బాలకాండము-16
రాగం: కళ్యాణి - తాళం: అట
పల్లవి:
కల్యాణము వినవే నేఁడు సీతాకల్యాణము వినవే ॥కల్యాణము॥
అనుపల్లవి:
కల్యాణమయమైన కల్యాణనిలయమున
కల్యాణప్రదుఁడౌ యహల్యావరదుని ॥కల్యాణము॥
చరణములు:
వేదనాదములు వేణుమర్దళ వీణాదుందుభి డిండిమాది మహావాద్య
నాదములు పుణ్యాంగనాబృంద శుభగాన
నాదములుఁ జెలఁగ జనకుఁ డెదుర్కొని దశర-
థాది భూపతుల కర్హాసన మునిచి యా మీఁద సపురోహితు-
డై దేవముఖు హైమవేదిఁ బ్రతిష్ఠించి వివిధమంత్రములచే
వేదోక్త హోమవిధు లొనరించి సీతాది కన్యల ధన్యల నల్వురను స-
మ్మోదమున రావించి మురియుచు శుభజలా-
పాదకముగ మధుపర్కమిచ్చి వేడ్క
బ్రోదిజేసి నృపుఁడు పూజించె రాఘవుల ॥కల్యాణము॥
శ్రీమీఱ జనకుఁడు శృంగారవతియై సౌదామినీలత మాడ్కిఁ దనరెడు సీతా-
కోమలి తెఱమఱుఁగుననుంచి చాల గారామున రామాభిరాముఁడైన శ్రీ
రామచంద్రుని పాదరాజీవములు గడిగి సేమమున తజ్జలము శిరమున ధరియించి
నీమముతో సీత నిఖిలలోకమాత గామితసిద్ధసంకల్పపూర్వకముగ
భూమీశుఁడు ధారబోసె నగ్నిసాక్షిగా మానవతిని రాఘవుఁడు చేకొనె దేవ-
తామందారసుమధారలు గురిసె భద్రామితగుణులై యలరు వధూవరులపై ॥కల్యాణము॥
అంతట దెరదీయ నతివమోముఁ జూచి సంతసించెను రామచంద్రు కన్గవ తార
కాంతు గనుఁగొని యలరు కలువలపోల్కి నా యింతిచూపులు దనరె హృదయేశు పదయుగళి
నెంతయుఁ దామరల నెనయు తేఁటులనఁగా కాంతామణిని పాణిగ్రహణ మొనరఁజేసి
కంతుజనకుఁడు మంగళసూత్రముగట్టి దంతిగమనకు మణులు తలంబ్రాలుపోసి శ్రీ-
మంతుఁడై లాజహోమముజేసి కృతకృత్యస్వాంతుఁడయ్యెను తాటకాంతకుఁ డటమీఁద
సంతతానందమున జనకుఁ డూర్మిళ నిచ్చె మంతుకెక్కగాను లక్ష్మణకుమారునకు ॥కల్యాణము॥
వరుసతోడను కుశధ్వజుని కొమార్తెల సురుచిర మాండవి శ్రుతకీర్తుల నిరువురను
భరత శత్రుఘ్నులకును జనకధరణీశుఁ డానందభరితుఁ డగుచు నొసఁగె నరుదారఁగాఁ బెండ్లి
యలరారె నావేళఁ జిరతరయశులు వసిష్ఠవిశ్వామిత్రులురువుగ నావధూవరులకు సేసలు
శిరమున నిడిరి యాశీర్వాదములఁ జేసి రిరవంద దశరథాధీశుఁడు దీవించె
గరిమను కౌసల్య కైక సుమిత్రాది కరిగమనలు మంగళహారతులొసంగి రా
తఱి రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు ॥కల్యాణము॥
జనకవిభుఁడు కౌశికుని వసిష్ఠునిఁ గనుఁగొని పల్కె నారదముని యచటి కొకనాఁడు
చనుదెంచినను వినుమని పలికె హరి భక్తజనవరదుఁడయి నిర్జరులను బ్రోవ రా-
వణు వధియింప రఘువంశమునను రాముఁడను పేర దాశరథియై నాలుగంశముల
జననమొందెను సీత యను నామమున నీయింటను యోగమాయ పుట్టెను దెలిసి కౌసల్య-
తనయునకు సీతనిమ్మని చనె నదిమొదలుగను సీత శ్రీసతి యని దలఁచి యేవిధ-
మున రాముఁ డల్లుఁడౌ నని చింతించి ధనువను నెపమున మీ దయను శుభము గంటిననె ॥కల్యాణము॥
శ్రీరామచంద్రుని జేరి జనకుఁడు బలికె శౌరీ నాజన్మము సాఫల్యమాయెను
దారసింహాసనస్థలిని సీతాయుతుఁడవై రంజిల నిన్ను జూడ నర్హుఁడనైతి రా-
మారమణ భువననిర్మాణనైపుణి గలిగె నీరజభవునకు నీ పాదవారిచే
నీ రమ్యపదజలము నెరిదాల్చి బలి మహావీరుఁడై సురరాజ్యవిభవము చేకొనె
సారమౌ నీ పాదరజమున నహల్య ఘోరశాపము దొలఁగె కోవిదులును నీ యు-
దారాంఘ్రిరేణువులు కోరి భవభయదూరులైనట్టి నీవే శరణని పొగడె రాముని ॥కల్యాణము॥
సొరిది యాసమయమున సురదుందుభులు మ్రోసె
ధ్రిగుడు తద్ధిన్నాంత కిటతక తాథైథైయ్య యనుచు నచ్చరలా-
డిరి గంధర్వవరులు బాడిరి భూసురవరుల ధరణీవరులఁ బూజచేసి
సరసమృష్టాన్న భోజనములిడిరి కరణి పరగ నాల్గునాళ్లు జరుగుటయుఁ గౌశికుఁ
డరిగె నల్లుండ్రకు నరణమిచ్చిన నృపుఁడు కరుణచేఁ బుత్రికల ఘనమతులఁ గాంచి
త్వరతోడఁ బనుప నా దశరథక్షితిపతివరసుతులు గోడండ్రు సిరులలర నాశేష-
గిరివాసుఁడైన రఘువరుని మున్నిడుకొని పురికి ప్రయాణోన్ముఖుఁడయ్యె ముదమున ॥కల్యాణము॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi