కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
బాలకాండము-14
రాగం: బేగడ - తాళం: ఆది
పల్లవి:
వినీలవేణి వినుతగుణశ్రేణి వినవే శర్వాణి ॥వినీలవేణి॥
అనుపల్లవి:
ఘనాఘనాంగుఁడౌ రామునిచే ననుజ్ఞగొని గౌతమ
మునియొద్దకుఁ జనె నహల్య మునీంద్రుఁడా రామునిఁ జూచి పలికె
ఘనంబుగను మిథిలాపురంబునను క్రతువరంబు మాహేశ్వరచాపము
కనుంగొని యనంతరం బయోధ్యకు జనేవనన్‌ వినమ్రుఁ డయ్యెను హరి ॥వినీలవేణి॥
చరణములు:
రంగదభంగతరంగ గంగ నుప్పొంగుచు దాఁటి విదేహరాజపురి
చెంగట రాగనెఱింగి జనకుఁడు చెలంగుచు నెదురుగను
రంగుగఁ జని గాధేయునకును సాష్టాంగ మెఱఁగి పూజించి దిశలు వెలుఁ-
గంగఁజేయు చంద్రసూర్యులో సురపుంగవులగు నరనారాయణులో
శృంగారకళల బంగారుతళుకులనంగాను దగిన వీరులెవ్వ-రెఱుంగవలయు నన దశరథాత్మజులు
మంగళకరులీ రామలక్ష్మణులు మహాభుజుల్‌ ఘనులని ముని దెల్పెను ॥వినీలవేణి॥
ఠీవిగ మత్క్రతుసంరక్షణమునకై వీరల నే దోడితెచ్చునెడ
పావనుఁ డీరాఘవుఁ డొకశరమున జావనేసెఁ దాఁటకను
భూవర మదీయ యాగవిఘాతకులై వరలు సుబాహుప్రముఖ నిశచ-
రావళిఁ ద్రుంచియు మారీచు జలధిలో వైచెఁ బదాంబుజ రజమునను
యీ వీరుఁ డహల్యను వేవేగఁ బవిత్రను
గావించి నేఁడు నీగృహంబున గరళకంఠు విల్గనుఁగొనవచ్చెను
నావుడు నగరికిఁ దోడ్కొని చని యానరేంద్రుఁ డా రాముని బూజించెను ॥వినీలవేణి॥
అంతట జనకుఁడు మంత్రులఁ బిలిచి పురాంతకు విలు దెమ్మనిన భటుల న-
త్యంతబలుల నైదువేలఁ బంపిన బంతముమీఱఁ జని
సంతతమును మణివస్త్రాదులచే నెంతయు భూషితమై ఘంటాశత-
కాంతమైన విలు దెచ్చిన ధరణీకాంతుఁడు కౌశికుఁ గనుఁగొని యా
వింత నృపవరులంతా జూడఁగ సంతోషమున రఘూద్వహుండీ చాపమెక్కిడినఁ జాలును సీతా-
కాంతనిత్తునన విని శ్రీరాముని కనుంగొనెన్‌ ముని దరహాసమునను ॥వినీలవేణి॥
శ్రీరాముఁడు వామకరంబున విల్లారూఢిగఁ గొని యెక్కిడి నృపతులు
చేరిచూడ దక్షిణకరమున నరుదార దిగిచినపుడె
సారముచెడి ఫెళఫెళమని విరిగెను వైరివరుల ధైర్యముతోఁ గూడఁ ద-
దారవము దిశల్నిండె దివి విమానారూఢు లగుచు గనుఁగొను దేవత
లారాముని శ్రీమీఱఁ బొగడిరి తోరంబుగాఁ బ్రసూనవర్షము దుందుభిధ్వనుల్‌ సురవనితాజన
చారునాట్యములు చెలఁగ రాఘవుని జనేశుఁ డర్మిలి గౌఁగిట నుంచెను ॥వినీలవేణి॥
ఫుల్లాంబుజపత్రాక్షుఁడు రాముఁడు విల్లువిఱచుటలు విని యంతఃపుర
పల్లవాధరులు మన సీతకు శ్రీవల్లభుఁ డనఁదగిన
వల్లభుఁ డిదె వచ్చెను చల్లనివాఁ డెల్లజగములను నేలఁ జాలువాఁ
డల్లమరునైన జక్కఁదనమున నుల్లసంబులాడునటె యమ్మ-
చెల్లా రామునివల్లా కోరికలెల్ల ఫలించు వంశపావనుఁ డీమహాత్ముఁడంచని పలికి సరస
సల్లాపములాడుచు సీతకు మణిసరుల్‌ విరుల్‌ హరువుగ గైసేసిరి ॥వినీలవేణి॥
పట్టుచీరె గటిగట్టి రవికె చనుకట్టు దిట్టముగ గట్టి మృగమదము
బొట్టు నుదుట నునిచి కనుల కాటుక బెట్టి కురులు దువ్వి
చట్టముగా కీల్ముడివైచి మఱిన్‌ మట్టుమీఱ వేడుకచే సరములు
జుట్టి స్వర్ణభూషణములు మేనను దట్టముగాఁ బూని యొక్కచెలికేల్‌
పట్టి జనకుని పట్టి శౌరికి పట్టంపురాణినౌదు నేనని బాళితోడ గుందనపు బొమ్మవలె
నెట్టన రాజమరాళ కరిగతుల నెరా నిరాకరింపుచు నడిచెను ॥వినీలవేణి॥
తాటంకద్యుతి దిక్కులనెల్లను దీటుకొనఁగఁ బాపట బొట్టును సరి
సాటిలేని చంద్రసూర్యులును సయ్యాటమునను మెఱయ
తేటపు ముత్యపుసరులు పతకములు మేటిచిలుకతాళి తోడ బెనఁగొన
మాటికి నందెలు ఘల్లని మ్రోయగఁ దీటులేని వైఖరి సీతా వ-
ధూటి గుణముల పేటి హారకిరీటాది భూషణాఢ్యు శేషగిరీశు రామభూవిభుని చేరి మణి-
హాటకమయమాలిక గళముననిడి హరిన్‌ వరించితినని చనె ముదమున ॥వినీలవేణి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi