కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
బాలకాండము-15
రాగం: కాపి - తాళం: జంపె
పల్లవి:
విను హైమవతీ ఘనాఘనసుందరాకృతీ వినుతధృతీ కరుణామతీ ॥విను॥
అనుపల్లవి:
తన మంత్రులను బనిచె దశరథుని తోడి తెమ్మని జనక నృపతి వేగా బాగా ॥విను॥
చరణములు:
ఆరూఢి దివసత్రయమున వారలయోధ్యఁ జేరి దశరథుని గాంచి
ధీరులై మ్రొక్కి బహుదివ్యవస్తువుల నరుదారగా గాన్కయుంచి
శ్రీరామునకు జయ శ్రీరమారామునకు సీతనీ నిశ్చయించి నేఁడు శ్రీ-
మీఱ మిము బిలువనంపెను జనకుఁడన సంభ్రమించి వేడుక దలంచి మించి ॥విను॥
జనవిభుఁడు శ్రీరామచంద్రునకు గళ్యాణమని చాట నానతిచ్చి
జనకమంత్రులకు నుత్సాహమున రత్నభూషణదుకూలములనిచ్చి
తన గురుండగు వసిష్ఠుని సుమంత్రుని గని రాముని పెండ్లి వార్త దెచ్చి తగు గదా
జనకవిభు బాంధవ్యమనిన కడులెస్స యని రనువుగా ముదము హెచ్చి మెచ్చి ॥విను॥
మరునాఁడు గురుహిత సమస్తజనులెల్ల వేమఱు బలసి కొలువగాను
అరుదైన యాణిముత్యముల గొడుగులనీడ నధికవైభవముతోను
భరతశత్రుఘ్ను లిరువురు గజారూఢులై యిరుగడల జేరి రాను రథమెక్కి
నరవరుఁడు మిథిలానగరమునకుఁ జనె నెలమి నాల్గుపైనములలోను తాను ॥నిను॥
హితమతిని దశరథున కెదురుగాఁ జని పురోహితసహితుఁడై జనకుఁడు
చతురుఁడై పూజింప సరసులై రామలక్ష్మణులు తమ తండ్రి కపుఁడు
అతిభక్తి ప్రణమిల్ల నాలింగనమొనర్చె నానందమునను నృపుఁడు తత మహో
న్నత జనకరాజసదనమున సుతకౌశికాన్వితుఁడై వసించె నతఁడు జనహితుఁడు ॥విను॥
తన యాగకర్మమంతయుఁ దీర్చి జనకుఁడు శతానందుతోడ ననెను
దనర సంకాశ్యపురమున మదనుజుఁడు కుశధ్వజుఁడుండు మోదమునను
మొనసి పిలనంపుమన విని యట్లుసేయఁ జయ్యనవచ్చి యతఁ డన్నను పొడగాంచి
తన కుమారికలు తానును మ్రొక్కి వర్ధిల్లుఁ డనుచు దీవెనను గొనెను మనెను ॥విను॥
లలిని జనకుఁడు పుర మలంకరింపుమనఁ దోరణచయోల్లాసితంబు
అలఘుసౌధధ్వజోజ్జ్వలము గోపురవితానావళీ రాజితంబు
ఫలభారనమ్రరంభాస్తంభశోభిత ప్రతిగృహప్రాంగణంబు కర్పూర
కలితాంబుపూరగంధిల రాజమార్గంబు కైసేసిరా పురంబు డంబు ॥విను॥
క్రమముతో నంతఃపుర మలంకరించి బంగారుకుంభములనుంచి
సమమైన పచ్చరా జగతిపై నిలిపి నీలముల బోఁదెలు ఘటించి
రమణీయముగను బగడముల దూలములు వజ్రముల గొణిగెలు రచించి చతుర్ద్వా
రముల గొమరొప్పఁ గల్యాణవేదికగట్టి రమరికను సంతసించి మేలెంచి ॥విను॥
ఎలమి సీతాది కాంతలకు నలుగులుపెట్టి తలలంటి జలకమార్చి
జిలుగులను దడియొత్తి చెలఁగి సరిగంచుచీరెలుగట్టి కురులుగూర్చి
వలనొప్ప గొప్పకొప్పులుబెట్టి చందనం బలఁది తిలకములు దీర్చి రవికలను
పొలయ చనుకట్టుపై నలవరిచి కైసేయ నలఁది రసమముగఁ జేర్చి మదిచేర్చి ॥విను॥
పరగ కేకయపతికుమారుఁడు యుథాజిత్తు వచ్చెనచ్చటికి నంత
వరుస దశరథుఁడు నల్వురుసుతుల భూషణావళుల గైసేసి చెంత
సిరులలర దానుండు తరి జనకుఁ డానందభరితుఁడై భద్రదంతావళములను
గరిమమున బనుప రాఘవులెక్కి రాజమార్గమునఁ జూపట్టిరంత వింత ॥విను॥
పొదలుచును గౌసల్య మొదలౌ సతులు గొల్వ భూపతులు చేరి కొలువ
విదిత మాగధవందిబృందములు గొలువ నటవిట గాయకులును గొలువ
సదయులు వసిష్ఠ విశ్వామిత్రులాశీర్వచనము లొసఁగుచును గొలువ కల్యాణ
సదనమున కరిగె శేషగిరీశుఁడౌ రామచంద్రుఁ డెద ముదము మొలువ చెలువ ॥విను॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi