బాలకాండము-11
రాగం: నాదనామక్రియ - తాళం: అట
పల్లవి:
ఇందువదనా వినవె యీచరితము కుందరదనా ॥ఇందువదనా॥
అనుపల్లవి:
డెందము శ్రీమన్ముకుందుని పాదార-
విందములం దానందింపఁజేసి రా ॥కేందువదనా॥
చరణములు:
ధీరుఁడు విశ్వామిత్రుఁడు తానయోధ్యకు శ్రీరాముని జూడఁవచ్చెను అని-
వార్యుఁడై సౌధముఁ జొచ్చెను ఎదురుగా రాజు చని తోడ తెచ్చెను మునికి
చారుసింహాసన మిచ్చెను మహోదారుఁడై పూజ యొనర్చెను కరము
లారూఢి నౌదలఁ జేర్చెను స్వామి మీరు వచ్చుట కేమి కారణ మదిదెల్పుఁ
డీరాజ్యమైన మీ కిచ్చెదననెను రా ॥కేందువదనా॥
కౌశికుఁ డాపూజఁ గైకొని పల్కె భూమీశ మరీచ సుబాహులు మాం-
సాశను లద్భుతదేహులు ఘోరపైశాచి ప్రేతవాహులు కాల-
పాశవిడంబితబాహులు దివిజేశాది సురమునిద్రోహులు యజ్ఞ-
నాశకు లధికదుర్మోహులు గాడాసి వారల పొగరడంచ సలక్ష్మణుని
జేసి రామునిఁ బంపుమీ శుభమౌననె ॥ఇందువదనా॥
భూమీశుఁ డేకాంతమున వసిష్ఠుతోఁ బల్కె నేమి సేయుదు నేమందును నెట్లు
రాముని నెడబాసి యుందును సుగుణధామునెన్నఁడు గనుగొందును గురు-
స్వామి యెవ్విధి సుఖము జెందును ఈ విశ్వామిత్రు నుడి యెటు విందును ఇతని
కేమి మనవి జేసికొందును నేను ఈ మాట వినకున్న నిపుడె శాపమిచ్చు
నీమౌని యనిన గురుఁ డిట్లనియెను రా ॥కేందువదనా॥
నరవర వినుమిది పరమరహస్యము నరుఁడా శ్రీరఘురాముఁడు ఘోర-
దురితాంధకారవిరాముఁడు హరి పరమాత్ముఁడు కమలాకాముఁడు భక్త-
వరదుఁడు ప్రణతసుత్రాముఁడు దినకరవంశజలనిధిసోముఁడు మౌని-
వరదేవతాసార్వభౌముఁడు ఇతఁడు పరమేష్ఠిచే తొల్లి ప్రార్థితుఁడయి భూమి-
భరము మాన్ప నీ వరతనయుఁ డాయెననె ॥నిందువదనా॥
రాజా నీవు కశ్యపబ్రహ్మవు కౌసల్య జేజేలకెల్లను తల్లి అదితి-
నా జను తరుణీమతల్లి మీరు శ్రీజాని భజియించి తొల్లి చాలా
పూజింప నతఁడుల్లసిల్లి సుతుఁడనై జనించెద మీకు నెల్లినని య-
వ్యాజకరుణారసముఁ జల్లి నేఁడు రాజీవాక్షుఁడు రాముఁడై చూపట్టె శేషుఁ
డే జుమి లక్ష్మణుఁడిది నిజమనెను రా ॥కేందువదనా॥
వరశంఖచక్రముల్ భరతశత్రుఘ్నులై రరుదార హరియాజ్ఞచేత సురు-
చిరయోగమాయయె సీత యనఁగ మెఱసి జనకవంశజాతయై
పరగుచున్నది ధీసమేత వినుతసరససద్గుణమణివ్రాత యిది
పరమగోప్యము సలక్ష్మణుని రాముని మౌనివరు వెంటఁ బంపుమని పల్కె వసిష్ఠుఁ ॥డిందువదనా॥
రామలక్ష్మణులను రాజు పిలువఁ బంచి ప్రేమతోఁ గౌఁగిట నుంచెను తన మహా-
మహిమను నుతియించెను తనదే మహద్భాగ్యమని యెంచెను వి-
శ్వామిత్రుఁ జాల పూజించెను ఘనశ్యాముని నతని కర్పించెను శుభ-
మౌ మీకని దీవించెను శ్రీరాములంతట ధనుర్బాణతూణీరధరు-
లై మించి మునివెంట నతిమోదమున జని ॥రిందువదనా॥
లలిని బలాతిబలలను రెండు విద్యలు రామునకు మౌని యిచ్చెను రాముఁ
డలరి గంగానదిని మెచ్చెను ఆవలఁ బోవఁ దాఁటకి వచ్చెను దానిఁ
బొలియింప ముని సెలవిచ్చెను ఒక్కములికి యురమ్మున గ్రుచ్చెను దనుజ
విలవిల తన్నుక చచ్చెను ఆ వెలఁది యాబిడరూపు విడి యక్షసతియై
చెలఁగి రామునిఁ బొగడి శ్రీమీఱ జనెను రా ॥కేందువదనా॥
కౌఁగిట రాముని గదియించి జడదారి వేగమే శిరము ముద్దాడెను అంత
బాగాయెనని కొనియాడెను మహాయోగిధ్యేయుఁడవనుచు వేఁడెను హర్ష-
సాగరమున నోలలాడెను మహాభాగుఁడు ముదమునఁ గూడెను వీత-
రాగుఁడై భయమెల్ల వీడెను నిగమాగమమంత్ర రహస్యములను దెల్పె
నీగతి శేషగిరీశుఁడౌ హరికి రా ॥కేందువదనా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi