బాలకాండము-13
రాగం: బిలహరి - తాళం: అట
పల్లవి:
శరణు శరణని రామచంద్రుని యహల్య సన్నుతించెను వినవే ॥శరణు॥
అనుపల్లవి:
పరమపురుషుఁడనుచు గౌతమవాక్యసరణి మదిలో నెన్నుచు శౌరికి మ్రొక్కి
యరుదార నర్ఘ్యపాద్యములిచ్చి హర్షవిస్ఫురితాక్షియై మించి పులకించి నీ
చరణనీరజ పరాగమునను దురితమెల్లను దొలఁగె నహహా
గరిమతోను గృతార్థనైతి జగత్ప్రభో కమలావిభో హరి ॥శరణు॥
చరణములు:
ఏ విభు పాదరాజీవ రేణువులచేఁ బావనమైనది భాగీరథీ మహా
దేవ బ్రహ్మాది సురావళి నేమహానుభావుఁడు గావించె నేవరదు పదరజము
వేవేల విధములఁ వెదుకఁబడును శ్రుతులచే వనజభవుఁ డెవని శ్రీనాభిపద్మమం
దావిర్భవించె నవ్యయుఁడైన పురవైరి యేవిశ్వగురునామ మేప్రొద్దు భజియించు
నేవీరవరుపాద మీభువనజాలములనెల్ల నాక్రమించెను
శ్రీవనితామణికి నెవ్వని యురము చెలఁగి విహరింప నునికిపట్టయ్యె నే
దేవుని పద మనిందితరాజయోగిహృద్ధ్యేయమై తనరారి చెలువుమీఱు
నావిభుండా వరదుఁడా గురుఁడా పరుండా దేవుఁ డిదె నను
బ్రోవుటకు ప్రత్యక్షమయ్యె నహో విచిత్ర మటంచు నెంచుచు ॥శరణు॥
శ్రీ రఘువర నీ లీల లత్యద్భుతము లేరికి తరముగాదివి తెలియ మర్త్యావ-
తారమునను జగత్త్రయము మాయామోహ పారవశ్యము నొంద భ్రమియించితివి నిర్వి-
కారుఁడ వీవు చలనాది రహితుఁడవు వికారచలనాదులు గలవారివలె నుందు
వారయపూర్ణుఁడ వానందమయుఁడ వక్రూరుఁడ వతిమాయికుఁడవు సంవిస్మయో-
దారవిశుద్ధుఁడ వాత్మప్రజ్ఞాఖండబోధస్వరూపుఁడ వజుఁడవు
పారమార్థిఁకుడ వీవే భూతముల కాధారభూతము నీవే యీ జగము నీవే
సారెకు జగదాశ్రయుఁడ వీవే కర్తృకారణకార్యములు నీ విలాసములు
చేరి కన్గొనఁగ నేరక తనుధారివందురు గాని నిన్ను
విదారితాఖిలకలుషమగు పరతత్త్వమన ఖలులచే నగునా ॥శరణు॥
జలజలోచన నీ వలఘుమాయాగుణములచే బింబితుఁడవై విలసిల్లి జగదుదయ-
విలయములకు బ్రహ్మవిష్ణ్వీశ్వర నామములఁ బూనియున్నావు తెలియగఁ నొకఁడవై
వలను మీఱగాను వాచ్యవాచకభేదముల జగన్మయుఁడవై యలరుచుందువు నీవ-
స్ఖలితతేజుఁడ వోంకారవాచ్యుఁడవు వాక్కుల కగోచరుఁడవు గూఢవర్తనుఁడవు
భళిభళి శ్రీరామభద్ర గుణోన్నిద్రప్రథనాంగణరుద్ర
కలితకౌస్తుభహార శ్రీశేషాచలశిఖరవిహార మోహనాకార
చెలిని చంచలను నిశ్చలజ్ఞానమార్గము దెలియ నెంతటిదానను నీదానను
కలుగఁజేయుము నాకు నీ పదనళినభక్తి నిరంతరమ్ముగఁ
జెలగి వందనశతము లొనరించెదను దాశరథీ దయానిధీ ॥శరణు॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi