బాలకాండము-17
రాగం: సురటి - తాళం: ఆది
పల్లవి:
చేరి వినవె శౌరి చరితము
గౌరీ సుకుమారి గిరివరకుమారీ ॥చేరి॥
అనుపల్లవి:
వారిజాక్షుఁడంతటను శ్రీమీఱి వేడ్కతో నయోధ్యకుఁ
గోరి పోవు దారిలో నృపవైరియైన పరశురాముఁడు
కారుమొగుల కరణి చాపధరుఁడై కాలమృత్యువో యనఁగఁ బంక్తిరథు
కేరి హరి యెదుటను నిలిచి పలికెను వీరాధివీరుడని యెఱుంగక ॥చేరి॥
చరణములు:
బెండువంటి విల్లు నడిమికి రెండుజేసి పెల్లుపొందు
కొండ నెనయఁ జెల్లునా విలు దండివైరులకు ముల్లు కడు-
గండు మిగిలి దీన్ని నెక్కుబెట్టినగాని రాముఁడనను నిన్ను నటుగా-
కుండినఁ జంపుదునన రాముఁడతని కోదండముగొని చక్క నెక్కిడి య-
ఖండాశుగము తగఁ దొడిగి తెగనిండ దిగిచి భార్గవుఁడ నిను
కాండాహతచరణుఁ జేసి నృపకాండాభిరాముఁడ వౌదుననినఁ
బుండరీకలోచనుం డితండని పూర్వకాల సంస్మృతి పొడమి పొగడి
భండనప్రచండపండితుండ వజాండాధిపతి వవ్యయుఁడ వనెను ॥చేరి॥
బాల్యమునను నేను ఘోరతపంబుసేయుచోను హరి వా-
త్సల్యమొప్పఁగాను వేగఁ బ్రసన్నుఁడై పలికె దాను సా-
ఫల్యమయ్యె నీ తపమును జనసమ్మతము మచ్చిదంశయుతుఁడవగు సా-
ఫల్యబలుఁడ వగుచుఁ బితృహననుఁడగు కార్తవీర్యు గెలిచి ఖలనృపుల వై-
కల్యాత్మకులఁ జంపి శమదమమూల్యార్జితుఁడవగుము నే గౌ-
సల్యాగర్భమున రాముఁడనఁ గల్యాణదాయినై జనించి య-
హల్యాసతి బవిత్రఁ జేసి సీతను గల్యాణమై నీకు దరిశన మ-
తుల్యముగ నొసఁగుదునని చనియె దయతో నా హరియ నీవని చనియెఁ ॥చేరి॥
స్వామి నేను మించి హేహయవంశజులను ద్రుంచి శాంతుఁడ-
నై ముదము దలంచి చెలఁగెద నీ మహామహిమనుంచి ఖగ-
గామినీబలంబు నీవుగొంటివి గాన నేను ధన్యతముఁడనైతిని
నీ మహనీయ దరిశనము గలిగెఁ బితామహాదుల కగోచరుఁడవు శ్రీ-
రామామనోహరుఁడవగు రఘురామా ప్రకృతికంటె పరుఁడవు
కామాద్యరివర్గదూరుఁడ వహో మాధవ భవరహితుండవు
కామకర్త గుణవర్జితుఁడవు నుదకమున ఫేనజాలములు ననలమున
ధూమమెటుల నటులనే యఖిలమును నీ మాయచేఁ గల్పితంబనె ॥చేరి॥
ఎందాక నరుండ మాయకు హితవు మీఱకుండు విను వాఁ
డందాక జడుండు వానికి నాత్మ గానరాకుండు తన-
యందు గల్గు నవిచారమున విద్య మిగులఁ బ్రబలినదై విద్యనణఁచు
పొందుగా నవిద్యాకృతమగుటను బంధుబింబితుండై జీవాఖ్యను
బొందు తనుమనఃప్రాణములఁ బొందునపుడె స్వాభిమానము
నొందునపుడె సుఖదుఃఖముల నొందు నాత్మకు సంసృతి లే-
దెందు జ్ఞానమిపుడు బుద్ధికిని లేదిది నైజము వ్యాకృతమునఁ బ్రకృతి
పొందుగాను సంసారియయ్యె హుతభుగ్వారి మేళనంపు క్రియననె ॥చేరి॥
ఎంతదాక నరుఁడు నీ పదహితుల పొత్తుఁజొరఁడు వినువాఁ
డంతదాఁక కరుఁడువలెను భవాబ్ధిదిరుగు పామరుఁడు ఏ-
కాంతుడై సుజనసంగతి వలనను గనిన భక్తిచేతనెపుడు నన్ను న-
నంతు నాశ్రయించినపుడు మాయకు నంతమజితుఁడును స్వప్రకాశుఁడును
శాంతాత్మకుఁడౌనైన సద్గురుఁ డంతవాని కగపడును సుని-
తాంతానందమతనిచేఁ గని చింతలతలనెల్లఁ ద్రుంచి ని-
రంతరాత్మ సుఖముఁ జెందు నీ పదరాజీవయుగభక్తి లేని నరు-
లంతమొంది జ్ఞానముక్తిసుఖముల నంద వశముగాక చెడుదురనె ॥చేరి॥
ఈశ శరణుశరణు దురితవినాశ శరణుశరణు సుజన-
క్లేశహరణ శరణూ జయజయ శ్రీరామ శరణుశరణు నేఁ
జేసినట్టి పుణ్యమెల్ల నీదు మహాశుగమున కొసఁగినాఁడ నను దయ-
జేసి బ్రోవుమనఁ బరశురామునకు సీతావిభుఁడు ప్రసన్నుఁడై పలికె
వాసి నీ మనంబునను దలపోసి వరముఁ గోరు నిను కృపఁ
జేసినాననిన భృగుకులుఁడు భాసిల్లుచు నీదు పదరజో-
లేశమునకు నేవరంబు సమ మఖిలేశ భక్తినిమ్మనఁ గృతార్థునిగఁ
జేసి పనుపఁజనియె జామదగ్ని నిజేచ్ఛం దనుజరిపు నుతించుచుఁ జనె ॥చేరి॥
ప్రీతుఁడయ్యెఁ జాలా దశరథవిభుఁ డంతట లీలాగుణముల
చేత నలరి శీలా తగపురిఁ జేరి చక్రి యావేళ భూ-
జాత నెనసి తనరె ననుజులును నిజసతుల రతులనేలి రతులవిభవస-
మేతుఁడు జగత్ప్రభుఁడుఁ బ్రథితగుణజాతుఁ డవ్యయానందమూర్తి సం-
గీతానంతకీర్తి సుగుణభూషాతాద్యఖిలసాక్షి మాయా-
జాతాఖిలకలుషహరుఁడు సాకేతాధిపుఁడైయుండె హరి ద-
యాతిశయత నిదియుఁ జెప్పె సుబ్రహ్మణ్యకవి శేషగిరీశు పేర వి-
ఖ్యాతి మీఱ నధ్యాత్మరామాయణాఖ్యానమున బాలకాండమిది ॥చేరి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi