బాలకాండము-08
రాగం: కన్నడ - తాళం: ఆది
పల్లవి:
అందముగ నీ కథ వినవే రజతాచలసదనా పరిహసిత వి-
నిందితారవింద చంద్రవదనా కుందబృంద సుందరరదనా ॥అందముగ॥
అనుపల్లవి:
మందయాన దశరథ వసుధేశుఁడు మాన్యయశుఁ డయోధ్యాకాంతుఁడు
పొందుగఁ దనయులు లేనందుకు వగఁ జెంది వసిష్ఠునిఁ జేరి పల్కె సా ॥నందముగ॥
చరణములు:
మనవి వినుము స్వామీ నాకిఁక శ్రీమంతులై సుతులుఁ ఏ వెర-
వున జనియించెద రాత్మజహీనునకు ధనంబు సుఖకరంబు గాదుగదా
అనిన రాజుకనియె నా వసిష్ఠుఁడు జననాయక నీకు కొడుకులు
ఘనులమన యశోధనులు నల్వురిక గల్గెద రందుకుపాయము గలదనె ॥నందముగ॥
శాంతుఁడైన ఋశ్యశృంగ మౌనీశ్వరుని బిలువనంపు మీవు ని-
తాంతపుత్రకామేష్టి నిరంతర సంతోషస్వాంతుఁడవై యొనరింపు
మంతయుఁ ద్వరగా ననుఁడును శాంతాకాంతుని రావించి రిపుదు-
ర్దాంతుఁడు మునిపరివృతుఁడై సరయువు చెంత యజ్ఞదీక్ష చేకొని నిలిచె ॥నందముగ॥
వేదమంత్రములు బలుకుచు శుచియై వేల్వగ హుతవహుఁడు హవ్యము
సాదరమునఁ గైకొని తగఁ బ్రదక్షిణార్చు లలర జ్వలియించెను వసుప్రభుఁడై
ఖేదహరుఁడు యజ్ఞేశుఁడు దశరథ మేదినీశ్వరునకు శుభసం-
పాదకమగు పాయసపాత్ర మొసఁగి పరమాత్ముఁడు సుతుఁడగు నీకని చనె ॥నందముగ॥
లలి నలరిరి మౌనులు లబ్ధమనోరథుఁడై దశరథుఁడు ముదమున
జెలఁగుచు ఋశ్యశృంగ వసిష్ఠులచే ననుజ్ఞఁగొని హవిస్సు వేడుకను
కలితగుణుఁడు కౌసల్యకు సగమును కైకకు సగమొసఁగ వారలు
దెలిసి సుమిత్రకు దమ యంశములం దెలమి సగము సగ మొసఁగిరి నిరతా ॥నందముగ॥
పరమాన్నము భుజియించిన మువ్వురు తరుణులు గర్భిణులై వెలిఁగిరి
నిరతము సురకాంతలనఁగఁ దొమ్మిది నెలలు నిండ కౌసల్య గనెను సుతుని
పరఁగఁ జైత్రశుద్ధనవమిని పునర్వసు నక్షత్రమున సుమనో-
హరకర్కాటలగ్నమునను శేషాచలేశుఁడగు హరి జనియించె సా ॥నందముగ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi