కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
బాలకాండము-07
రాగం: గౌళిపంతు - తాళం: ఆది
పల్లవి:
వినుము ధరాధరవరతనయా ధృతవినయా సరసగుణాభినయా ॥వినుము॥
అనుపల్లవి:
చనువుమీఱ నన్నడిగిన యీ శుభచరితము హతదురితము యిది నిరతము ॥వినుము॥
చరణములు:
రావణాది దుష్టాసురకోటుల మోవలేక భరపీడితయై భూ-
దేవి విమల గోరూపము గైకొని శ్రీవిలసిలు బ్రహ్మలోకమునకు
ఠీవిగఁ నేఁగి విరించిచరణ రాజీవము లశ్రుకణమ్ములఁ దడపుచు
సావధానముగ మ్రొక్కి వినతయై తా వచ్చుట వినుపించె విశదముగ ॥వినుము॥
వనజభవుం డొకముహూర్తమాత్రము మనముననంతయు నూహచేసి క్రొ-
న్ననవిల్తుని తండ్రిని గనుఁగొనుటకు మునిసురపరివృతుఁడై భూసహితము-
గను చని క్షీరసముద్రతీరమున ననుపమభక్తివినమ్రుఁడై హరిని
వినుతించెను వేదాంత వాక్యముల ఘనవినయానందములు పురిగొన ॥వినుము॥
కోటిసహస్రాంశుసమప్రభచే మాటికి దిక్కులు తేటము సేయుచు
హాటకాంబరము కటిపై వెలుఁగ కిరీటహారకేయూరకాంతులు ల-
లాటకంఠబాహువులను దనరగ మేటి కౌస్తుభ శ్రీవత్సములకు
నాటపట్టయి చతుర్భుజుఁడగుచు నిశాటవైరి గనుపట్టె మోదమున ॥వినుము॥
గరుడవాహనారూఢుఁడు కమలాధరణీయువతీయుగళయుతుఁడు శం-
ఖరథాంగగదాపద్మవిరాజితుఁ డురుతర వనమాలికాభిరాముఁడు
ధర నీరేజవిశాలలోచనుఁడు పరమామృతకరుణాలోకనుఁ డగు
హరిచరణద్వయి శిరము సోఁకగను సరసిజగర్భుఁడు మ్రొక్కి పలికె నది ॥వినుము॥
తనువు మనసు ప్రాణము లింద్రియములు వినుత నిశ్చయాత్మికమగు మతితో
నొనగూర్చి భవత్పదవినతుఁడ నైతినని సుహృత్పుండరీకమునకును
గొని నిరతానందానుభవంబున నెనయువారు భవరహితుల భవత్రిభు-
వనము పుట్టి పెరిగి గెడయుటిది నీ ఘనమాయగదా యనె పితామహుఁడు ॥వినుము॥
సూరిజనులు వేదాంతమునందలి సారవిచారము చేసి ఘోరసం-
సారరుక్పీడితుల కౌషధం బుదారభక్తి యనిపల్కిరి గాన య-
నారత మది దయ జేయుమనిన విని శౌరి యజుని కరుణార్ద్ర దృష్టిచే
నారసి నీయభిమతము లొసంగుదుఁ గోరుమనిన నుత్సుకుఁడై పలికెను ॥వినుము॥
శ్రీలలనాధిప చిత్తగింపుమీ భూలోకమునను రావణుఁడనఁగా
పౌలస్త్యుని సుతుఁ డొకఁడు గలఁడు సువిశాలమై తగు మదీయవరంబున
మేలుజెంది సురకంటకుఁడై కడు చాలియున్నవాఁడతనికి మర్త్యుని-
చే లయంబు విధియించితి దనుజుని నీవా మనుజుఁడవై వధింపుమనె ॥వినుము॥
వనజోదరుఁ డిట్లనియెను కశ్యపముని మును నను తనయుని గమ్మని వేఁ-
డిన నే సమ్మతిపడితి నిపు డితం డినకులమున దశరథుఁడైనా డా-
ఘనునకు కౌసల్యకు పుత్రుఁడనై జనియించెద నిజయోగమాయయె
జనకుని యింటను సీతయగును పొమ్మని చక్రి తిరోధానము నొందెను ॥వినుము॥
సురలకు నిట్లనియెను చతురాస్యుఁడు హరివాక్యములెల్ల వింటిరే వా-
నరుల సృజింపుఁడు మీయంశములను పరమేశునకు సహాయము సేయుఁడు
పరమసమ్మతంబగు ననుచు వసుంధర నూరడించి నిజనివాసమున
కరిగె నలువ శేషాచలవాసుని శరణాగతవత్సలుఁ డని పొగడుచు ॥వినుము॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi