అయోధ్యాకాండము-01
రాగం: కర్ణాటకసారంగ - తాళం: ఆది
పల్లవి:
శ్రీసద్గుణాన్వితా శీతాద్రిసుత వినవే
కౌశేయవాసుని శేషాచలవాసుని చరిత్రము ॥శ్రీసద్గుణా॥
అనుపల్లవి:
భాసిల్లు నంతఃపురవరమునందు మణిసిం-
హాసనస్థితుఁడై మునినుతుఁడై మహో-
ల్లాసుఁడై దరహాసుఁడై శ్రీవాసుఁడై శ్రితదాసుఁడయి సీ-
తాసహితుఁడగు రామునిన్ గను తలఁపూని సురమౌని వచ్చెను ॥శ్రీసద్గుణా॥
చరణములు:
శరదిందుచంద్రికాసదృశమౌ తనుద్యుతుల
మెఱయుచు వచ్చువాని నారదునిగా
నెఱిగి సీతాజానియు దేవీయుతుఁడయి
పొరపొచ్చమింతలేని భక్తిచే మ్రొక్కి
పరఁగఁ బూజించి మౌని నీ దర్శనసం-
స్మరణచే విషయాసక్తచిత్తులమై సం-
సారచింత మాటికి గలుగు మము బోటికి
దొరకదిది దుర్లభము నిను గని పరమపావనుఁడనైతిని భా-
స్కరుఁడు రాఁ దమమడఁగు క్రియ నజ్ఞాన మడఁగునన ముని పల్కెను ॥శ్రీసద్గుణా॥
శ్రీరామ భ్రమయఁ జేసెదవో నను లోకాను-
సారవాక్యములచేను సంసారి ననుటిది యరయ సత్యమేను జగదాదియౌ మా-
యారమణి గృహిణిగాను జేయుటను నీసుతులైరి బ్రహ్మాదులెల్లను త్రిజగన్మహాసం-
సారి వీవు హరి జనకజ లక్ష్మి పురవైరి వీవు సీత హిమశైలజాత
వారిజభవుఁడ వీవు ధరణిజ వాణి రవి వీవు ప్రభ జానకి
యారూఢి స్త్రీపురుషవాక్యములన్ని సీతయు నీవనియెను ॥శ్రీసద్గుణా॥
స్వామీ నీఛాయ యవ్యాకృతమనఁబడునది
యేమూల ప్రకృతి దాన మహత్తత్త్వమామ మహత్తత్త్వాన లింగశరీర-
మై మఱి యది సకలమైన తనువులఁజేసె నహంకారబుద్ధి ప్రాణాజ్ఞాన కర్మేంద్రియ
సాముదాయకము లింగశరీర మనఁబడునదె జన్మకర్మమూలము ఇంద్రజాలము
ఆ మహాత్మయె జీవసంజ్ఞ ననాద్యవిద్యోపాధినొందిన-
దై మించె స్థూలాదిదేహత్రయమె జీవోపాధియనియును ॥శ్రీసద్గుణా॥
స్థూలసూక్ష్మకారణాల జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలు మూడు గల్గె నీసంసృతి
లీలచే నెనయువాఁడు జీవుఁడె పరమాత్మ త్రికాలసాక్షి యీరేడులోకముల కాది-
మూలమది నీవేచూడు మాయాభువన-
జాతములు నీయందె జననస్థితిలయములై జరుగుచున్నవి రామా రాక్షసవిరామా
వ్యాళమని త్రాడు గని బెదరిన పోలికను దను జీవుఁడనుకొను
బాలిశుఁడు ఘనుఁ డాత్మ తానని భయరహితుఁడయి యలరు ననియెను ॥శ్రీసద్గుణా॥
ఏ నీ తేజమున నీయఖిలమును వెలుఁగు నిది ఖలుఁడు తెలియలేక దేహమే పతి-
యని యెంచు పుణ్యశ్లోక యెందాఁక నజ్ఞానము తెగిపోకయుండు నందాఁక
దీనుఁడగు జనుఁడు నీకారుణ్యమున వి-
జ్ఞానానంద మొదవిన నమలుఁడౌనది నీ పాదారవిందభక్తిని గలుగునది ముక్తిని-
దానమగు రామ నీదాసుల దాసుఁడను కరుణ నను బ్రోవుము
నీ నాభికమలజుఁడ మాతండ్రి యటుగాన నే పౌత్రుఁడననె ॥శ్రీసద్గుణా॥
అని చాలాప్రణతుఁడై యానందబాష్పములు
కనుల జడిగొన జడదారి రఘువంశతిలకుని
వినుతించె వేడ్కఁజేరి రావణవధార్థము
జనియించినావు శౌరి దశరథుఁడు నిన్ను
జనవిభుని జేయఁగోరి యున్నాఁడటుల-
యిన రావణుఁడు జచ్చు టెటు లతనిఁ జంపుదు-
నని ప్రతిజ్ఞఁ జేసినావు మును డాసి
వినుము భూభారహరణమునకు మొనయుమిది వనజభవువాక్యము
ననినఁ జిఱునగవు మొగమున జిగి బెనగొనఁగ ననియె శ్రీ రాముఁడు ॥శ్రీసద్గుణా॥
విను నారద నేనెఱుగని దేమియును లేదు
మును ప్రతిన నాచేత నెటు జేయఁబడె నటు
ల నేఁ జేతు సకలభూతముల సుఖాసుఖములు
ఘనకాలసంజాతములు ప్రారబ్ధ-
ముననగునవి భువననేతనై తగులక నేనే
నెనసి వినోదింతునిదె రేపు దండకాటవికేగి
మునివేషము దాల్చి సంతోషము-
నను జతుర్దశ వత్సరములుందును సీతయను నెపమునను రా-
వణుని సబలముగఁ జంపుదునన విని దేవగతిఁ జనె మునీంద్రుడు ॥శ్రీసద్గుణా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi