కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
బాలకాండము-06
రాగం: కాంభోజి - తాళం: ఆది
పల్లవి:
నే ధన్యనైతినే జగత్ప్రభో సాధులోకవిభో ॥నే॥
అనుపల్లవి:
మాధవ చరణారవింద మకరందము గ్రోలఁ గల్గె ॥నే॥
చరణములు:
మునుమిడి సంశయమనే ముడి వీడె నీయనుగ్రహ-
మున రామతత్త్వము సంక్షేపముగ వింటి కడతేర గంటి
మనసు తనివి దీరదాయె మన్నింపవే దైవరాయ
అనువొంద నిను జేర మాయ యతిదూరమై తొలఁగిపోయె ॥నే॥
అద్వితీయాఖండ పరిపూర్ణానంద వారిధిలోన
చిద్విలాసోల్లాసినై రంజిల్లఁ జేసి నన్ను డాసి
హృద్వికాస మొనరించి హితవాక్యము లుపదేశించుటచే
విద్వన్నుత శంకర విశ్వేశ శంభో మహాదేవ ॥నే॥
స్వామీ నే నీచే విన్న యీ చరితము నవరసభరితము
వేమాఱు దీని వినఁ బల్కు వీను లమృతము జిల్కు
శ్రీమహిళాభిరాముఁడై శేషాద్రిధాముఁడైన శ్రీ-
రాముని దేవతాసార్వభౌముని నీవలన దెలిసి ॥నే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi