కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
అయోధ్యాకాండము-02
రాగం: పూరికల్యాణి - తాళం: ఆది
పల్లవి:
వినవే శుకవాణీ మాణిక్యవీణావాదనపటువాణీ ॥వినవే॥
అనుపల్లవి:
మనువంశ్యుడు దశరథుడంతట మం-
తనమున వసియించి వసిష్ఠుని ఘనముగ రావించి మన్నించి
వినుమని పలికె మహాత్మ నిఖిలజనులును మాటికి వొగడెదరు శ్రీరాముని
ఘనగుణాభిరాముని యువరాజునుగా నొనర్పవలె నిపుడె భరతుఁ డను-
జుని గూడి చనెను మామను గనుఁగొన శుభదీక్ష నునుపు రాముని రయముగ ననె ॥వినవే॥
చరణములు:
నరమౌని దశరథుని వీడ్కొని రఘువరు నగరికి వేగ రాఁగా శ్రీ-
వారి యెదుర్కొని బాగా వసిష్ఠుని పరఁగ సత్కృతులు గాఁగా జేసి సీతా-
తరుణి హైమకలశోదకము లొసంగఁగ
గురుని యడుగులు గడిగి శిరమున నవ్వారి
ధరియించి సేమమడిగి పూజించి నీ
చరణనీరధారణమున గృతార్థుఁడనై
మెఱసితినను దాశరథి పలుకు విని
చిఱునగవు దొలకఁగఁ బలికె మును నీ చరణజలము హరుఁడు శిరమునందిడి
పరమపురుషుఁడాయె మాతండ్రి నలువయు నీ పదాంబువుల సుఖియయ్యె ననెను ॥వినవే॥
ఇటులనఁదగునే లోకగురుఁడవు విశ్వేశుఁడవనియు రమాపతివనియు సము-
త్కటయశుఁడవనియు బరమాత్ముఁడవనియు నిన్ను
కుటిలులకెఱుఁగ వశమా భక్తపాలన-
చటులుఁడవై భూభారము మాన్ప రావణుని జంపఁగ మదినెంచి పుట్టితివని
దిటవున నిశ్చయించినాను నేను
అటులైన బహుగోప్యముజేసితి నీ వెటులమాయచే సర్వముఁ జేయుదు
వటుల నే గురుఁడనని శిష్యుఁడ వీవనుచు నటన సల్పితి స్వామి జగ-
న్నటనాసూత్రధారి యఖిలభూతాంతర్యామియనన్‌ వెలయుదువనెను దపసి ॥వినవే॥
నీవు శుద్ధసత్త్వమయమైన మేను నెరిఁబూని భువియందు మాయామనుజ-
భావమునఁ జెలఁగుచుందు వకట రాజ-
సేవ గాసిఁ జెందు పౌరోహిత్యజీవన మతినిందితమని దెలిసియు
నీవు రఘువంశమున జనియింతువని భావించి సంతసమున నీకు గురుఁడనై
యే వేడుకకిది నే నియ్యకొంటి నా తపమిప్పుడు ఫలియించె నన్నిక నీమా-
యావిభూతి కగపఱుపకు దశరథభూమివిభుఁడు నిన్ను పట్టముగట్ట శు-
భావహుఁ గమ్మనెను సీతతో దీక్షావిధినుండుమని చనియె వసిష్ఠముని ॥వినవే॥
శ్రీవిభుఁడు లక్ష్మణుని గని నన్ను యువరాజ్యాభిషిక్తుఁ జేసెదరు నేను సాక్షిమాత్రుఁడను
నీవె సకలముఁ బూను కర్తవు భోక్తవు నీవే నా ప్రాణములు మేను సుమ్మని పలికె
నావేళ పౌరజనులు రాముని యువరాజ్యశ్రీ విని కడుహెచ్చి దశరథుని మెచ్చి
యావార్త లపుడె దెచ్చి కౌసల్యాదేవితోడ సుమిత్రాదేవితోఁ దెలుప వార-
లా వాక్యాకర్ణనమున సంతోషపూర్ణులై వెలసిరి సురలు సరస్వతిఁ గని
దేవి నీవయోధ్యకుఁ జని విఘ్నము గావింపుము రామాభిషేకమున
నా విబుధప్రార్థన కియ్యకొనె వాణి ॥వినవే॥
కొమరారు కైక నగరదాసి యొకతె కుంటిదీ గూనిది గుజ్జురూపు-
ది మిడిగ్రుడ్లు ముడిబొమలు డొంకుమై గలది యయోధ్యలోను రమణులకు నవ్వులాటది మంధరయను
కుమతి యొక్కతె గలదు భారతి దానిఁ జెంది కుదురైయుండె నంతఃపురి శృంగారముల
నమరి యంతయు వింతయైయున్నఁ జూచి
భ్రమసి మంధర తొందరతోవచ్చి కైక రేపు
రామునకు పట్టాభిషేకమనిన కైక
ప్రముదమొదవి బంగారందె లొసగఁగా పడఁతి యొల్లకిది భయసమయము సుఖ
సమయము గాదబల శేషశైలస్వామియైన రాముని శుభము నీకనెను ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi