోయి సంతోషింపకున్న-
దోయి ఈ దుఃఖమునకు కయికేయి హేతువుగదా యనెను
మాయికము సుఖాసుఖము నొడలు తమ కేయెడ లేదని లక్ష్మణుఁడు శర-
నాయకునకుఁ దెల్పఁగ నరుణోదయమాయె శేషగిరిపతియు మేల్కొనెను ॥చికుర॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi