బాలకాండము-05
రాగం: సావేరి - తాళం: ఆది
పల్లవి:
వినుమని శ్రీరాముఁడు తాఁ బలికెను విశదముగను జేరి ॥వినుమని॥
అనుపల్లవి:
జనకజచే విన్న యనిలజునికి జ్ఞానజనకమౌనట్లుగాను మోదముతోను ॥వినుమని॥
చరణములు:
సమతను ఆత్మానాత్మ పరాత్మల జాడలు త్రివిధములు పవనజ
మమతాహంకార కర్తృత్వములన మరినయ్యది యాత్మ-
రమణ ననృత జడ దుఃఖములను నీరసమయినది యనాత్మ నిత్యము
విమలము సత్యజ్ఞానానందాత్మిక మిదియె పరాత్మ మహాత్మా ॥వినుమని॥
ఆకాశము త్రివిధంబయినట్లు పరాత్మ త్రివిధమాయెఁ దెలియఁగ
నైకముగాను పరాకారము జలాశయ బింబితమైనఁ
జేకొని తదవచ్ఛిన్నాకాశము చెలఁగి భిత్తియందు నెంతయు
ప్రాకటముగ నిటు ప్రతిబింబితమై ప్రబలిన దీచాయ శ్రీయాంజనేయ ॥వినుమని॥
చాతురి మీఱి నఖండాద్వితీయ చైతన్యము వలన బింబభూతుఁడై
త్రివిధాహంకారవిరాట్పురుషుఁడు చూపట్టె
అతనియం దాభాసరూపమయి భూతేంద్రియమనోవృతమయి
ఖ్యాతి గాంచి జీవాత్మయనఁ దనరెఁ గనుఁగొనుమీ జాడ క్రమముతోడ ॥వినుమని॥
గుణమయ మాయకర్తృతయ పొసంగిన జీవత్వాది మలినములు
గణుతింప నవిచ్ఛిన్నమైన యవి యా పరాత్మ యందు
అనయమునను నారోపణ సేయుదు రజ్ఞానులు భువిలో నెఱుగఁక
అనిశము శుక్తి రజతమని భ్రమయుటే యాభాసమనఁ దగును దెలియనగును ॥వినుమని॥
చెలఁగు నవిచ్ఛిన్నత బ్రహ్మము విచ్ఛేదము కల్పితము గావున
నలభిన్నునకు పూర్ణాత్మకు నైక్యము వలనను సుజనులచే
అలఘు 'తత్త్వమ'స్యాది మహావాక్యములచేఁ బ్రకటమై యలరెడు
వెలయఁగ నైక్యజ్ఞానము గల్గ నవిద్య మాయమౌను గుణములతోను ॥వినుమని॥
పావనులై యీ క్రమమెఱిఁగిన మద్భక్తులు మత్పదముఁ జెందుదు
రీ వసుధను భక్తివిహీనులుగ గర్హితులై దుర్మతులై
కేవలమును శాస్త్రగర్తములఁబడి కెరలి భవశతముల నొందుచు
భావముచెడి సుజ్ఞానదూరులయిపోవుట నిశ్చయము నీకేమి భయము ॥వినుమని॥
పరమమైన యీ యుపదేశము గోప్య మిది భక్తి లేనివారి
కరయ నింద్రరాజ్య మొసంగిన నియ్యకు మిది భవహరము
గరిమ నఖిల వేదాంతసారసంగ్రహము శుభావహము కనుఁగొను
సురుచిర శేషాచల శిఖర నివాసుఁడనై భువిలోను వెలసినాను ॥వినుమని॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi