బాలకాండము-10
రాగం: ముఖారి - తాళం: ఆది
పల్లవి:
రాముని సకలగుణాభిరాముని నిఖిల రాక్షసవిరాముని వర్ణింప వశమా ॥రాముని॥
అనుపల్లవి:
వేమాఱు కౌసల్య నీవేమేమి గోరినా వదియెల్ల
శ్రీమీఱ నొసఁగితి ననుచు ప్రేమచే జననితోఁ బలికిన ॥రాముని॥
చరణములు:
మున్ను బ్రహ్మ నన్ను వేడుఁకొన్న భూభారము దీర్ప
వన్నెమీఱఁగను నేఁడు నీ గర్భమున
జెన్నలరఁ బుట్టితిఁ జూడు రావణాసురుఁ
డన్నిట గర్వించినాఁడు వాని వధియించి
సన్నుతి గాంతు నీరేడు జగములోన
మున్నలర దశరథుఁడు నీవు నన్ను దపమున మెప్పించి
కన్నారు నీవదితి వతఁడు కశ్యపుఁడని కౌసల్యకుఁ దెలిపిన ॥రాముని॥
అనుచుఁ దల్లితోఁ బలికి హరి ముద్దుబాలుఁడై కలికి-
తనమున హరి నీలగాత్రుఁడై వికసితనవ్య-
వనజదళ విశాలనేత్రుఁడై చక్కనివాఁ
డనుచు నుతియించ పాత్రుఁడై అమల ప్రకాశ-
మునకుఁ జూడఁ దరుణమిత్రుఁడై విలసిల్లెనంత
ఘనుఁడైన తనయుఁడు గల్గెనని విని దశరథుఁ డానంద-
మునను గురునితోడఁ గూడి చనుదెంచి కన్గొనెను శ్రీరఘు ॥రాముని॥
విరులవానలపుడు గురిసె వేడ్క జయదుందుభులు మొరసె
సురసుందరు లెలమినాడిరి గంధర్వవరులు
సరసులై రాగములు బాడిరి మౌనులు దోషా-
చరులవలని భయము వీడిరి పౌరులానంద-
కరుని చూడ గుమిగూడిరి దశదిశలయందు
పరిమళమిళితములైన తెమ్మెరలు విసరె దివిని సురలు
వరవిమానారూఢులై శ్రీహరి హరియని మ్రొక్కి రాత్మా ॥రాముని॥
ఘనవిభుఁడైన కొమరుని గనెను కైక చంద్రబింబా-
ననులను సుమిత్ర గనెను సుతుల నిర్వురను
మొనసి సంతోషమునను దశరథుఁడు సకల
ధనముల విప్రుల దనిపెను వసిష్ఠమహా-
ముని యా బాలురకు క్రమమునను రామభరత ల
క్ష్మణశత్రుఘ్నులనుచు నామకరణము లొనరించె భరతుండును
శత్రుఘ్నుఁడు జోడై లక్ష్మణుఁడు ననుసరించెను దశరథ ॥రాముని॥
చెలఁగి సౌమిత్రితోఁగూడ మెలఁగుచుఁ దేనియలొలుకఁ
బలుకు సుతుని నృపుఁడు గాంచి భూషణజాల-
ములతోడ నలంకరించి శిస్తుగఁ గస్తూరి-
తిలకము నుదుటనుంచి గళమున రత్న-
కలితహారములు గీలించి ముద్దాడునపుడు
కలకల నవ్వుచు మద్దికాయలల్లాడ నందియలు
ఘల్లుఘల్లుఘల్లనుచుమ్రోయ లలిత గతుల నటియించు శ్రీ ॥రాముని॥
చిన్నారిబొజ్జలో నన్ను గన్నవాఁడా నా పాలిటి
పెన్నిధానమ రారా యోరి నా చిన్ని-
యన్న బూచివచ్చే రారా పరుగెత్త వల-
దన్న నాతో నలుగ మేరా పాట బాడుచు
నిన్ను లాలి యూచే రారా లాల బోసేను
మన్ను చేతనంటవద్దు వెన్న బెట్టేననుచు చాలా
మన్నించి పలుకు కౌసల్యకు మరులు రెట్టింపఁజేయు శ్రీ ॥రాముని॥
ధరణివిభుఁడు భుజియించు తఱిని కౌసల్యతనయుని
మురిపెమున రమ్మనుచుఁ జీర నరయోగిహృదయాం-
తరమునందుఁ జెల్వుమీఱ వసియించు దేవుఁడు
చిరుతవాఁడయి ముద్దుగార వచ్చినఁ జూచి
తరుణి తనదు కోర్కెలుమీఱ కౌఁగిటనుంచి
కరుణించి భుజియించుమనిన కబళము చేనందుకొని
తిరుగా నాటలాడు పరుగెత్తిన మాయాబాలుఁడౌ శ్రీ ॥రాముని॥
వితతయశుఁడు దశరథభూవిభుఁడంతట కౌమారా-
న్వితుల సుతులఁ దిలకించి యుపనయనములు
నతులముగ నొనరించి వసిష్ఠునొద్ద
శ్రుతులనెల్లఁ జదివించి చతురంగముల
గతులఁ దెలియ నేర్పరించి చౌషష్టివిద్యల
చతురులను గావించి హర్షించ వారు
సతతము గురుబంధుమిత్రజనులకెల్ల హితులై ధైర్యో-
న్నతులై పరగిరందులో శ్రీయుతుఁడయి సత్యవ్రతుఁడైన శ్రీ ॥రాముని॥
తల్లిదండ్రులకు ప్రియము దనరగ నశ్వమునెక్కి
విల్లునమ్ములు చేపట్టి వేఁటలాడుచు
మొల్లమున నడవినున్నట్టి మృగముల గుండెలు
ఝల్లుఝల్లనఁ జుట్టిముట్టి పోనీక వాని-
నెల్ల చలపట్టి పడఁగొట్టి సౌమిత్రిఁ గూడి
బల్లిదుఁడై యన్ని యయోధ్యావల్లభునకు కాన్కజేసి
సల్లలితుఁడై సకలజనుల సవినయముగాఁ బాలించు శ్రీ ॥రాముని॥
శైలరాజకన్యకా యీ చందమున మనుజావతార
లీలనె వర్తించె శౌరి కనుఁగొను మింద్ర-
జాలికుఁడు చక్రధారి సమస్తవేద-
మూలమై విలసిల్లు దారి యజ్ఞులు దెలియఁ
జాల రతఁడు నిర్వికారి విమతసంహారి
శ్రీలచే జెలువందు శేషశైలశిఖరాగ్రవిహరణ
శీలుఁడై సద్భక్తలోకపాలుఁడై దనరు నిత్యాత్మ ॥రాముని॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi