అయోధ్యాకాండము-04
రాగం: ఆనందభైరవి - తాళం: అట
పల్లవి:
వినవే పల్లవమృదుచరణా కరుణావితరణగుణాభరణా ॥వినవే॥
అనుపల్లవి:
జనవిభుఁడానతిచ్చిన దండకాటవికి
మునివేషధారినై చనియెదనన విని
యనఘ రాఘవ కాముకుఁడనై యతివవలనను జిక్కితిని నిను
వనమునకు ననిచి ప్రాణము లీతనువునను మనవనెను భూపతి ॥వినవే॥
చరణములు:
రామా జగదభిరామా సుబాహువిరామా కులల-
లామా హా హైమవతీచింత్యనామ హా భీమోద్దామసం-
గ్రామ హా శ్రీమహితముఖజితసోమా నిన్ను
నేమని పొమ్మందు నెటుల నోర్చియుందు
యీ మోహాబ్ధికిఁ గట్టు ఏదని విలపింప
నామహీవతి నడలవలదని సౌమిత్రితోఁ దల్లినగరికి
స్వామి చని నతి సుమిత్రాకౌసల్యలకు సేయ దీవించిరి ॥వినవే॥
అనువంద వనభూమికరుగఁ గార్యమువచ్చెనమ్మా సెలవిమ్మా యనిన
విని సొమ్మసిల్లి యాకొమ్మ హా వనజాక్ష ననుఁ జేరరమ్మా రాజు
నిను బొమ్మనుట నిజమ్మా నమ్మనన నగుచు కైక
తన నందనుని దొరనుగా నను పదునాల్గేండ్లు వనమున వసియింప
జనవిభుని వేఁడెఁ బితృవాక్యమున మనుప జనియెదనన భరతుని క-
వని యొసఁగి తనయు నిచటనె నిలుమనుచుఁ గౌసల్య విలపించెను ॥వినవే॥
కైకయెవ్వరు ధరణికాంతుఁడెవరు చూడు నా
ఢాక పరాకా కైక నీకై కడిగి దివిజానీకములు
డీకొనినఁ ద్రుంతుపోనీక రాజ్యశ్రీకిని పట్టాభి
షేకమిపుడు ప్రాకటముగఁ జేతు భరతుడల్గిన నతనినిఁ
గేకయుల త్రుళ్లడఁగింతునని లక్ష్మణుఁడు
వీకమైఁ బల్క రాముఁడు విని నీ కడిమియును నీదు భక్తియు
లోకములకెల్ల దెలియును వత్సా కైకపై యలుగవలదనె ॥వినవే॥
జడము నశ్వరము యీ జగము రాజ్యము తనువు సత్యమాయిది నిత్యమా ఆస-
పడ భోగఫల మౌన్నత్యమా కలిమిపడఁతి చంచల సుజన స్తుత్యమా భ్రాంతి
యుడుగకుండుట సత్కృత్యమా మానవుఁ డసుఖమునకు కర్మ మొడిగట్టి తనకంటె
నొడలు వేఱని తెలియ నుడుగుకోర్కెలు తృణతతి
నడియేటఁ గూడి యడసిన క్రియ మాతృపితృసుతహతాదుల
నడకయిది స్వప్నసమమని యెన్నక జడుఁడు కోరుననె రాముడు ॥వినవే॥
ఆయువల్పము జరావ్యాధులు పులులవలె డాయ దెలియడాయ నరుఁడు
ఈ యఖిలసుఖములు హేయమనడు మాయురే భగవన్మాయ దేహ-
మే యాత్మయను కుమతి ఛాయామాత్రమై యస్థిత్వఙ్మేదోమజ్జాసృఙ్మాంస ని-
కాయమౌ కాయమెట్లాయ నాత్మ చెపుమా
యీ యాసవిడువు మహమిక భ్రమహేతువిదియ యవిద్య నేనన-
పాయమగు సచ్చిదానంద బ్రహ్మమనుటిది విద్యయనె హరి ॥వినవే॥
మొదలు క్రోధము పాపమునకు మనస్తాపమూలము ఇంద్రజాలము క్రోధము
సదయాత్ములకు ప్రతికూలము క్రోధము
హృదయగ్రంధికి నాలవాలము క్రోధము
విదితధర్మములకు శూలము మదియం-
దది యుంచకను నిను నీ వఖిలసాక్షిగా నెంచి
ముదమున సుఖియింపుము యీజ్ఞానము
మదయుతుల కీవలదు లక్ష్మణ మర్మమని తల్లికీతత్త్వమె
సదయుఁడై తెలుపఁ గౌఁగిట సుతుఁ గదియించి పోయిరమ్మనె సతి ॥వినవే॥
హరి సుమిత్రకు మ్రొక్కి యన్న లక్ష్మణ నిలువుమన్న మనను వెన్న
కరణి కరుగఁ బల్కె నీకన్న మును నే
నరిగెద నను రానీకున్నఁ జత్తు పరమేశ యనినఁ గడుఁ జెన్నారంగ
కరుణించి యనుజురాకకు సమ్మతించి యా ధరణిజను జేరి నే దండకాటవికేగి
తిరిగి వచ్చెద నిలువుమన నీ చరణముల యాన నే నిలువను
బరమాత్మ యనిన శేషాచలపతి యతివతోఁ గూడి కదలెను ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi