కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
బాలకాండము-04
రాగం: కేదారగౌళ - తాళం: ఆది
పల్లవి:
సీతారామమారుతి సంవాదము చేరి వినవే శ్రీదము ॥సీతారామ॥
అనుపల్లవి:
సీతాంశుముఖీ యీ చరితమునందలి
చాతుర్యము చూడు సంశయము వీడు
ఖ్యాతిగ మును దశకంఠుని రవికులజాతుఁడైన రఘురాముఁడు సబల
వ్రాతముగను జంపి సాప్తుఁడై సాకేతపురి జేరి యున్నతఱిని నడచిన ॥సీతారామ॥
చరణములు:
హాటక సింహాసనమున రాముడు కోటిసూర్యసమకాంతిని వెలుగుచు
పాటలాధరి ధరాసుతతోడను పరగ వసిష్ఠాది గురుబుధమిత్ర-
కోటి సేవింప నాదినారాయణుఁడౌ మేటిభక్తానుమోది కమలావినోది
దీటు లేక కొలువుండి హనుమంతు మనసు దెలిసి సీతను బలుకుమన ముద్దుగులుక
మాటికి భక్తజనాగ్రణి కృతమతి సాటిలేని శౌర్యధైర్య ఘనుఁడును
మేటియైన యనిలసూను గనుగొని తేటముగను లోకవిమోహిని బలికెను ॥సీతారామ॥
రాముఁడు పరమానందమయుఁడు సర్వచరాచర పరిపూర్ణుఁ డవ్యయుఁడు
సామగానలోలుఁ డచలుఁ డాద్యుఁడు సర్వసాక్షి సుమ్ము వినిర్ముక్త-
కాముఁడిది నిజమ్ము పరమాత్ముఁడనుచు వేమారు దెలిసికొమ్ము భక్తుల సొమ్ము
సామీరీ సంశయమెల్లను పో జిమ్ము నామాట మది నమ్ము ధీనిధివి గమ్ము
యేమనవలెనే మూలప్రకృతిని యీ మహాత్ము సన్నిధానమాత్రను
ఈ మహాద్భుతములొనర్చు మూఢులు స్వామియందు నారోపణ సేయుదురనె ॥సీతారామ॥
ఈ కోసలపురిలో రాముఁడై దశరథునకు నితఁడు బుట్టుటయు విశ్వామిత్రు యాగము
సాకల్యము సేయుటయు నహల్యకు శాపము బాపుటయు విలువిఱచి నన్ను
చేకొని చెలఁగుటయు పరశురాముని ఢాక యడంచుటయుఁ బురిఁ జేరుటయు
కైక వనుప దండకాటవి కేఁగుట ప్రాకట మాయాసీతాహృతియందుచేత
శ్రీకరు రవిసుతుఁ జేరి వాలినటు జీరి వారినిధిగట్టి రావణుని
భీకరాజిఁ దునిమి నన్ను గైకొని సాకేతము జేరుటెల్ల మత్కృతియనె ॥సీతారామ॥
ఆ రాఘవునియందీవిధ మజ్ఞాను లారోపణ సేయుదురు మధుకైట-
భారి నిర్వికారుఁ డఖిలాత్మకుఁడు పరిణామరహితుఁడు బ్రహ్మమే యితఁడు
సూరిబృందనుతుఁడు ఆనందయుతుఁడు భూరిభువనహితుఁడు సకలసమ్మతుఁడు
కారుణ్యనైర్ఘృణ్య హేయోపాధేయ సుఖదుఃఖ గమనాగమనాది ద్వందములు లేవీ
శ్రీరమణీయున కీవిభు నెఱిఁగినవారిఁ జేర వెఱచి మాయ పరువిడు
దారితారి శేషశైలశిఖర విహారిఁ జేరి కడతేరు దారి యిది ॥సీతారామ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi