అయోధ్యాకాండము-03
రాగం: తోడి - తాళం: అట
పల్లవి:
సరసగుణమణిసన్మందిర సఖీకృతేందిరా వినవే ॥సరస॥
అనుపల్లవి:
గరిమమున రాఘవుని యభిషేకమహోత్సవము శుభమనక భయా-
కరమనుటయేమి శ్రీరాముడు కౌసల్యగా ననుఁజూచునను
పరమసమ్మతములైన కైక వచనముల్ వినఁగఁజాలక మం-
ధర నీసుతునకు నీకు సుఖము దలచినాను దాయఁగాను దలపకు ॥సరస॥
చరణములు:
కైక విను భరతశత్రుఘ్నుల కేకయపురి కనిచి నీకాంతుఁ
డో కాంత యేకాంతమున సీతాకాంతు ధరణీకాంతుగాను
ప్రాకటైశ్వర్యమునకెల్లను పట్టభద్రునిఁ జేయదలచెను
నీకు నీతనయునకు దాస్యము నియమించు నొకయుపాయమున్నది
నీకు రాజు దేవాసురాజి నిచ్చిన వరములు రెండు గలవు
నీకొడుకు దొరతనము రాఘవుని వనవాసమును నాన సేయుమనె ॥సరస॥
ఈ విధమున మంధర పలికిన హితవని తలఁచి సఖిని మెచ్చుచు
నావనిత ధీజనితకోపమునను మాసిన చీరెగట్టి వెసను
ఠీవి యుడిగి భూషణములన్నియు బాఱవైచి యలుకయింటి-
లోనొంటిగా నేలఁబడి పొరలుచుండెను దయగలవాఁడైన
పావనుండైన ధీరుఁడైన దేవసముఁడైన గాని కుజన-
తావినోదమును వీడఁడేని తద్గుణానుసారియౌను నిజమిది ॥సరస॥
అంతటను దశరథుఁడు కైకగృహంబునకు జని నిశ్శబ్దమై
కాంతిచెడి భ్రాంతిపడి మెలఁగెడి కలికితండముగని కలఁగి విభుఁడు
యింతవింత యిదేమియనఁ జెలులెఱుక మాకైక యలగినయది
సంతసము సేయుమన విని యా దంతిగమనను డాసి నీకీ
చింత యేమిటికి కైక నీదు చిత్తమెటు లటులఁ జేతునని ని-
తాంతమోహమునను పాదములకపుడు నృపుఁడు మ్రొక్కి దక్కినాననె ॥సరస॥
పలికి బొంకనివారు మీరలు ప్రాణేశ మునుపు నాకొసఁగిన
యలఘువరములకు భరతుని రాజ్యాధిపతిగా రాముని కానలో
వెలయఁ బదునాల్గేండ్లు మునియై నిలువ సెలవీయుమనుచు కైక
పలుక విని వజ్రహతవృక్షము చెలువునను భువిఁ బడి యంతలోఁ
దెలిసి చెడుగుకల గంటిననుచుఁ దలఁచి వెడఁగు కలకంఠినెదుట
పులివలెం గని తిరుగ మూర్ఛిలిన చెలులు బోధచేసిరా ధరాధిపు ॥సరస॥
భార్య గావీవు శత్రువు నా పాలిటి నీకు రాముడు పరి-
చర్య యాశ్చర్యముగ సల్పును సతి నీవు రాముని మెత్తువెపుఁడు
ఆర్యసమ్మతుని బొమ్మన నే నతివ రాజ్యముగొమ్మని నృప-
వర్య బొంకిన నరకమునఁ బడువాఁడవని కైక వలుక దశరథుఁడు
కార్యమేమనుచు వనటనొంది కందియుండె నారాత్రి చనిన
సూర్యోదయమున దౌర్యత్రిక సుభగనాద శుభవినోదము లెసఁగె ॥సరస॥
ఛత్రచామరతురగకరిరథ సముదయము గనుపట్టె భూషిత-
గాత్రుని బవిత్రుని సుమిత్రాపుత్రయుతుని కరీంద్రారూఢుని
జైత్రాతపత్రాన్వితుని రామచంద్రుఁ గని జను లలరియుండిరి
ధాత్రీశుఁ డేమో రాఁడని యత్తఱి సుమంత్రుఁడు చనిమ్రొక్కి హా
పుత్రలలామ హా రామ యని పొగులు రాజు గని కైకనడుగ
రాత్రి నిద్రలేదితనికి శ్రీరాము సుగుణధాము దోడితెమ్మనె ॥సరస॥
దశరథాజ్ఞను సుమంత్రుడు జని తగ రామవిభు దోడితెచ్చిన
శశివదనుఁ డసితతనుఁడగు రఘుసత్తముఁడు తండ్రికి బ్రణమిల్లెను
బిసరుహాక్షుని గౌఁగిలించుక పృథివీశుఁ డేడ్వఁగ వసిష్ఠుఁడు
మసలకను వచ్చె రాముఁడిదే మన కైక భరతునకు రాజ్యము
అసదృశాటవికి నిను బనుప నడిగినానని పితృవాక్యము
విసువక నడపెదననె శేషగిరిశిఖరాలయుఁడు విశాలమతియై ॥సరస॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi